హైకోర్టు పెడితే సీమ అభివృద్ధి చెందుతుందా?

ABN , First Publish Date - 2021-12-21T07:30:33+05:30 IST

వెనుకబడిన రాయలసీమలో హైకోర్టు పెడి తే, ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి

హైకోర్టు పెడితే సీమ అభివృద్ధి చెందుతుందా?

  • కర్నూలులో హైకోర్టు బెంచి పెట్టండి 
  • రఘురామ కృష్ణంరాజు


న్యూఢిల్లీ, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): వెనుకబడిన రాయలసీమలో హైకోర్టు పెడి తే, ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి అవుతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో అనేక దశాబ్దాల క్రితమే హైకోర్టు ఏర్పాటైనా, దాని చుట్టపక్కల ప్రాంతాలు ఒక్క అంగుళం కూడా ఇప్పటికీ అభివృద్ధి చెందలేదని గుర్తుచేశారు. అభివృద్ధి ముసుగులో సీమ ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం మానుకోవాలని వైసీపీ నేతలను, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.


‘‘హైకోర్టు రావడంవల్ల అభివృద్ధి జరగదన్న వాస్తవం సీమ ప్రజలందరికీ తెలుసు. సీమ వాసిగా సీఎంకి చిత్తశుద్ధి ఉంటే పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ తక్షణమే పూర్తి చేయించాలి. తెలంగాణ సీఎంను కలిసి అంతర్రాష్ట జల వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. దీన్నే అభివృద్ధి అంటారు. అంతేగాని కోర్టు పెడితే అభివృద్ధి జరుగుతుందంటూ ప్రాంతాల మధ్య చిచ్చు రగల్చొద్దు’’ అని హితవు పలికారు. ఏడేళ్లుగా అమరావతిలో కొనసాగుతున్న హైకోర్టును కర్నూలుకు మార్చుతామనడం రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమే అవుతుందని మండిపడ్డారు. సీమలో ఒక హైకోర్టు బెంచి పెడితే, అక్కడ ప్రజలు హైకోర్టుకోసం అమరావతి వరకు రావాల్సిన పని ఉండదని సూచించారు. గత ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు వేసిందని, కొన్నింటిని అమలు చేసిందని గుర్తు చేశారు.


కాగా, సీఎం తెరవెనుక ఉండి కొందరు స్వయం ప్రకటిత మేధావులతో అమరావతి రైతుల సభకు పోటీగా మూడు రాజధానుల కోసం సభ నిర్వహించారని,  సభకోసం డ్వాక్రా మహిళలను బలవంతంగా రప్పించారని ఆరోపించారు. ‘‘జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం పచ్చి మోసం. ఈ పథకం కింద సచివాలయాల్లో పేదల ఇళ్లను రిజిస్ర్టేషన్‌ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆస్తుల రిజిస్ర్టేషన్లు చట్టప్రకారం సబ్‌ రిజిస్ర్టార్లే చేయాలి. గ్రామ సచివాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు చెల్లవు’’ అన్నారు. 


Updated Date - 2021-12-21T07:30:33+05:30 IST