Abn logo
Dec 2 2020 @ 02:20AM

నవ రాజకీయం ప్రభవించేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుటుంబ పరంగా, కులపరంగా నడుస్తున్న ఈనాటి రాజకీయాలకు విసిగి పోయారు. మూడో ప్రత్యామ్నాయానికి మంచి అవకాశం ఉంది. దీనిని వినియోగించుకుని బలమైన శక్తిగా ఎదగడానికి బీజేపీ, జనసేన కూటమికి నిర్దిష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళిక అవసరం. ఆ కూటమి కార్యాచరణ 2024 ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపగలుగుతుంది.


నూటయాభై ఒక్కమంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించి వచ్చాం కాబట్టి తన పాలనకు ఏ సంస్థ, ఏ విధానం అడ్డు రాకూడదు. అనేది జగన్మోహన్ రెడ్డి ఒకటిన్నర సంవత్సర పాలనలో కొట్టవచ్చే విధంగా కనిపిస్తున్న విషయం. తన వ్యక్తిగత ఆకర్షణ మూలంగానే గెలిచానని భావించటం వల్ల, తన మాటే శాసనం అన్న విధంగా ఆయన పాలన సాగుతోంది. అధికారులలో ఎవరైనా విధి విధానాలు, చట్టం, పాలన గురించి మాట్లాడితే వారిని ఇంటిదారి పట్టించడం మామూలైపోయింది. దాంతో విచక్షణతో కూడిన సలహాలు ఇచ్చేవారు కరువయ్యారు. వందిమాగదులు భజనపరుల ప్రాబల్యం పెరిగింది. ఘనవిజయం సాధించి అధికారం చేపట్టారు కాబట్టి ఆయన ధోరణి తెలిసిన అనుభవజ్ఞులైన మంత్రులు కూడా మనకెందుకులే అని సలహాలు ఇవ్వడం మానేసినట్టుగా ఉంది. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రభుత్వ సభామంటపాన్ని కూల్చివేయడం దగ్గర నుంచి అనేక నిర్ణయాలలో ఈ పోకడ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. న్యాయవ్యవస్థ జవాబుదారీతనానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానం ప్రశ్నార్థకం. బడ్జెట్ల పరిమితి లేని మంత్రదండంతో సృష్టించే ఆదాయ వనరులు ఉంటాయనే భావనతో పథకాలను చేపట్టటం, కొనసాగించడం జరుగుతోంది. ఇటువంటి వ్యవహార శైలితో కూడిన పాలనా విధానం అన్ని అంశాలను పరిశీలించి సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేయదు.


వైఎస్సార్‌సీపీ ఘనవిజయానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆకర్షణ కన్నా చంద్రబాబు నాయుడి ఐదేళ్ళ పాలనలో ప్రభుత్వం మీద పెరిగిన వ్యతిరేకతే కారణం. 2014 ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా మారాయని చాలామంది భావించారు. మొదట్లో రాజశేఖర్ రెడ్డి ప్రజాకర్షక పథకాలు, తండ్రి మరణం తర్వాత వచ్చిన సానుభూతి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను లక్ష్యంగా చేసుకుని అకారణంగా చాలా రోజులు జైలులో ఉంచిందనే భావన, ప్రజలలో జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత ఏర్పడటానికి బాగా దోహదం చేశాయి. కానీ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన జరిగి విభజన జరిగే తేదీ కూడా ఖ రారై పోవడంతో ప్రజాభిప్రాయం కొద్దికాలంలోనే మార్పు చెందింది. కొత్త రాష్ట్రానికి గట్టి పునాదిని ఏర్పాటు చేయడానికి, అభివృద్ధి దిశగా నడిపించడానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడే మిన్న అనే భావన ప్రజలలో ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఆయన పాలనలో జరిగిన అభివృద్ధి ఈ భావనకు బలమైన పునాదిని ఏర్పాటు చేసింది. ఇక దేశమంతటా ఆనాడున్న మోదీ ప్రభంజనం, పవన్ మ ద్దతు 2014లో చంద్రబాబు నాయుడు విజ యం సాధించడానికి దోహదం చేశాయి.


ఐదేళ్ల పాలనలో చంద్ర బాబు నాయుడు చేసిన అనేక తప్పులు కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఘన విజయాన్ని సాధిం చిపెట్టాయి కానీ, అదేదో తన వ్యక్తిగతమైన ఆకర్షణ ఫలితమేనని భావిస్తే పొరపాటు. అన్ని ప్రాం తాలను అన్ని వర్గాలను కలుపుకుని పోయే విధంగా ప్రధాన అంశాల మీద దృష్టి సాగిస్తూ ఐదేళ్ళ పాలన సాగి ఉంటే ఇంత పెద్దఎత్తున ప్రజావ్యతిరేకతను బాబు ప్రభుత్వం మూటగట్టుకుని ఉండేది కాదు. ఈ ప్రజా వ్యతిరేకతే జగన్మోహన్ రెడ్డికి కలిసొచ్చింది.


ఒకటిన్నర సంవత్సరం కాలంలో ఈ ప్రభుత్వ పాలన పరిశీలిస్తే, ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా చంద్రబాబు పాలన నడిచింది అనే అపవాదు, ఈనాడు జగన్‌ పాలనకు కూడా ఇంకా ఎక్కువ వర్తిస్తుంది. ఆకాశంలోని చంద్రుణ్ణి తెచ్చి చేతిలో పెడతామనే విధంగా ఆయన ఎన్నికల వాగ్దానాలున్నాయి. వాటిని అమలు చేసే వనరులు మాత్రం కనిపించటం లేదు. ఆర్థికసమస్యలు అనుకున్నదానికన్నా త్వరగానే ప్రభుత్వాన్ని చుట్టు ముట్టేటట్లు ఉన్నాయి. అప్పులు చేసి పంచటానికి కూడా పరిమితులు ఉంటాయి. సాధ్యాసాధ్యాలను, చట్ట, న్యాయపరమైన పరిమితులను పరిశీలించకుండా తీసుకున్న సర్కార్‌ నిర్ణయాలు అమలులో విఫలమవుతున్నాయి.


రాష్ట్ర ప్రజలు కుటుంబపరంగా, కులపరంగా నడుస్తున్న ఈనాటి రాజకీయాలకు విసిగిపోయారు. అలా కుటుంబ, కులపరంగా లేని ప్రత్యామ్నాయానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం మెండుగా ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బిజెపి, జనసేన కూటమి రాష్ట్రంలో రాజకీయంగా విస్మరించబడిన వర్గాల ప్రయోజనాలను, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని తగిన కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రభుత్వ కార్య క్రమాల లోపాలను ఎత్తిచూపటం ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా కొంతవరకే ప్రజామోదాన్ని పొందగలుగుతుంది. దీనితోపాటు ఒక నిర్మాణాత్మకమైన అజెండాతో ప్రజల ముందుకుపోగలిగిన నాడే బలమైన రాజకీయశక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఈనాడు మూడో ప్రత్యామ్నాయానికి ఆంధ్రప్రదేశ్‌లో మంచి అవకాశం ఉంది. దీనిని సక్రమంగా వినియోగించుకుని బలమైన శక్తిగా ఎదగడానికి బీజేపీ, జనసేన కూటమికి నిర్దిష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళిక అవసరం. ఆ కూటమి కార్యచరణ 2024 ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం చూపగలుగుతుంది.

ఐవైఆర్‌ కృష్ణారావు

Advertisement
Advertisement
Advertisement