అసైన్డ్‌ భూములకు పరిష్కారం లభించేనా?

ABN , First Publish Date - 2021-02-18T06:07:10+05:30 IST

పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములపై వారికి శాశ్వత హక్కులు కల్పించేలా గత ప్రభుత్వం బహిరంగసభల్లోను, 2014లో ఎన్నికల...

అసైన్డ్‌ భూములకు పరిష్కారం లభించేనా?

పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములపై వారికి శాశ్వత హక్కులు కల్పించేలా గత ప్రభుత్వం బహిరంగసభల్లోను, 2014లో ఎన్నికల మేనిఫెస్టోలోను ప్రకటించింది. ఆ తరువాత మాట మార్చి 1954కు ముందు ఇచ్చిన అసైన్డ్‌ భూములకు మాత్రమే శాశ్వత పట్టాలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీచేసింది. 1977లో అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు నిషేధించినప్పుడు, సహజ న్యాయసూత్రాల మేరకు అంతకుమునుపు ఇచ్చిన పట్టాలకు చట్టబద్ధత కల్పించాల్సి ఉంది. భూమిలేని పేదలకు అప్పట్లో వ్యవసాయానికి అనుకూలంగా లేని బంజరు భూములు పట్టాగా ఇచ్చారు. 40–60 ఏళ్లుగా అప్పు చేసి, చెమటోడ్చి అభివృద్ధి చేసిన భూములపై ఇప్పుడు పట్టాదార్లకు హక్కు లేదనడం ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని సూచిస్తోంది. అసైన్డ్‌ భూములపై హక్కులు కల్పిస్తే, పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయడానికి భూములు లభించవనే యోచనే బహుశా దీనికి కారణం.

పట్టాలు పొందినవాళ్లు కొన్ని దశాబ్దాల తర్వాత వృద్ధాప్యంలో సాగు చేయలేకనో లేక కుటుంబ అవసరాల కోసమో విక్రయిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అసైన్డ్‌ పట్టాలు ఇచ్చిన 15 ఏళ్ళ తర్వాత విక్రయించుకునే హక్కు కల్పించడం హర్షించదగిన పరిణామం. రాష్ట్రవ్యాప్తంగా సతమతమవుతున్న 10 లక్షల మంది అసైన్డ్‌ పట్టాదార్లకు భూమి వారి అధీనంలోకి వచ్చిన 20-–30 ఏళ్ళ తర్వాత అయినా దానిపై శాశ్వత హక్కు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి.

గుండాల రామకృష్ణయ్య


Updated Date - 2021-02-18T06:07:10+05:30 IST