‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి అవుతుందా?

ABN , First Publish Date - 2022-08-06T06:13:09+05:30 IST

రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పథకాలను గాలికొదిలేసి, సబ్సిడీలన్నింటినీ ఎత్తివేసి రైతుబంధే సర్వరోగ నివారిణి అని చెబుతోంది...

‘రైతుబంధు’ సర్వరోగ నివారిణి అవుతుందా?

రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పథకాలను గాలికొదిలేసి, సబ్సిడీలన్నింటినీ ఎత్తివేసి రైతుబంధే సర్వరోగ నివారిణి అని చెబుతోంది. రైతులకు ఎంతో అవసరమైన పంటల బీమా, విత్తన సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ, ఉచిత ఎరువుల పథకాల నుంచి తప్పుకుంది. రుణమాఫీ పథకాన్ని అమలు చేయడానికి ఆపసోపాలు పడుతోంది. రైతులపై పెనుభారం మోపుతోంది.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్‌ నుంచి రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నది. రైతులకు పెట్టుబడి ఖర్చులకోసం ఎకరానికి రూ. 5 వేలు, రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ. 10 వేల చొప్పున నగదు బదిలీ చేస్తోంది. ఈ డబ్బులు రైతులకు పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. దీనికితోడు ‘రైతుబీమా’ పథకాన్ని అమలుచేస్తోంది. రైతుకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించింది. 36 లక్షల మంది రైతులు ఈ పథకంలో నమోదై ఉన్నారు. ఈ రెండు పథకాలను అమలుచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పథకాలను గాలికొదిలేసి, సబ్సిడీలన్నింటినీ ఎత్తివేసి రైతుబంధే సర్వరోగ నివారిణి అని చెబుతోంది.


ప్రకృతిని నమ్ముకొని పంటలు సాగుచేసే రైతులకు ‘పంటల బీమా’ పథకం అమలు చాలా కీలకం. అతివృష్టి ప్రభావంతో 2020 వానాకాలంలో 25 లక్షల ఎకరాలు, 2021లో 20 లక్షల ఎకరాలు, ఈ సీజన్‌లో ఇప్పటికే 11 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరుసగా మూడేళ్లు అతి భారీ వర్షాలకు పంటలు దెబ్బతినటం, నయాపైసా నష్టపరిహారం అందకపోవటంతో రైతాంగం పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. 2015 వరకు రాష్ట్రంలో వాతావరణ ఆధారిత పంటల బీమా, నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌, మాడిఫైడ్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ లాంటి క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పథకాలు అమలులో ఉండేవి. కేంద్ర ప్రభుత్వం 2016లో ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ (పీఎంఎఫ్‌బీవై) పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. 2019–20 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీనిని అమలుచేశాయి. కానీ 2020 నుంచి ఎప్పుడైతే పీఎంఎఫ్‌బీవైని కేంద్ర ప్రభుత్వం ‘ఐచ్ఛికం’ చేసిందో... అప్పటినుంచి ప్రీమియం భారం ఎక్కువవుతున్నదనే కారణంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం నుంచి బయటికొచ్చింది. అంటే మూడేళ్లుగా రాష్ట్రంలో ఏ ఒక్క పంటల బీమా పథకం అమలులో లేదు. కానీ ఈ మూడేళ్లలోనే అతివృష్టితో రైతులు లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. పోనీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏదైనా క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పథకాన్ని అమలుచేస్తున్నదా? అంటే అదీలేదు.


అన్నదాతలకు ఆసరాగా నిలిచే ‘విత్తన సబ్సిడీ’ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితమే మంగళం పాడింది. 2020 వానాకాలం సీజన్‌ నుంచి రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయటంలేదు. వరి, మొక్కజొన్న, శనగలు, కందులు తదితర విత్తనాలను కనిష్టంగా 33శాతం, గరిష్టంగా 65శాతం వరకు సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసేది. ఒక్కో పంట సీజన్‌కు రూ.40 కోట్లు విత్తన సబ్సిడీకి ఖర్చుచేసే పరిస్థితి ఉండేది. దీనికి ఏడాదికి రూ.80 కోట్లకు మించి బడ్జెట్‌ అయ్యేదికాదు. మండల వ్యవసాయాధికారి, విస్తరణాధికారి కార్యాలయాల్లో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచేవారు. ఈ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మూడేళ్లుగా విత్తనాలకు రాయితీలూ ఇవ్వటంలేదు. రైతులు మార్కెట్‌ ధరకే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. వరితోపాటు పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఇతర ఆహారధాన్యాల విత్తనాలు, హైబ్రీడ్‌ విత్తనాలను మార్కెట్‌ రేటుకు కొనాలంటే రైతులకు తడిసి మోపెడవుతోంది. తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కూడా నిర్వీర్యమైపోయింది. తెలంగాణను ప్రపంచానికే ‘సీడ్‌ బౌల్‌’గా తయారుచేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... చివరకు విత్తన సబ్సిడీలు కూడా ఎత్తివేయటం రైతులకు ఆర్థికభారంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచాయి. నాణ్యతలేని విత్తనాలు, నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నాయి. దీంతో రైతులు నష్టపోతున్నారు.


