Sep 21 2021 @ 01:07AM

మళ్లీ మళ్లీ చూస్తారు

‘‘ప్రతి సన్నివేశాన్ని మనసుపెట్టి తీస్తా. సినిమా సహజత్వానికి దగ్గరగా, గొప్పగా, కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తాను. పదికాలాలు నిలిచి, భవిష్యత్‌ తరాలు కూడా ఆసక్తిగా చూసేలా ఉండాలనుకుంటాను. నా గత చిత్రాలలానే ప్రేక్షకులు ‘లవ్‌స్టోరి’ని మళ్లీ మళ్లీ చూస్తారనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించుకునే కథ ఇది’’ అని దర్శకుడు శేఖర్‌ కమ్ముల అన్నారు. ‘ఫిదా’ తర్వాత ఆయన రూపొందించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.  నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఆయన పాత్రికేయులతో పంచుకున్నారు.


గాఢతతో నిండిన ప్రేమకథాంశంతో రూపొందిన చిత్రమిది. మంచి పాటలు, ఆకట్టుకునే రొమాంటిక్‌ సన్నివేశాలు, అందరినీ కట్టిపడేసే భావోద్వేగాలు ఈ చిత్రంలో మిళితమై ఉంటాయి. సమకాలీన సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఓ ముఖ్యమైన అంశాన్ని తీసుకొని ఈ సినిమా చేశాం. అదేమిటనేది చెప్పడం కన్నా తెరపైన చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం ప్రేమకథగానే కాకుండా సమాజంలో ఉన్న కుల వివక్ష, లింగ భేదాలను గురించి అంతర్లీనంగా చర్చించాం. పాత్రల తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. 


నాగచైతన్య పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. ఆయన్ను తెలంగాణ కుర్రాడిగా చూపించడానికి అతనితో పాటు మేం కూడా చాలా కష్టపడ్డాం. తెలంగాణ యాసలో సంభాషణలు, హావభావాలు కొత్తగా ఉండేలా ప్రయత్నించాం. పాత్ర తాలూకు మేనరిజమ్స్‌, శారీరక భాషను అర్థం చేసుకొని చైతూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో కొత్త నాగచైతన్యని చూస్తారనే న మ్మకం ఉంది. సాయిపల్లవి నటనా కౌశలం తెలుసు కాబట్టే ఈ సినిమాకు తీసుకున్నాం. ‘ఫిదా’కు పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఈ సినిమాలో ఆమె పోషించారు. 


ఈ సినిమా సంగీతం విషయంలో నేను పూర్తి సంతృప్తితో ఉన్నాను. పవన్‌ అయితే ఫ్రెష్‌ మ్యూజిక్‌ ఇస్తాడు అని భావించి తీసుకున్నాం. నా అంచనాలకు మించి సంగీతం అందించారు. కరోనా సమయంలో మ్యూజిక్‌ తో సినిమాను నిలబెట్టాడు. భవిష్యత్తులో అగ్రశ్రేణి స్వరకర్తగా ఎదుగుతాడు.


లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌, విడుదలలో ఇబ్బందులు వ చ్చాయి. అయినా మా నిర్మాతలు నారాయణ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌రావు మొదట్నుంచి సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని పట్టుదలగా ఉన్నారు. 


రానాతో ‘లీడర్‌’ సినిమాకు సీక్వెల్‌ చేస్తాను కానీ ఇప్పుడే కాదు. అదే పాత్రలతో కథ నడిచేలా తీస్తాను. ధనుష్‌తో థ్రిల్లర్‌ చిత్రం రూపొందిస్తున్నాను. కథానుసారం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తాం.