ఆర్థిక విధానాలు మారేనా?

ABN , First Publish Date - 2022-01-22T06:13:26+05:30 IST

ఒకానొకప్పుడు ఆయన భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు. ప్రస్తుతం ఆ పెద్ద మనిషి అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ‘వాట్సన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్’ సీనియర్ ఫెలోగా ఉన్నారు...

ఆర్థిక విధానాలు మారేనా?

ఒకానొకప్పుడు ఆయన భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు. ప్రస్తుతం ఆ పెద్ద మనిషి అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ‘వాట్సన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్’ సీనియర్ ఫెలోగా ఉన్నారు. డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ గురించి నేను ప్రస్తావిస్తున్నానని మీరు గ్రహించే ఉంటారు. ఉత్కృష్ట విద్వత్‌పరుడు డాక్టర్ సుబ్రమణియన్. ఆయన పరిశోధన, రచనా వ్యాసంగాలు విస్తృతమైనవి. ప్రతిష్ఠాత్మక జర్నల్ ‘ఫారిన్ ఎఫైర్స్’ 2021, డిసెంబర్ సంచికలో ఆయన ఒక వ్యాసం రాశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని అరవింద్ సుబ్రమణియన్ ఆ వ్యాసంలో రాశారు. ఆయన ప్రధానంగా మూడు అంశాల గురించి పట్టించుకున్నారు. అవి: సబ్సిడీలు, సంరక్షణ విధానాలు, ప్రాంతీయ వాణిజ్య ఒడంబడికల పట్ల విముఖత. అలాగే సందేహాస్పద డేటా, సమాఖ్య విధానంపై వ్యతిరేకత, మెజారిటేరియనిజం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ తనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కొనసాగించదలుచుకున్నా 2018లో తాను ఎందుకు నిష్క్రమించవలసివచ్చిందో కారణాలను ఆయన అనుద్దేశపూర్వకంగానే వెల్లడించారు. ప్రభుత్వ పదవిలో ఆయన సంతోషంగా లేరు. బహుశా, పరిస్థితులు మరింత ఘోరంగా దిగజారగలవనే నిశ్చిత అభిప్రాయానికి అరవింద్ వచ్చి ఉంటారు.


దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు నిజంగానే దిగజారాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో 12 శాతంగా ఉన్న సగటు టారిఫ్ ఇప్పుడు 18 శాతానికి పెరిగింది. రక్షణ సుంకాలు, డంపింగ్ వ్యతిరేక సుంకాలను విచక్షణారహితంగా పెంచివేశారు. టారిఫేతర చర్యలనూ అదే రీతిలో చేపట్టారు. దేశానికి అమిత ప్రయోజనకరమైన బహుళపాక్షిక వాణిజ్య ఒప్పందాల నుంచి భారత్ వైదొలిగింది. అనేక బహుళపాక్షిక రాజకీయ-రక్షణ ఒప్పందాలలో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహపడిన నరేంద్ర మోదీ వాణిజ్య ఒడంబడికల పట్ల విముఖత చూపడం విచిత్రంగా ఉంది. 


మరో ఆర్థిక సలహాదారు కూడా ఒకానొకప్పుడు నరేంద్ర మోదీ ఆర్థిక విధానాలపై భ్రమలు కోల్పోయారు. డాక్టర్ అరవింద్ పనాగరియ గురించి నేను ప్రస్తావిస్తున్నాను. ఈయన ఇప్పుడు కొలంబియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర ఆచార్యులుగా ఉన్నారు. నీతి ఆయోగ్ మొదటి ఉపాధ్యక్షుడు అయిన ఈ అరవింద్ ఇటీవల ఒక జాతీయ దినపత్రికలో రాసిన ఒక వ్యాసంలో మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అయితే వ్యాసాంతంలో తన అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ పనాగరియ ఇలా రాశారు: ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా విశ్వవిపణికి తెరవాలి. అధిక సుంకాలను తగ్గించాలి. కాలం చెల్లిన యూజీసీని తొలగించి కొత్త చట్టంతో ఉన్నత విద్యా వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకురావాలి. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ప్రాతిపదికలను విస్తృతపరచాలి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేయాలి. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రారంభించాలి’.


