ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా?

ABN , First Publish Date - 2022-07-03T03:47:43+05:30 IST

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించకపోవడం, పర్యవేక్షణ లోపం, బాధ్యతారాహిత్యం కారణంగా ఇది సాధ్యపడడం లేదు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా?
కాగజ్‌నగర్‌లో ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కల్పిస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌ రాజు

- 1నుంచి అమలులోకి వచ్చిన ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం

- వాడొద్దని చెబుతున్నా కానరాని మార్పు

- గ్రామాల్లో కనిపించని ప్రచారం

బెజ్జూరు/కాగజ్‌నగర్‌టౌన్‌, జూలై 2: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించకపోవడం, పర్యవేక్షణ లోపం, బాధ్యతారాహిత్యం కారణంగా ఇది సాధ్యపడడం లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి వాడి పారేసే 16రకాల ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించాలని నిర్ణయించింది. జూలై1 నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం 75మైక్రాన్ల లోపు మందం ఉన్న ప్లాస్టిక్‌పై నిషేధం ఉండగా ఇక నుంచి 120 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించడంతో సాధ్యమయ్యేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. గతంలో పలుమార్లు ప్రభుత్వాలు ప్లాసిక్‌ను నిషేధించినప్పటికీ సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో కేంద్రం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న ఈ చర్యలపై ఇప్పటికీ ఎలాంటి ప్రచారం చేయలేదు. ప్రజలకు అవగాహన కల్పించ కుండా ఏ కార్యక్రమం చేపట్టినా విజయం సాధించలేమన్న విషయం తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోక పోవడం విచారకరం.

16 రకాల వస్తువులు ఇవే

మార్కెట్‌లో ప్రస్తుతం ప్రతి వస్తువు ప్లాస్టిక్‌తో ముడిపడి ఉంది. క్యారీ బ్యాగ్స్‌, ఇయర్‌బర్డ్‌ స్టిక్స్‌, ప్లాస్టిక్‌ ఫోర్క్‌, ఐస్‌క్రీం స్పూన్స్‌, స్ట్ర్సా, బెలూన్స్‌, ప్లాస్టిక్‌ ప్లాగ్స్‌ 100 మైక్రాన్ల కన్నా తక్కువ పరిణామంలో ఉన్న ఫ్లెక్సీలు, స్వీట్‌ బాక్సుల ప్యాకింగ్‌ కవర్లు, సిగరేట్‌ ప్యాకెట్స్‌, డిస్పోజల్‌ వాటర్‌, టీ గ్లాసులు, వాటర్‌ బాటిళ్లు వంటి సింగిల్‌ యూజ్‌ వస్తువులపై నిషేధం విధించారు. వీటన్నింటిపై నిషేధం సాధ్యమయ్యే పరిస్థితి లేక పోవడం వల్లే అధికార యంత్రాం పెద్దగా ప్రచారం చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఈ నిషేధం అమలు కోసం అన్ని రకాల వ్యాపారులు, పాఠ శాలల నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 

రూ.50 వేల వరకు జరిమానా

ఇది వరకు తనిఖీల్లో పట్టుబడితే ప్లాస్టిక్‌ను సీజ్‌ చేయడంతో పాటు రూ.500 నుంచి రూ.1000 వరకు, రెండోసారి అయితే రూ.5000 వరకు జరిమానా విధించే వారు. దీనివల్ల పెద్దగా మార్పు ఉండడం లేదు. జిల్లాలో గుర్తుకు వచ్చినప్పుడే అధికారులు తనిఖీలు చేయడం వల్ల మిగితా సమయాల్లో వీటిని యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. అందుకే జరిమానాలను భారీగా పెంచాలని నిర్ణయించారు. మొదటిసారి ఉల్లంఘనకు పాల్పడితే రూ.2500నుంచి రూ.5000 వరకు, రెండోసారి రూ.5000నుంచి రూ.10,000వరకు, మూడోసారి 10,000నుంచి రూ.50000 వరకు జరిమానా విధించనున్నారు. పట్టణాల్లోనైతే తరచూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ పట్టుబడ్డ వారికి జరిమానా విధిస్తూ కేసులు నమోదు చేయడం షరామామూలే. అయితే మారుమూల పల్లెల్లో ప్లాస్టిక్‌ నిషేధం పక్కాగా అమలు జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. గతంలో ప్రభుత్వాలు ప్లాస్టిక్‌పై నిషేధం అమలులో ఉన్నప్ప టికీ గ్రామాల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తూ వచ్చారు. పర్యావర ణానికి తీవ్ర హాని కలిగించే ప్లాస్టిక్‌ను నిషేధించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆచరణలో అమలు జరిగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్లాస్టిక్‌ వస్తువులు వాడరాదు

- మాధవి, ఎంపీడీవో

ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్‌ వస్తువులు ఎవరూ కూడా వాడరాదు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను వినియోగిస్తే చర్యలు తీసు కుంటాం. గ్రామాల్లో ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. దుకాణదారులకు నోటీసులు అందజేస్తాం.

కఠిన చర్యలు తీసుకుంటాం

-సీవిఎన్‌ రాజు, మున్సిపల్‌ కమిషనర్‌, కాగజ్‌నగర్‌ 

ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు, వినియోగించే వారికి వీటివలన కలిగే అనర్థాలపై ప్రచారం చేస్తున్నాం. అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేపడుతున్నాం. ప్రభుత్వం ఈసారి భారీగా జరిమానాలకు ఆదేశాలిచ్చింది.

Updated Date - 2022-07-03T03:47:43+05:30 IST