Budget 2022: మొబైల్ ఫోన్, టీవీల ధరలు తగ్గనున్నాయా?

ABN , First Publish Date - 2022-02-01T16:12:12+05:30 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్‌లో 2022 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Budget 2022: మొబైల్ ఫోన్, టీవీల ధరలు తగ్గనున్నాయా?

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్‌లో 2022 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈసారి బడ్జెట్‌పై అన్ని రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. కరోనాతో బాగా దెబ్బతిన్న వివిధ రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ మూడో వేవ్ విజృంభణ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లోని కేటాయింపులు అన్ని రంగాలకు కీలకం కానున్నాయి. అటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్ విషయమై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో అత్యధిక ప్రయోజనం ఉత్పాదక రంగానికే లభిస్తుందని.. ఆ తర్వాత సేవలు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రధానంగా ఎలక్ట్రానిక్ రంగంలో ముఖ్యమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక తయారీని ప్రోత్సహించడానికి వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్‌ల పార్ట్స్ లేదా సబ్-పార్ట్స్‌‌పై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం సవరించబోతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో మొబైల్ ఫోన్‌లు, పెద్ద టీవీలు ఈ ఏడాది నుంచి తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని సమాచారం. మరీ ఈ ఊహగానాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికొద్దిసేపు వేచిచూడక తప్పదు. 


ఇదిలాఉంటే.. వెస్టింగ్‌హౌస్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌పీపీఎల్) వైస్ ప్రెసిడెంట్ పల్లవి సింగ్ మాట్లాడుతూ.. "2022-23 బడ్జెట్‌తో అసమానతను తగ్గించడానికి ముడి పదార్థాల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై జీఎస్‌టీని తగ్గించాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకించి ఈరోజుల్లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను అందరూ నిత్యావసరాలుగా భావిస్తున్నారు." అని పేర్కొన్నారు. ఇలా ఎలక్ట్రానిక్ రంగం ఈ బడ్జెట్‌‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇక కేంద్ర బడ్జెట్ 2021-22లో రిఫ్రీజిరేటర్ కంప్రెషర్స్, ఎయిర్ కండిష్నర్స్, సిల్క్, కాటన్ వస్త్రాల ముడి సరుకులు, సోలార్ ఇన్వేటర్లు, ఆటోమొబైల్ విడిభాగాలు, లేదర్ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్ చార్జర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో బంగారం, వెండి, ప్లాటినం, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మెడికల్ పరికరాల ధరలు తగ్గుతాయని సమాచారం.

Updated Date - 2022-02-01T16:12:12+05:30 IST