90యేళ్ల విద్యాలయాన్ని మూసేస్తారా?

ABN , First Publish Date - 2021-10-28T05:54:24+05:30 IST

‘‘మా బడే మాకు గుడి. దీన్ని మూసేయద్దు ముఖ్యమంత్రి సారూ’’ అంటూ శ్రీరామపురం ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్ధులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వారికి బాసటగా నిలిచారు.

90యేళ్ల విద్యాలయాన్ని మూసేస్తారా?
విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన

స్వామి ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్దుల ఆందోళన


‘‘మా బడే మాకు గుడి. దీన్ని మూసేయద్దు ముఖ్యమంత్రి సారూ’’ అంటూ శ్రీరామపురం ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్ధులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వారికి బాసటగా నిలిచారు. 1931లో నిండ్ర మండలంలోని శ్రీరామపురంలో స్వర్గీయ మాగార్ల స్వామి నాయుడు దాతృత్వంతో స్వామి ఎయిడెడ్‌ పాఠశాలను ప్రారంభించారు. క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయడంతో అంచెలంచెలుగా ఉన్నత పాఠశాల స్దాయికి ఎదిగింది. పేద పిల్లలు ఎంతోమంది ఆ పాఠశాలలో చేరి ఉన్నత స్దాయికి చేరుకున్నారు. మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి, టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు లాంటి ఉద్ధండులు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు కావడం విశేషం. ప్రభుత్వం ఇటీవల ఎయిడెడ్‌ పాఠశాలలను విలీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే.అయితే విలీనానికి ఒప్పుకోని స్వామి ఎయిడెడ్‌ పాఠశాల యాజమాన్యం టీచర్లను మాత్రమే ప్రభుత్వానికి అప్పగించింది.పాఠశాలను మూసివేసి ఇందులో చదువుకుంటున్న 167మంది విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చుకోమని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించింది.అయితే ఈ పాఠశాలలోనే చదువుకోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. సేవా ధృక్పధంతో నెలకొల్పిన ఇలాంటి ఉన్నత పాఠశాలను యథావిధిగా కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ బుధవారం తల్లిదండ్రులతో కలసి ఆందోళనకు దిగారు. బడి ముందు నిరసన తెలిపాక మండల విద్యాశాఖాధికారికి వినతిపత్రం కూడా అందజేశారు. పాఠశాల నడపడానికి యాజమాన్యం అంగీకరించని పక్షంలో ప్రత్యామ్నాయంగా శ్రీరామపురంలో ఉన్న బీసీ బాలుర హాస్టల్‌ భవనంలో స్కూలు నడపాలని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కోరారు.

                                                                    - నిండ్ర



Updated Date - 2021-10-28T05:54:24+05:30 IST