‘పంజా’ విసిరేనా?

ABN , First Publish Date - 2021-04-06T07:14:46+05:30 IST

ఐపీఎల్‌లో మూడు జట్లకు ఇప్పటిదాకా టైటిల్‌ దక్కలేదు. అందులో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఈ జట్టులో ఎంతోమంది స్టార్‌ క్రికెటర్లు ఆడినా అదృష్టం వరించలేదు...

‘పంజా’ విసిరేనా?

  • పంజాబ్‌ కింగ్స్‌ను ఊరిస్తోన్న టైటిల్‌


ఐపీఎల్‌లో మూడు జట్లకు ఇప్పటిదాకా టైటిల్‌ దక్కలేదు. అందులో పంజాబ్‌ కింగ్స్‌ ఒకటి. ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఈ జట్టులో ఎంతోమంది స్టార్‌ క్రికెటర్లు ఆడినా అదృష్టం వరించలేదు. టీ20 ఫార్మాట్‌లో దుమ్ము రేపే క్రిస్‌ గేల్‌, రాహుల్‌, డేవిడ్‌ మలాన్‌, పూరన్‌ ఇప్పుడు జట్టులోనే ఉన్నారు. చివరి సీజన్‌లో మెరుగ్గా రాణించినా ప్లేఆఫ్స్‌ ముంగిట బోల్తా పడింది. ఈసారి తమ పేరు.. జెర్సీని మార్చేస్తూ సరికొత్తగా బరిలోకి దిగుతున్న ఈ జట్టు ‘పంజా’ విసరాలనుకుంటోంది.  


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

పన్నెండు సీజన్లపాటు పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌గా ఉన్న ఈ జట్టు.. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌ పేరిట ఐపీఎల్‌లో ఆడబోతోంది. 2020 యూఏఈలో జరిగిన లీగ్‌లో పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లు అభిమానులను ఉర్రూతలూగించాయి. దాదాపుగా ప్రతీ  మ్యాచ్‌ కూడా ఉత్కంఠభరితంగా సాగింది. ఇందులో రెండు ‘టై’లున్నాయి. అయితే దురదృష్టవశాత్తు ప్లేఆ్‌ఫ్సకు చేరుకోలేకపోయింది. ఒక్క టైటిల్‌ కూడా లేని జట్టుగా ఉండకూడదనే కసితో ఈసారి బరిలోకి దిగబోతోంది. వేలంలో అందరికన్నా ఎక్కువ సొమ్ముతో పాల్గొన్న ఈ జట్టు.. పేసర్లు జే రిచర్డ్‌సన్‌ను రూ.14 కోట్లకు, రిలే మెరిడిత్‌ను రూ.8 కోట్లకు తీసుకుంది.


బలం

తిరుగులేని టాపార్డర్‌ ఈ జట్టు సొంతం. 2020 ఐపీఎల్‌ ఆరెంజ్‌ క్యాప్‌ను కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ దక్కించుకున్నాడు. మరో ఓపెనర్‌గా అతడికి మయాంక్‌ అగర్వాల్‌ సహకరించనున్నాడు. గతేడాది తన నుంచి సూపర్‌ షో కనిపించింది. వీరికి అండగా వన్‌డౌన్‌లో యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఉండనే ఉంటాడు. మిడిలార్డర్‌లో నికోలస్‌ పూరన్‌ ఆధారపడ్డదగ్గ ఆటగాడే. అబుదాబి టీ10 లీగ్‌లో తను అద్భుతంగా ఆడాడు. అయితే ఈసారి దృష్టంతా ఆల్‌రౌండర్‌ షారుక్‌ ఖాన్‌పై ఉండనుంది. దేశవాళీ క్రికెట్‌లో ఈ రూ.5 కోట్ల స్టార్‌ మెరుగ్గానే ఆడాడు. 


బలహీనత

కీలక ఆటగాళ్లు తరచూ గాయాలపాలు కావడం జట్టును దెబ్బతీస్తోంది. ఇటీవలే కోలుకున్న పేసర్‌ షమి అంచనాలను అందుకుంటాడేమో చూడాల్సిందే. గేల్‌ వయస్సు ఇప్పుడు 41. క్రితం సారే అన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఈసారి కూడా అదే జరగవచ్చని అంచనా. జే రిచర్డ్‌సన్‌, మెరిడిత్‌ ఇప్పటి వరకు ఐపీఎల్‌ ఆడలేదు. జే మాత్రమే భారత్‌లో రెండు టీ20లు ఆడాడు. ఇక టీ20ల్లో ప్రపంచ నెంబర్‌వన్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మలాన్‌ను తుది జట్టులో ఎలా సర్దుబాటు చేస్తారనేది తేలాల్సి ఉంది.


జట్టు

స్వదేశీ ఆటగాళ్లు: రాహుల్‌, మయాంక్‌, మన్‌దీ్‌ప, షమి, షారుక్‌ ఖాన్‌, సర్ఫరాజ్‌, ఇషాన్‌ పోరెల్‌, రవి బిష్ణోయ్‌, ఎం.అశ్విన్‌, దీపక్‌ హూడా, హర్‌ప్రీత్‌, ప్రభ్‌సిమ్రన్‌, దర్శన్‌, అర్షదీప్‌, జలజ్‌ సక్సేనా, ఉత్కర్ష్‌ సింగ్‌, సౌరభ్‌ కుమార్‌.


విదేశీ ఆటగాళ్లు: క్రిస్‌ గేల్‌, మలాన్‌, పూరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, జే రిచర్డ్‌సన్‌, రిలే మెరిడిత్‌, హెన్రిక్స్‌, ఆలెన్‌.



ఉత్తమ ప్రదర్శన

రన్నరప్‌ - 2014

సెమీస్‌ - 2008



పంజాబ్ ఎవరితో ఎప్పుడు?



Updated Date - 2021-04-06T07:14:46+05:30 IST