ఆ గట్టుకెళతాను

ABN , First Publish Date - 2020-11-22T05:46:48+05:30 IST

ఆ గట్టుకెళతాను

ఆ గట్టుకెళతాను
ఏపీ వైపు భక్తులు లేని సుంకేసుల పుష్కర ఘాట్‌

  1. సుంకేసులలో జల్లులతో సరి
  2. రాజోలులో నదీ స్నానం
  3. వంతెనకు ఆవల సందడే సందడి


కోడుమూరు(రూరల్‌), నవంబరు 21: గ్రామాలు రెండు.. నది ఒకటే..! ఓ వైపు షవర్ల కింద పుష్కర స్నానం. మరోవైపు నదీ స్నానం. వంతెన దాటితే ఎంత తేడానో..! అందుకే ఆ గట్టుకు వెళ్లి నదిలో స్నానం చేసి పిండ ప్రదానం చేస్తున్నారు. ఈ గట్టున బ్రాహ్మణ పండితులు ఉసూరుమం టున్నారు. కోడుమూరు పరిధిలోని సుంకేసుల.. తెలంగాణలోని రాజోలు పుష్కర్‌ ఘాట్లవద్ద భిన్నమైన పరిస్థితి ఇది.

సుంకేసుల పుష్కర ఘాట్‌ రెండో రోజు భక్తులు లేక వెలవెల బోయింది. వచ్చిన కొద్దిమంది భక్తులు నదీ స్నానానికి అనుమతి లేకపోవడంతో నిరాశ చెందారు. కేవలం షవర్ల కింద పుష్కర స్నానం చేయాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తుంగభద్ర నదికి అవతలి గట్టున రాజోలు వద్ద భక్తులు భారీగా కనిపిస్తున్నారు. నదికి ఇటువైపు సుంకేసుల.. అటువైపు రాజోలు ఉన్నాయి. మధ్యలో వంతెన ఉంది. రెండు ఘాట్ల మధ్య ఒకటిన్నర కి.మీ. దూరం ఉంటుంది. రాజోలు వద్ద నదీ స్నానాలకు తెలంగాణ అధికారులు అనుమతిస్తున్నారు. గజ ఈతగాళ్లు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. నదిలో స్నానం చేసి పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. దీంతో అవతలి ఒడ్డున పండితులు తీరిక లేకుండా గడుపుతున్నారు. సుంకేసుల ఘాట్‌లో పిండ ప్రదానం చేయడానికి ముందు ఒక భక్తుడు శనివారం ఉదయం నదిస్నానం చేయడానికి ప్రయత్నించాడు. కాపలా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో  ఆ వ్యక్తి ఆ గట్టుకు వెళ్లిపోయాడు. సుంకేసుల ఘాట్‌కు వచ్చిన చాలా మంది అటువైపు వెళుతున్నారు. ఇక్కడ పండితులు ఒకటీ అరా కార్యక్రమాలతో సర్దుకుంటున్నారు. 


పులివెందుల నుంచి వచ్చాం..

మా కూతురును కోడుమూరుకు చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించాం. పుష్కర స్నానం చేయడానికి నా భార్య పద్మావతి, అల్లుడు, కూతురు, తమ్ముడు సోము కుటుంబం మొత్తం పదిమంది సుంకేసుల వచ్చాం. నదీస్నానం లేకపోవడం నిరాశ కలిగించింది. కొవిడ్‌ నిబంధనల మేరకు తప్పనిసరి అని షవర్‌ కింద స్నానమాచరించాం. - బాలస్వామి 



Updated Date - 2020-11-22T05:46:48+05:30 IST