వ్యవసాయ పనుల్లో రైతుల కష్టాన్ని, పెట్టుబడి ఖర్చును తగ్గించటానికి, కూలీల కొరతను అధిగమించటానికి ఉపయోపడే ‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకం రాష్ట్రంలో నాలుగేళ్లుగా అమలుకావటంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, రొటోవేటర్లు, హార్వెస్టర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు, పవర్‌ వీడర్లు, తైవాన్‌ స్ప్రేయర్లు, సీడ్‌– ఫెర్టిలైజర్‌ డ్రిల్‌ యంత్రాలు సబ్సిడీపై పంపిణీ చేసేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత, తొలి ప్రభుత్వంలో కూడా యాంత్రీకరణ పథకాన్ని అమలుచేశారు. ట్రాక్టర్లకు రూ. 3.50 లక్షల వరకు, మిగిలిన పనిముట్లకు 50 శాతం వరకు సబ్సిడీ ఇచ్చారు. కానీ 2018– 19లో రైతుబంధు అమలులోకి రాగానే వ్యవసాయ యాంత్రీకరణ (ఫామ్‌ మెకనైజేషన్‌) పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. అంతేకాకుండా రైతులకు హార్వెస్టర్ల లాంటి యంత్రాలు కొనుగోలుచేయటం ఆర్థికభారంతో కూడుకున్న వ్యవహారమని భావించి, వ్యవసాయ పనిముట్లను రైతులకు గ్రామాల్లో అందుబాటులో ఉంచేందుకు ‘కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు’ (సీహెచ్‌సీ) గ్రామపంచాయతీల్లో ఏర్పాటుచేస్తామని కూడా కేసీఆర్‌ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. సీహెచ్‌సీల స్థాపనతో గ్రామీణ యువతకు ఉపాధి దొరుకుతుందని, సాగు వ్యయం, చాకిరీ తగ్గుతుందని ప్రభుత్వం చెప్పటంతో అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు సీహెచ్‌సీల జాడలేదు.


2017 ఏప్రిల్‌ 13వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉచిత ఎరువుల హామీపై ప్రకటన చేశారు. 2018–19 నుంచి ప్రతి పంటకు రైతులు వాడే 25 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. కానీ ఐదేళ్లుగా సీఎం వాటి మాటెత్తడం లేదు. ఉచిత ఎరువుల హామీ ఏమైందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ప్రశ్నిస్తుంటే... ‘రైతుబంధు’ ఇస్తున్నాం కదా? అని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఎరువుల ధరలు ఆకాశానికంటుతున్న నేపథ్యంలో... ఉచిత ఎరువులు పంపిణీచేస్తే రైతులపై పెట్టుబడి భారం తగ్గేది. రైతుబంధు కంటే ఎక్కువ లాభం రైతులకు కలిగేది. ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీంతో సర్కారుపై ఆర్థిక భారం పడుతుందని, రవాణా, ఎరువుల పంపిణీకి సమస్యలు ఎదురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయటానికి వెనకడుగు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.


తెలంగాణను కోటి ఎకరాల మాగాణిలా మారుస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పుడు వరి సాగును నియంత్రిస్తూ, పత్తి సాగును ఏకంగా 75 లక్షల ఎకరాలకు పెంచాలని టార్గెట్‌ పెట్టుకుంది. పత్తి సాగు పెరిగితే అన్నదాతలు ప్రమాదంలో పడతారు. ఒకప్పుడు పత్తి రైతుల ఆత్మహత్యల పరంపర చూసిందే! ఇప్పటికీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అయినా, ప్రభుత్వం పత్తి సాగును ప్రోత్సహించటం వెనక మతలబు ఉంది. పత్తి విత్తనాలు సరఫరాచేసే అవసరం ఉండదు. ప్రైవేటు కంపెనీలే పత్తి విత్తనాలు విక్రయిస్తాయి. ప్రభుత్వానికి ప్రొక్యూర్మెంట్‌ ఒత్తిడి ఉండదు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పత్తి కొంటుంది. లేకపోతే జిన్నింగ్‌, స్పిన్నింగ్‌ మిల్లర్లు కొనుగోలు చేస్తారు. పత్తి సాగు పెంచాలని చెబుతున్న ప్రభుత్వం రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు మాత్రం ఇస్తోంది. వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని చెప్పే ప్రభుత్వం పప్పుధాన్యాలు, నూనెగింజలు సాగుచేస్తే... సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయటమో, ఆర్థిక సాయం అందించటమో, పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని గ్యారెంటీ ఇవ్వటమో చేయాలి. హరియాణా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు సాగుచేస్తే... ఎకరానికి రూ.7 వేల ఆర్థిక సాయం అందిస్తోంది.

పంట పెట్టుబడి కోసం లక్ష రూపాయల వరకు బ్యాంకులు, సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులకు ‘సున్నా వడ్డీ పథకం’ గతంలో ఉండేది. అదే రూ. 3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకైతే ‘పావలా వడ్డీ’ పథకం అమలుచేసేవారు. ప్రతి బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు ఉండేవి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ, పావలా వడ్డీ పథకాలను కొండెక్కించింది. దీంతో రైతులు బ్యాంకులకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. దీనికితోడు ‘రుణమాఫీ’ పథకాన్ని అమలుచేయటానికి ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. 2018 డిసెంబరు 11 నాటికి బకాయిలు ఉన్న రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు రూ.32 వేల వరకు బకాయి ఉన్న 5.82 లక్షల మంది రైతులకు రూ.1,100 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. రూ. 32 వేల పైనుంచి రూ.లక్ష వరకున్న బకాయిలు ఇంకా మాఫీ చేయలేదు. రుణమాఫీ కోసం సుమారు 32 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు.

l రాజు వేములపల్లి

జర్నలిస్ట్‌

Updated Date - 2022-08-06T06:13:09+05:30 IST