కేసీఆర్‌కున్న ప్రేమ ఢిల్లీ వాళ్లకుంటుందా?

ABN , First Publish Date - 2022-05-10T08:09:37+05:30 IST

‘‘దేశంలోని రెండు జాతీయ పార్టీలకు నీతి లేదు. తెలంగాణపై సీఎం కేసీఆర్‌కున్న ప్రేమ, ఆర్తి.. ఢిల్లీ, గుజరాత్‌ వారికి ఉంటాయా

కేసీఆర్‌కున్న ప్రేమ ఢిల్లీ వాళ్లకుంటుందా?

  • తెలంగాణ కోసం తపించే సీఎంను గుండెల్లో పెట్టుకోవాలి
  • ఆ జాతీయ పార్టీలకు నీతి లేదు
  • నారాయణపేట సభలో మంత్రి కేటీఆర్‌ 


మహబూబ్‌నగర్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలోని రెండు జాతీయ పార్టీలకు నీతి లేదు. తెలంగాణపై సీఎం కేసీఆర్‌కున్న ప్రేమ, ఆర్తి.. ఢిల్లీ, గుజరాత్‌ వారికి ఉంటాయా..? ఇక్కడి తొత్తులకు వారిని నిలదీసి అడిగే దమ్ముంటుందా..? ఎట్టిపనికైనా, మట్టిపనికైనా మనోడే వెళ్లాలని పెద్దలు చెబుతారు.


తెలంగాణను గుండెల్లో పెట్టుకున్న టీఆర్‌ఎ్‌సను, తెలంగాణ కోసం అనునిత్యం తపించే సీఎం కేసీఆర్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకోవాలి’’ అని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.82 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్టేడియం మైదానంలో ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన  జరిగిన ప్రగతి సభలో కేటీఆర్‌ మాట్లాడారు. బీజేపీ, కాంగ్రె్‌సలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాలు తేవడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారంటూ బీజేపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సెక్షన్‌ 3 ప్రకారం రాష్ట్రానికి 575 టీఎంసీల నీటిని ఇప్పించాలంటూ సీఎం కేసీఆర్‌ పలుమార్లు ప్రధాని మోదీని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. దున్నపోతు మీద వాన పడిన చందంగా వ్యవహరించారన్నారు. కేంద్రం నిర్వాకం వల్లే ఈ దుస్థితి నెలకొనగా.. 299 టీఎంసీలకే సీఎం కేసీఆర్‌ సంతకాలు పెట్టి వచ్చారంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 



పాదయాత్రలు చేస్తున్న బీజేపీ నాయకులకు దమ్ముంటే తెలంగాణ ఉద్యమ సమయంలో సుష్మాస్వరాజ్‌ ఇచ్చిన హామీ మేరకు పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. 14న తెలంగాణకు వస్తున్న అమిత్‌ షా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలన్నారు. ఇక్కడ పాదయాత్రలు చేస్తున్న చిల్లర వ్యక్తులను తాను అడగడం లేదని, అమిత్‌ షా స్పందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో పాలమూరులో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేసి 8 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చిందని, ఇందుకోసం రూ.28 వేల కోట్లు ఖర్చు చేసిందని, ఇందులో 28 పైసలు కూడా కేంద్రానివి లేవని చెప్పారు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడం కాదని, చేతనైతే రూ.30 వేల కోట్లు తేవాలని సవాల్‌ విసిరారు. కృష్ణా-వికారాబాద్‌, మాచర్ల-గద్వాల రైల్వే లైన్లు తేవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు అన్ని నిధులూ కేంద్రమే ఇస్తోందని ప్రచారం చేస్తున్న చిల్లర వ్యక్తులు దేశాన్ని పోషిస్తున్న నాలుగో రాష్ట్రం తెలంగాణ అంటూ ఆర్‌బీఐ ఇచ్చిన నివేదిక చదవాలని హితవు పలికారు. ఏడున్నరేళ్లలో కేంద్రానికి తెలంగాణ నుంచి రూపాయి ఇస్తే.. 48 పైసలే వెనక్కిచ్చారని తెలిపారు. గ్రూప్‌-1లో ఉర్దూ పరీక్షపై రాద్దాంతం చేస్తున్నారని, రాజ్యాంగం గుర్తించిన ఉర్దూను మతపరమైన భాషగా ప్రచారం చేసి పిల్లల్లో విషబీజాలు ఎందుకు నాటుతున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎడ్లంటే, వడ్లంటే తెలియని నేత రైతు సంఘర్షణ సభ పెట్టారని.. ఒక్క చాన్స్‌ ఇవ్వమని అడుగుతున్న ఆయన పదిసార్లు అవకాశమిస్తే దేశానికి ఏం చేశారని నిలదీశారు. సోనియా వల్లే బలిదానాలు జరిగిన మాట వాస్తవం కాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ తర్వాత అభివృద్ధి పథంలో తీసుకెళ్లే వ్యక్తి కేటీఆరేనన్న విశ్వాసం బడుగు, బలహీనవర్గాల్లో ఉందని చెప్పారు. కేటీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. 


‘ఆరుణ్య’తో ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం 

నారాయణపేటలో మహిళాస్వయం సహాయక బృందాలు నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్స్‌, హ్యాండీక్రాఫ్ట్స్‌ ప్రాజెక్ట్‌ ‘ఆరుణ్య’తో ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారు. కేటీఆర్‌ సమక్షంలో ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రజనీష్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

Read more