ఆర్థిక స్థితి బాగోనప్పుడు జీతాలు తగ్గించొచ్చుకదా?

ABN , First Publish Date - 2022-01-25T08:48:40+05:30 IST

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 1ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యం సోమవారం హైకోర్టులో విచారణకు విచ్చింది.

ఆర్థిక స్థితి బాగోనప్పుడు జీతాలు తగ్గించొచ్చుకదా?

  • ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారంపై పిటిషనర్‌నుప్రశ్నించిన హైకోర్టు
  • రోస్టర్‌ ప్రకారం తమ వద్దకు రావాల్సిన వ్యాజ్యం కాదని వ్యాఖ్య
  • ఫైలును సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశం
  • సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వ వ్యవహారం
  • పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు
  • అన్నీ చెప్పేచేశాం.. అయినా సమ్మె అంటున్నారు: ఏజీ


అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 1ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యం సోమవారం హైకోర్టులో విచారణకు విచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పి. రవితేజ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ ప్రాథమికంగా తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంతసేపు ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్‌ దాఖలు చేసిన వ్యాజ్యం ఒకవైపు సర్వీస్‌ సంబంధ వ్యవహారంలా మరో వైపు ప్రభుత్వ ఉద్యోగలందరిపైనా ప్రభావం చూపే ప్రజా ప్రయోజన వ్యాజ్యంలా ఉందని అభిప్రాయపడింది. ఏపీ పునర్విభజన చట్టంతో ముడిపడి ఉందని భావించి రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాన్ని తమ ముందు లిస్ట్‌ చేసిందని, వాస్తవంగా ప్రస్తుత సమస్య పునర్విభజన చట్టం కారణంగా తలెత్తలేదని పేర్కొంది. రొస్టర్‌  ప్రకారం వ్యాజ్యాన్ని విచారించే పరిధి ధర్మాసనానికి లేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచి సంబంధిత బెంచ్‌ ముందు వ్యాజ్యం విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించవచ్చని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. పీఆర్సీ విషయంలో ఈ నెల జనవరి 17న ప్రభుత్వం జారీ చేసిన జీవో1ని సవాల్‌ చేస్తూ ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ చైర్మన్‌ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌లో ఏం పేర్కొన్నారంటే.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ఉద్యోగుల జీతాల్లో కోత పడుతుందని,  ఏపీ పునర్విభజన చట్టం 2014కి విరుద్ధంగా ఉన్న జీవోను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. తమ వినతులు పరిగణనలోకి తీసుకొని కొత్తగా వేతనాలు సవరించేలా ఆదేశించాలన్నారు. జీవో1ని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. 


పీఆర్సీ నివేదిక ఇవ్వడం లేదు

పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి. రవితేజ వాదనలు వినిపిస్తూ.. ‘‘విభజన చట్టంలోని సెక్షన్‌ 78(1) ఏపీకి వచ్చే ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను స్పష్టం చేస్తోంది. దాని ప్రకారం  సర్వీసు నిబంధనలు, హెచ్‌ఆర్‌ తదితర ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది. అప్పటి ప్రభుత్వం హైదరాబాద్‌లో ఇచ్చిన మాదిరిగానే బేసిక్‌ పేలో 30ు హెచ్‌ఆర్‌ఏగా ప్రకటించింది. అశుతోశ్‌ మిశ్రా నేతృత్వంలో 2018లో అప్పటి ప్రభుత్వం 11వ పేరివిజన్‌ కమిషన్‌ వేసింది. కమిషన్‌ నివేదికను గానీ తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ నివేదికలో పరిశీలించిన విషయాలను బయటపెట్టలేదు. ఏ అంశాల ఆధారంగా జీవో ఇచ్చారనే విషయాన్ని చెప్పకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ప్రస్తుత పీఆర్సీ 2018 జూన్‌ 1నుంచి అమలు చేయడం ద్వారా ఇప్పటి వరకు ఉద్యోగులకు అదనంగా చెల్లించి ఉంటే వాటిని వెనక్కి తీసుకొనే అధికారం కల్పించడం సరికాదు. ఈ జీవోను రద్దు చేయండి’’ అని కోరారు.


పలు మార్లు చర్చలు జరిపాం: ఏజీ

అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘పేరివిజన్‌ కమిషన్‌ నివేదిక, ప్రభుత్వం నియమించిన కార్యదర్శుల కమిటీ గుర్తించిన అంశాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధుల ముందు ఉంచాం. సంఘాల ప్రతినిధులతో 9 సార్లు చర్చలు జరిగాయి. సీఎంతోనూ సమావేశమయ్యారు. ప్రభుత్వ నిర్ణయంపై సంఘాల నేతలు మొదట హర్షం వ్యక్తంచేశారు. పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. న్యాయస్థానం ముందు విచారణకు ఉండగా సమ్మెకు వెళ్తామనడం సరికాదు’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. మధ్యాహ్నం జరిగే విచారణకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు, పిటిషనర్‌ విచారణకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించింది. మధ్యాహ్నం 2.15కు విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం... వ్యాజ్యం తమ వద్దకు విచారణకు రావడంపై రిజిస్ట్రీని స్పష్టత కోరామని తెలిపింది. 


ధర్మాసనం ప్రశ్నలు

వ్యాజ్యం విచారణ సందర్భంగా పిటిషనర్‌కు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పాలని కోరింది. పే రివిజన్‌ కమిషన్‌ కేవలం సిఫారసులు మాత్రమే చేస్తుందని.. అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే కదా అని ప్రశ్నించింది. సర్దుబాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ‘పాన్‌ ఇండియా స్కేల్‌’ ప్రకారం పీఆర్సీ తర్వాత ఫిట్‌మెంట్‌ కమిటీ ఉద్యోగుల జీతాలను నిర్ణయిస్తుందని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా జీతంలో కోత పడితే సంబంధిత ఉద్యోగి ఆవిషయాన్ని ప్రశ్నించవచ్చునేగానీ, మొత్తంగా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని చెప్పలేరని పేర్కొంది. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు వేతనాలు తగ్గించవచ్చని అభిప్రాయపడింది. అదనంగా చెల్లిస్తే రాబట్టుకొనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. 

Updated Date - 2022-01-25T08:48:40+05:30 IST