సంకల్పం సరే...!

ABN , First Publish Date - 2022-05-17T06:33:23+05:30 IST

రాజస్థాన్ ఉదయపూర్‌లో నవ సంకల్ప శిబిరం ముగింపు సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో చాలా అంశాలు స్పృశించారు, స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు...

సంకల్పం సరే...!

రాజస్థాన్ ఉదయపూర్‌లో నవ సంకల్ప శిబిరం ముగింపు సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో చాలా అంశాలు స్పృశించారు, స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యపూర్వం నుంచి కాంగ్రెస్‌కు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ, ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ పునాదులు ఇప్పుడు ఎందుకు బలహీనపడ్డాయో చెప్పారు. ప్రజలతో పార్టీకి సంబంధాలు తెగిపోయాయన్న వాస్తవాన్ని అంగీకరించాలనీ, మళ్ళీ బంధం బలోపేతం చేసుకోవాలనీ, ఇందుకు అడ్డుతోవలేమీ ఉండవు కనుక, పార్టీలోని యువనాయకులనుంచి వృద్ధతరంవరకూ ప్రతీ ఒక్కరూ శ్రమించాలన్నారు ఆయన. భారతీయ జనతాపార్టీపై తాను పోరాడుతూనే ఉంటాననీ, భయపడేది లేదని ప్రకటన చేయడం కార్యకర్తలకు ఉత్సాహాన్నిస్తుంది. కానీ, బీజేపీని ఢీకొట్టగలిగే శక్తి తన పార్టీకి మాత్రమే ఉన్నదని చెప్పుకోవడంలో భాగంగా ప్రాంతీయపార్టీలమీద ఆయన దూకుడుగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ మాదిరిగా ప్రాంతీయపార్టీలు పోరాటం చేయలేవనీ, బీజేపీ కూడా ఎప్పుడూ కాంగ్రెస్ గురించే మాట్లాడుతుందనీ అనడంతో సరిపెట్టకుండా ప్రాంతీయపార్టీలకు సైద్ధాంతిక భూమిక లేదని అనడం మిత్రపక్షాల ఆగ్రహాన్ని సైతం చవిచూస్తున్నది.


ప్రాంతీయ పార్టీలన్నింటినీ దునుమాడి, యావత్ దేశాన్ని తానే ఏలాలని ఆశిస్తున్న, తదనుగుణంగా పావులు కదుపుతున్న బీజేపీ కూడా ఇటువంటి విసుర్లు విసరలేదనీ, ఏ ఆదర్శాలూ సిద్ధాంతాలు లేకుండానే ప్రాంతీయపార్టీలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో గెలవడానికి కాకున్నా, ఎన్నికల్లో నిలవడానికి కూడా ప్రాంతీయపార్టీల మీదే ఆధారపడిన స్థితిలో ఉన్నందున కాంగ్రెస్ తన నాయకత్వ భ్రమలు వీడి, తోటి ప్రయాణీకుడి స్థాయికి పరిమితం కావాలన్నది ఆయా ప్రాంతీయపక్ష నేతల సలహా. బీజేపీతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్నదెవరో, కాంగ్రెస్ ఏ స్థితిలో ఉన్నదో రాహుల్ కు తెలియదని అనుకోలేం. కానీ, ఆయన లక్ష్యం పార్టీని యుద్ధానికి సిద్ధం చేయడం కనుక దానికి అద్భుత శక్తిసామర్థ్యాలున్నాయని చెప్పుకోవడం, కార్యకర్తలను కర్తవ్యోన్ముఖులను చేయడం ఆయన బాధ్యత. 


అయితే, నాలుగుమాటలు విసరి, మీసాలు తిప్పినంత మాత్రాన పార్టీ బలోపేతం కాదు. ఈ శిబిరం తరువాత కూడా ఇకపై అడుగులు ఎలా వేయాలన్న విషయంలో పార్టీ అధినాయకత్వానికి పూర్తి స్పష్టత వచ్చిందని గట్టిగా చెప్పలేం. రాహుల్ గాంధీ స్థానం ఏమిటన్నదే ఇంకా పరిష్కారం కాని ఓ ప్రశ్న. ప్రియాంకను అధ్యక్షస్థానంలో కూచోబెడితే తప్ప పార్టీ బాగుపడదని ఎవరో అన్నారట. ముగింపు ప్రసంగం రాహుల్ చేసినందువల్లా, అక్టోబర్ నుంచి ఆరంభం కాబోతున్న ‘భారత్ జోడో’ యాత్రకు ఆధ్వర్యం వహిస్తున్నందువల్ల పార్టీ అధినాయకుడు, అనధికారిక అధ్యక్షుడు ఆయనే అన్న సందేశం అందరికీ చేరివుండవచ్చు. కానీ, దాదాపు పదేళ్ళనాటి జైపూర్ చింతన్ శిబిరంలో ఆయనను పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించినప్పుడు ఇక అంతా ఆయనే అన్న ఓ నమ్మకం, ఉత్సాహపూరితమైన వాతావరణం క్రమంగా సన్నగిల్లి, ఇప్పుడు దాదాపుగా కనిపించని మాట వాస్తవం. ఇందుకు బీజేపీ అధికారంలోకి రావడం, రాహుల్ నాయకత్వంలో జరిగిన ఎన్నికల పోరాటాల్లో పార్టీ విఫలం కావడం కంటే, సారథ్యాన్ని చేపట్టే విషయంలో ఆయన ప్రదర్శించిన అనాసక్తత కారణం. ఒక పోరాట వీరుడిగా ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించడానికి ఏం చేయాలన్నది ఇప్పుడు ఆలోచించాలి. ‘బీజేపీ హిందూత్వ’ను ఎదుర్కోవడం ఎలా? అనే విషయంలో పార్టీకి ఇంకా స్పష్టత ఏర్పడినట్టు లేదు. కీలకమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటుబ్యాంకును తిరిగి వెనక్కుతెచ్చునేందుకు మంచి నిర్ణయాలే పార్టీ ప్రకటించింది. ముఖ్యంగా బీసీలకు భారీ హామీలే ఇచ్చింది. చట్టసభల్లో మహిళాకోటా విషయంలో మంచి మాట చెప్పింది. ప్రశాంత్ కిశోర్ మీద ఆధారపడే కన్నా ఈ వర్గాల ఆశీస్సులు పొందితే అధికారం దక్కుతుందని అనుకోవడం సరైనదే. కానీ, ప్రతీ చిన్న ఎన్నికనూ ఓ యుద్ధంగా తీసుకొని పోరాడే బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్ వ్యూహరచనతో పాటు క్షేత్రస్థాయిలో బలపడటమూ ముఖ్యం. అయోధ్య ఎజెండా మరిన్ని రూపాల్లో, మరింత విస్తృతమవుతున్నప్పుడు ఆ పోరాటం కూడా బహుముఖీనం కావాలి.

Updated Date - 2022-05-17T06:33:23+05:30 IST