మసీదు ముందు మైక్ పెట్టి హనుమాన్ చాలిసా వేస్తాం: రాజ్ థాకరే

ABN , First Publish Date - 2022-04-03T23:09:48+05:30 IST

ప్రస్తుతం ముంబైలో శివసేన, ఎంఎన్ఎస్ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రభుత్వం మెజారిటి ప్రజలను అవమానిస్తోందని..

మసీదు ముందు మైక్ పెట్టి హనుమాన్ చాలిసా వేస్తాం: రాజ్ థాకరే

ముంబై: మహారాష్ట్రలో లౌడ్‌స్పీకర్ల రగడ ప్రారంభమైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ప్రధాన కార్యాలయంపై లౌడ్‌స్పీకర్ పెట్టి హనుమాన్ చాలిసా పటించడంతో రగడ తీవ్రమైంది. మసీదుల వద్ద ఉండే లౌడ్‌స్పీకర్లను తీసేయాలని లేదంటే మసీదుల ముందు హనుమాన్‌ చాలీసా మోగిస్తామని ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కొద్ది సమయానికే ఎంఎన్ఎస్ కార్యాలయంపై లైడ్‌స్పీకర్లు పెట్టారు. అయితే వీటికి అనుమతి లేకపోవడంతో ఎంఎన్ఎస్ నేత మహేంద్ర భానుషాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు. 5,050 రూపాయల జరిమానా విధించి, మరోసారి రిపీట్ అయితే చర్యలు తీసుకుంటామని నోటీసు ఇచ్చారు.


ప్రస్తుతం ముంబైలో శివసేన, ఎంఎన్ఎస్ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రభుత్వం మెజారిటి ప్రజలను అవమానిస్తోందని ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఆరోపణలు చేస్తుండగా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వేషాలు రెచ్చగొట్టాలని చూడొద్దని శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కాగా, ఎంఎన్ఎస్ నేత మహేంద్ర భానుషాలి మీడియాతో మాట్లాడుతూ ‘‘లౌడ్‌స్పీకర్లకు ఎవరూ అనుమతి తీసుకోలేదు. ఒకవేళ ఇది చట్ట వ్యతిరేకమైతే అందరిపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు. పోలీసులతో ఏమీ మాట్లాడకండని రాజ్ థాకరే చెప్పారు. కానీ లౌడ్‌స్పీకర్లు పెట్టిన అందరిపై చర్యలు తీసుకోవాలన్నది మా డిమాండ్’’ అని అన్నారు.

Updated Date - 2022-04-03T23:09:48+05:30 IST