ఒకవేళ పదవి ఇవ్వకపోతే..: కుండబద్దలు కొట్టిన సిద్ధూ

ABN , First Publish Date - 2021-10-02T22:19:44+05:30 IST

నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సిద్ధూ పార్టీలో కొనసాగుతారా అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తాయి. అయితే అటువంటి ప్రశ్నలకు సిద్ధూ కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనే ఉంటానని శనివారం స్పష్టం చేశారు..

ఒకవేళ పదవి ఇవ్వకపోతే..: కుండబద్దలు కొట్టిన సిద్ధూ

చండీగఢ్: ముఖ్యమంత్రి పదవి అందకపోవడమే కాకుండా కొన్ని విషయాల్లో తనకు ప్రాధాన్యత లేకపోవడంపై అలకబూనిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సిద్ధూ పార్టీలో కొనసాగుతారా అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తాయి. అయితే అటువంటి ప్రశ్నలకు సిద్ధూ కుండబద్దలు కొట్టినట్లు సమాధానం చెప్పారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనే ఉంటానని శనివారం స్పష్టం చేశారు. సిద్ధూ కదలికలపై అనేక కథనాలు, ఊహాగాణాలు వెలువడుతున్న తరుణంలో ట్విట్టర్ ద్వారా వీటికి సమాధానం చెప్పారు. జాతి పిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్ శాస్త్రిల జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీపై తన మనసులోని మాటను వెల్లడించారు.


‘‘గాంధీజీ, శాస్త్రీజీ సిద్ధాంతాలను పాటిస్తూనే ఉంటాం. నాకు పదవి ఉన్నా లేకపోయినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతోనే కొనసాగుతాను. నన్ను బలహీన పర్చాలనే శక్తులు ఏమైనా చేసుకోనవ్వండి. నేను సానుకూల ఆలోచనలతోనే ముందుకు సాగుతాను. పంజాబ్ గెలుస్తుంది, పంజాబీయత (ప్రపంచ సోదరాభావం) గెలుస్తుంది, ప్రతి పంజాబీ గెలుస్తారు’’ అని సిద్ధూ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-10-02T22:19:44+05:30 IST