Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అవినీతిని ఈ–రూపీ తగ్గిస్తుందా?

twitter-iconwatsapp-iconfb-icon
అవినీతిని ఈ–రూపీ తగ్గిస్తుందా?

మనప్రజలను పీడిస్తున్న ప్రధాన వ్యాధులలో క్షయ ఒకటి. ఆ వ్యాధి చికిత్సకు తొమ్మిది నెలల పాటు ప్రతిరోజూ మందులను విధిగా తీసుకోవాలి. క్షయ నివారక మందులను రోగులకు చేరవేసేందుకు ప్రభుత్వం ఆరోగ్య సేవా కార్యకర్తలను నియమించడం ఒక ప్రశంసనీయమైన పని. ప్రభుత్వాధికారులు మందులను కొనుగోలు చేస్తారు. క్షేత్ర కార్యకర్తలు వాటిని రోగులకు అందజేస్తారు. ఈ ప్రక్రియ అవినీతికి అనేక అవకాశాలను కల్పిస్తోంది. దాంతో అవినీతిని అదుపు చేసి, ప్రభుత్వాధికారుల ప్రమేయం ఏ మాత్రం లేకుండా క్షయ రోగులకు నేరుగా మందులు అందజేసేందుకు కేంద్రప్రభుత్వం ఈ-రూపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. 


ఈ విధానంలో ఒక ప్రత్యేక ఈ-రూపీ ఓచర్‌ను జారీ చేస్తున్నట్టు ప్రభుత్వం క్షయ రోగి, నిర్దిష్ట దుకాణదారులు, నియమిత బ్యాంకుకు ఏకకాలంలో తెలియజేస్తుంది. రోగికి, అతని మొబైల్‌ఫోన్ ద్వారా ఒక కోడ్ అందుతుంది. నిర్దిష్ట మందుల దుకాణాలలో ఏదో ఒక దానికి అతడు వెళ్లి ఆ కోడ్‌ను చూపించి మందులు తీసుకుంటాడు. ఆ దుకాణదారుడు ఆ కోడ్‌ను నియమిత బ్యాంక్‌కు పంపిస్తాడు. సదరు బ్యాంక్ ఆ మందుల ఖరీదును మందుల దుకాణం ఖాతాలో జమ చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల మందుల కొనుగోలులో ప్రభుత్వోద్యోగుల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం ఉండబోదు. కనుక అవినీతికి అవకాశాలు తక్కువ. ఈ–రూపీ వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే రోగి తాను ఇష్టపడిన దుకాణంలో మందులు కొనుగోలు చేసుకోగలుగుతాడు. కనుక ఈ పథకం సంపూర్ణంగా స్వాగతించదగినది. 


అయితే ఈ పథకం కూడ భ్రష్టమార్గం పట్టేందుకు అవకాశాలు అనేకం ఉన్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద అందచేసే ఆహారధాన్యాల అక్రమవిక్రయాలను ఇందుకొక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ అనియత మార్కెట్ చాలా గ్రామాలలో సువ్యవస్థితమై ఉంది. తమకు అందుతున్న ఉచిత ఆహారధాన్యాలను లబ్ధిదారులు విక్రయించుకుని నగదు చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. వారు ఆ తిండిగింజలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు విక్రయిస్తారు. ఇదే విధంగా రోగి, ప్రభుత్వం తనకు పంపిన కోడ్‌ను, నిర్దిష్ట మందుల కోసం కాకుండా ఏదో ఒక టానిక్ కొనుగోలుకో లేదా నగదు చేసుకోవడానికో ఉపయోగించుకోవచ్చు. మందుల దుకాణం యజమాని ఈ-ఓచర్‌పై ఆ రోగికి రూ.70 చెల్లించి, బ్యాంకు నుంచి రూ.100 పొందవచ్చు. 


మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ-రూపీ విధానం ప్రజాస్వామ్య మౌలికభావనకు విరుద్ధమైనది. ప్రజలు స్వతంత్రులని మనం విశ్వసిస్తాం. ఏది మంచో ఏది చెడో వారు అవగతం చేసుకోగలుగుతారు. ఆ వివేచనతోనే సరైన నాయకుడిని తమ ప్రతినిధిగా చట్టసభకు పంపుతారు. ఈ ప్రకారం రసాయన ఎరువుల వాడకం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, క్షయ నివారణ మందులను నిరంతరం తీసుకోవడం మొదలైన అంశాలలోని మంచి చెడులను కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఈ అవగాహనకు పరిమితులు కల్పించేది డబ్బు మాత్రమే. ప్రజలు స్వతంత్రులని విశ్వసించినప్పుడు డబ్బును ఎరువులు, ఆహారం, మందుల కొనుగోలుకు ఎలా ఉపయోగించాలో అన్న విషయమై కూడా నిర్ణయాలు తీసుకోగలరని భావించాలి. అలాంటప్పుడు ఎరువులు, ఆహార ధాన్యాలు, మందుల పంపిణీకి పథకాలు రూపొందించవలసిన అవసరమే లేదు. వాటికి బదులుగా ప్రజలకు నగదు రూపేణా ఆర్థిక సహాయమందించాలి. తద్వారా తాము కోరుకున్న దుకాణంలో మందుల కొనుగోలు చేసుకునేందుకే కాకుండా అసలు మందులు, ఎరువులు, ఆహారధాన్యాల కొనుగోలు విషయమై సొంత నిర్ణయం తీసుకునే సాధికారిత కల్పించాలి. వందల సంఖ్యలో ఉన్న సంక్షేమ పథకాలను విలీనం చేసి ప్రజలకు నేరుగా డబ్బు సమకూర్చవచ్చు. 


ప్రజలకు సమాచారం సమకూర్చడం ప్రభుత్వ బాధ్యతలలో ఒకటి. సంక్షేమ పథకాలను అమలుపరిచేందుకు అధికసంఖ్యలో ఉద్యోగులను నియమించవలసి ఉంది. ఇందుకు బదులుగా క్షయ వ్యాధి నివారణకు నెలల తరబడి మందులు విధిగా తీసుకోవలసిన అవసరం గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ఒక విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎరువులు, ఆహార ధాన్యాల కొనుగోలుకు కూడా ఇది వర్తిస్తుంది. ఆ విధంగా సమాచార వ్యాప్తి, ప్రజల స్వతంత్ర నిర్ణయ శక్తికి తోడై మంచి ఫలితాలను సాధించగలుగుతుంది. అయితే ఇలా ప్రజాహిత సమాచార వ్యాప్తి బాధ్యతను నిర్వర్తించే విషయంలో ప్రభుత్వోద్యోగులు శ్రద్ధ చూపడం లేదు. దాని వల్ల తమకేమీ ప్రయోజనం సమకూరకపోవడమే అందుకు కారణం.


సమాచారాన్ని వ్యాప్తి చేయకపోవడం అంటే తమ సొంత సంక్షేమం విషయమై నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ప్రజలకు నిరాకరించడమే కదా. తద్వారా ప్రభుత్వోద్యోగులు తమకు తామే మందులు కొనుగోలు జేసి వాటిని రోగులకు అందజేస్తారు. ఈ క్రమంలో అవినీతికి పాల్పడేందుకు వారు తమకు తామే అవకాశాలు కల్పించుకుంటారు. 


చట్టసభలకు తమ ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రశంసనీయమైన వివేకాన్ని చూపే ప్రజలు తమ సొంత శ్రేయస్సునకు సంబంధించిన వ్యవహారాలలో తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోవడం కద్దు అనే వైరుధ్య భావనతోనే సంక్షేమ పథకాలు రూపొందుతున్నాయి. నిజానికి ప్రజల విజ్ఞతను గౌరవించి, వారికి నగదు, సమాచారాన్ని సమకూరిస్తే వారికి వారే స్వీయ సంక్షేమాన్ని, సాధికారతను సాధించుకోగలరు.

అవినీతిని ఈ–రూపీ తగ్గిస్తుందా?

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.