ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయం.. ‘తగ్గేదే లె’ అంటున్న ఫెడరేషన్
తమ వేతనాలు పెంచాలంటూ సినీకార్మికులు ఆందోళన చేపట్టడంతో బుధవారం షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. వివిధ యూనియన్స్‌కు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున హైదరాబాద్ వెంకటగిరిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. నాలుగేళ్లుగా పెంచాల్సిన వేతనాలను పెంచడం లేదనీ. దీని వల్ల ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామనీ, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగి తమకు తలకు మించిన భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న వేతనాల్లో 30 శాతం పెరుగుదల ఉంటేనే తప్ప తమ సమస్య పరిష్కారం కాదని తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముందు షూటింగ్స్‌కు రండి.. వేతనాల గురించి చర్చిద్దాం
ఇటువంటి నేపథ్యంలో తెలుగునిర్మాతలమండలి కార్యవర్గ సభ్యులు, ఫిల్మ్ చాంబర్ సభ్యులు బుధవారం సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘వేతనాలు పెంచడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రేపటినుంచి కార్మికులంతా యధావిధిగా షూటింగ్స్‌లో పాల్గొనాలి. అయితే కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు. అందరం కలసి షూటింగ్స్ జరుపుకొందాం. ఎప్పటిలాగా షూటింగ్స్‌కి వస్తే విధివిధానాలపై ఎల్లుండి చర్చించి, ఒక కొలిక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే నిర్మాతలెవరూ షూటింగ్స్ చేయడానికి సిద్ధంగా లేరు. నిర్మాతలను ఇబ్బంది పెట్టకండి. వారు సినిమాలు చేస్తేనే మనకు పని ఉంటుంది. అలాగే సమ్మె నోటీసులు పంపించినట్లు వారు చెబుతున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు’ అన్నారు.
వేతనాలు 45 శాతం పెంచితేనే...
ఉదయం 30 శాతం వేతనాలు పెంచితే షూటింగ్స్‌కు వెళ్లడానికి సిద్ధమన్న సినీ కార్మికులు బుధవారం సాయంత్రం స్వరం పెంచి 45 శాతం పెంపుదల ఉండాలని డిమాండ్ చేయడం గమనార్హం. సాయంత్రం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశమై చర్చించుకున్న తర్వాత మీడియాతో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడారు. ‘మేం పాత వేతనాలతో షూటింగ్స్‌కు వెళ్లం. 45 శాతం పెంచితేనే షూటింగ్స్‌కు హాజరవుతాం. ఇవాళ 25 చిత్రాల షూటింగ్స్ ఆగిపోయాయి. మేం కోరుకున్న విధంగా వేతనాలు పెంచకపోతే ఎన్ని రోజులైనా ఇలాగే సమ్మె కొనసాగిస్తాం’ అన్నారు.
నిర్మాతలకు కీలక ఆదేశాలు
ఇటువంటి కీలక పరిణామల నేపథ్యంలో తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి నిర్మాతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి 15 రోజుల పాటు పాత పద్ధతిలోనే సినీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని సూచించింది. ఫిల్మ్ చాంబర్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ కార్మికులకు వేతనాలు చెల్లించవద్దని కోరింది. సినిమా షూటింగ్స్ వివరాలు ఎప్పటిప్పుడు ఫిల్మ్ చాంబర్‌కు తెలిపాలనీ, నిర్మాతలెవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవద్దని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కార్మిక సంఘాల ఒత్తిళ్లకు ఎవరూ గురి కావద్దని, నిర్మాతల మండలి సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు నిర్మాతలందరికీ తెలియజేస్తామనీ ఫిల్మ్ చాంబర్ స్పష్టం చేసింది.
ఆ బెనిఫిట్స్ కూడా ఉండాలి
వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదు. మిగిలిన క్రాప్ట్స్ అన్నింటిలో పెరిగినప్పుడు వారికి కూడా వేతనాలు పెంచాల్సిందే. జీవన వ్యయం ఈ నాలుగేళ్లలో బాగా పెరిగింది. నేను వర్క్ చేసే రోజుల్లో కార్మికులకు 20 శాతం మించి పని దొరికేది కాదు. కానీ ఇప్పుడు దాదాపు అందరికీ పని దొరకుతోంది. కార్మికులకు ప్రావిడెండ్ ఫండ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పిస్తే వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ బెనిఫిట్స్ పొందాలంటే కొంత కార్మికుడు కట్టాలి, కొంత నిర్మాత కట్టాలి. నిర్మాత తన వంతు మొత్తం కట్టడానికి సిద్ధంగానే ఉన్నాడు. కార్మికులు మాత్రం ‘మేం కట్టం. మాది కూడా మీరే కట్టండి’ అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వేతనాలు పెంచడంతో పాటు పి.ఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలి. ఎంత మంది కార్మికులను పెట్టుకోవాలో కూడా యూనియన్లు చెబుతున్నాయి. అది కూడా కరెక్ట్ కాదు. సినిమాకు ఎంతమంది అవసరమో అంత మందిని తీసుకునే అవకాశం నిర్మాతకు ఉండాలి.
తమ్మారెడ్డి భరద్వాజ
సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన సినీ కార్మికులను చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్థి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్లకు సూచించారు. కరోనా కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకూ చూడకుండా రెండుమూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలన్నారు. సినీ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉదృతం కాకముందే ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి.
తలసాని శ్రీనివాస్ యాదవ్