కొద్ది సంవత్సరాల క్రితం వరకూ అరవింద్‌లు ఇరువురూ భారత ప్రభుత్వ ‘లోపలి మనుషులు’ అయినప్పటికీ ఉదారవాద ఆర్థికవేత్తలు. ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా ఉన్నారు. ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యమిచ్చే ఆర్థికాభివృద్ధి నమూనాకు మద్దతుదారులు. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో లోపాలను ఎత్తి చూపడానికి వారు సంకోచించినప్పటికీ, వాటి పర్యవసానాలను స్పష్టంగా పేర్కొనేందుకు ఇష్టపడలేదు ఎందుకనో?! ఈ కాలమ్ పాఠకులకు ఆ పర్యవసానాలు ఏమిటో బాగా తెలుసు. అయినా మరొక సారి వాటిని పేర్కొంటాను. అవి: పేద ప్రజలు అత్యధికంగా ఉన్న దేశంలో తలసరి ఆదాయం తగ్గుదల; పెరిగిన పోషకాహారలోపం, బాలల్లో స్తంభించిపోయిన ఎదుగుదల; ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాలలో 94 నుంచి 104వ స్థానానికి జారిపోవడం; పెద్ద నోట్ల రద్దు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అంతంత మాత్రం మద్దతు, పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేయడానికి నిరాకరణ, కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో సమర్థంగా వ్యవహరించలేకపోవడం వల్ల లక్షలాది కుటుంబాలు పేదరికం కోరల్లో చిక్కుకోవడం; పెరిగిన నిరుద్యోగిత (పట్టణాలలో 8.4 శాతం, గ్రామాల్లో 6.4 శాతం); ద్రవ్యోల్బణం పెరుగుదల; భారీ పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నుల వైపు మొగ్గు, జీఎస్టీ అస్తవ్యస్త అమలు; పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి విక్రయాల్లో లాభార్జనకు ప్రాధాన్యమివ్వడం; లైసెన్స్ -పర్మిట్ రాజ్ పునరాగమనం; పారిశ్రామిక రంగంలో గుత్తాధిపత్యాల పెరుగుదల; ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం; వృత్తి నిపుణుల వలసలు.


తప్పుడు ఆర్థిక విధానాలు, వాటి పర్యవసానాలకు ప్రజలు ఆర్థిక మూల్యం చెల్లిస్తున్నారు కానీ మోదీ ప్రభుత్వం ఇంకా రాజకీయ మూల్యం చెల్లించలేదు. మరే ఇతర ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా లక్షలాది పేద కార్మికులు డబ్బు, ఆహారం, మందులు లేకుండా వేలాది కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళడం జరుగుతుందా? కొవిడ్ లాంటి సంక్షోభ సమయంలో ఆస్పత్రులలో దిగ్భ్రాంతికరంగా పడకల, ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడడం సంభవిస్తుందా? ఆఖరుకు శ్మశానవాటికలలో మృతదేహాల ఖననం/దహనానికి వసతులు లేకపోవడం జరుగుతుందా? కొవిడ్ మృతుల సంఖ్యను సక్రమంగా నమోదు చేయకపోవడం, ఆ మహమ్మారితో మరణించినట్టు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడాన్ని ఊహించగలమా? బాలల, ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన వారి విద్యాభ్యాసం పట్ల అలక్ష్యం; నిరుద్యోగ యువజనుల సంఖ్య పెరుగుదల... ఈ విపరీతాలు మరే ఇతర ఉదారవాద ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రభుత్వ మనుగడను సవాల్ చేసి ఉండేవి కావా? అయితే మన భారతదేశంలో ప్రభుత్వం స్థిమితంగా ఉన్నది; పార్లమెంటులో చర్చలను నిలిపివేసింది; కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది; ప్రభుత్వ ప్రాయోజిత మత సంబంధ కార్యక్రమాలతో ప్రజలను చకిత పరుస్తుంది.


ఇదిలా ఉండగా అసమానతలు పెరిగిపోతున్నాయి. అన్యాయాలు పెచ్చరిల్లుతున్నాయి. ఎల్.ఛాన్సెల్, టి.పికెట్టీ తదితరులు రూపొందించిన ‘ప్రపంచ అసమానతల నివేదిక–2022’ ప్రకారం భారతదేశంలోని వయోజనులలో 10 శాతం మంది జాతీయ ఆదాయంలో 57 శాతం వాటాను కలిగివున్నారు; అట్టడుగున ఉన్న 50 శాతం మందికి జాతీయ ఆదాయంలో వాటా కేవలం 13 శాతం మాత్రమే. అత్యున్నత స్థాయిలో ఉన్న 1 శాతం మంది వాటా 22 శాతం! గత ఆదివారం నాడు విడుదలయిన ఆక్స్‌ఫామ్ నివేదిక కూడా ఆ గణాంకాలను బలపరిచింది. 2021 సంవత్సరంలో 84 శాతం కుటుంబాల ఆదాయం పడిపోగా బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. 2020 మార్చిలో రూ.23.14 లక్షల కోట్ల నుంచి 2021 నవంబర్‌లో రూ. 53.166 లక్షల కోట్లకు బిలియనీర్ల సంపద పెరిగింది. దాదాపు ఐదు కోట్ల మంది మరింత కటిక పేదరికంలోకి జారిపోయారు.


2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ మరి కొద్ది రోజుల్లో రాబోతుంది. తమ ఆర్థిక విధానాలను మార్చుకోవలసిన అవసరం లేదని నరేంద్ర మోదీ ప్రభుత్వం విశ్వసిస్తే అదొక విషాదమే అవుతుంది. లోపభూయిష్ట ఆర్థిక విధానాలు, వాటి పర్యవసానాలకు రాజకీయ మూల్యం చెల్లించవలసి ఉంటుందనే భయం ఆవహించినప్పుడు మాత్రమే ప్రజల శ్రేయస్సు పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరి మారుతుంది.


పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-01-22T06:13:26+05:30 IST