సీఎం వస్తే మమ్మల్ని ఆపేస్తారా?

ABN , First Publish Date - 2022-08-07T05:24:18+05:30 IST

ముఖ్యమంత్రి వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారా? ఇలా మధ్యలో ఆపేస్తే మా గ్రామాలకు ఎలా వెళ్లాలి’ అంటూ పలువురు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం పర్యటన అంటేనే జనం హడలెత్తి పోతున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

సీఎం వస్తే మమ్మల్ని ఆపేస్తారా?
ఆమదాలవలస బ్రిడ్జి మలుపు వద్ద వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

పోలీసులతో వాహనదారుల వాగ్వాదం
వైఎస్‌ జగన్‌ పర్యటనతో ప్రజల ఇక్కట్లు
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/ఆమదాలవలస,ఆగస్టు 6)

ముఖ్యమంత్రి వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారా? ఇలా మధ్యలో ఆపేస్తే మా గ్రామాలకు ఎలా వెళ్లాలి’ అంటూ పలువురు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం పర్యటన అంటేనే జనం హడలెత్తి పోతున్నారు. ట్రాఫిక్‌ ఆంక్షలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం ఆమదాలవలసలో జరిగిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహానికి హాజరయ్యారు. సీఎం సాయంత్రం 4 తర్వాత వచ్చి 4.40గంటలకు వెనుదిరిగారు. కార్యక్రమం అరగంటలో ముగిసిం ది. ప్రజలు మాత్రం తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. శ్రీకాకుళం నుంచి వచ్చే వాహనాలను ఆమదాలవలస బ్రిడ్జి మలుపు పెట్రోల్‌ బంకు సమీపంలో ముఖ్యమంత్రి రాకకు మూడు గంటల ముందే పోలీసులు నిలుపుదల చేశారు. పర్యటనకు సంబంధమేలేని కొర్లకోట, బొడ్డేపల్లిపేట, వెంకయ్యపేట, లక్ష్మడుపేట గ్రామాల ప్రజలను కూడా నిలిపి వేశారు. ఆమదాలవలస పట్టణంలోకి పెద్ద వాహనాలు అనుమతించలేదు. రైల్వేస్టేషన్‌ వద్ద ద్విచక్రవాహనాలను ఆపివేశారు. సరుబుజ్జిలి నుంచి వచ్చిన వాహనాలను పార్వతీశంపేట, శ్రీహరిపురం సమీపంలో నిలిపివేశారు. నరసన్నపేట నుంచి వచ్చిన వాహనాలను రైల్వేగేటు, కృష్ణాపురం ప్రాంతాల్లో ఆపేశారు. కళా శాలకు ఎదురుగా ఉన్న రోడ్డుకిరువైపులా కొద్ది దూరం వరకు షేడ్‌నెట్‌లను వేశారు. దీంతో ప్రజలు ఇళ్లను దాటుకుని రాలేని పరిస్థితి. రైల్వేస్టేషన్‌ వరకు మాత్రమే ద్విచక్రవాహనాలకు పరి మితి ఇచ్చారు. అక్కడి నుంచి పట్టణంలోకి వచ్చే వారికి ఆటోలు కూడా లేకుండా చేశారు. పెంట్రోల్‌ బంకు వద్ద వాహనాలు నిలుపుదల చేయటంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మధ్యలో ఇలా ఆపేస్తే తమ గ్రామాలకు ఎలా చేరుకోవాలని ప్రశ్నించారు. సీఎం పర్యటనతో తమను ఇబ్బంది పెడతారా? అని నిలదీశారు. సీఎం రాకతో కృష్ణాపురం నుంచి ఇరువైపులా బారికేడ్స్‌తో పాటు ఎవరూ దాటకుండా క్లాత్‌వాల్స్‌ ఏర్పాటు చేశారు. శుభకార్యాల కోసం కళ్యాణ మండపాలు, పంక్షన్‌ హాళ్లకు వెళ్లేవారికి కూడా ఆటంకం కలిగింది. ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నతపాఠశాలకు సెలవు ప్రకటించారు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నా కళాశాల ప్రధాన గేటును వీఐపీ రాకపోకలు సాగించేందుకు కేటాయించటంతో వాహనాల శబ్దాల మధ్య విద్యార్థులు అవస్థలు పడ్డారు.




Updated Date - 2022-08-07T05:24:18+05:30 IST