బీజేపీని ఓడించొచ్చు. కానీ..: ప్రశాంత్ కిశోర్

ABN , First Publish Date - 2022-01-25T01:28:10+05:30 IST

నేను చాలా చిన్న వ్యక్తిని. నేను అంత పెద్ద పార్టీపై రివేంజ్ తీర్చుకోవడం ఏంటి? నేను కేవలం బీజేపీని ఓడించడం గురించి మాట్లాడుతున్నాను. దాని సాధ్యాసాధ్యాలపై నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నాను. కానీ కాంగ్రెస్ ఎజెండా ఏదైనా దానిని..

బీజేపీని ఓడించొచ్చు. కానీ..: ప్రశాంత్ కిశోర్

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించొచ్చని అయితే అది ఇప్పుడున్న ప్రతపక్షంతో (కాంగ్రెస్) సాధ్యం కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోమారు తేల్చి చెప్పారు. గతంలో కూడా ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించాలంటే ఒక కొత్త కూటమి అవసరమని, ఆ కూటమి ఏర్పాటుకు తాను సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్ అని వస్తున్న వ్యాఖ్యలను ఆయన తోసి పుచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమేనని పీకే అన్నారు.


సోమవారం ఓ జాతీయ మీడియా సంస్థతో పీకే మాట్లాడుతూ ‘‘2024లో బీజేపీని ఓడించడం సాధ్యమే. కానీ ఇప్పుడున్న ప్రతిపక్షంతో అది సాధ్యమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నా అభిప్రాయం అయితే కచ్చితంగా సాధ్యం కాదు. బీజేపీని ఓడించడానికి ఒక కొత్త ప్రతిపక్షం కావాలి, కొత్త కూటమి కావాలి. ఆ కూటమికి నేను సాయం అందిస్తాను’’ అని అన్నారు. గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమం లాంటి అనేక వాదాలను బీజేపీ అద్భుతంగా ప్రజల్లోకి చొప్పించగలిగిందని కానీ ప్రతిపక్ష పార్టీలు ఒక్కదాన్ని కూడా ప్రజల నుంచి తొలగించలేకపోయాయని పీకే అన్నారు.


‘‘బీజేపీని ఓడించడానికి ఏ పార్టీకైనా 5-10 సంవత్సరాల ప్రణాళిక అవసరం. కేవలం 5 నెలల్లో అయ్యే పని కాదు’’ అని పీకే అన్నారు. ఇక కాంగ్రెస్‌తో తాను సాగించిన చర్చల గురించి మాట్లాడుతూ ‘‘ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ కలిసి పని చేయొచ్చు కదా అని చాలా మంది సాధారణంగా చెబుతుంటారు. కానీ ఇరువైపుల నుంచి ఆహ్వానం ఉండాలి. కానీ అది కాంగ్రెస్‌తో సాధ్యం కాలేదు. నేను కాంగ్రెస్‌ను విశ్వసిస్తాను. పక్కా ఎజెండా, చొచ్చుకుపోగలిగే వ్యూహం లేకుండా ఇప్పటి అధికారపక్షాన్ని కొట్టలేం. అయితే అది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకత్వంలో ఉంటుందని చెప్పలేం. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌లో ప్రక్షాళన అవసరం’’ అని పీకే అభిప్రాయపడ్డారు.


అయితే కాంగ్రెస్‌తో చర్చలు విఫలం కావడంతో కాంగ్రెస్‌పై పీకే రివేంజ్ తీర్చుకుంటున్నారని.. కాంగ్రెస్ స్థానంలో టీఎంసీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పీకేపై విమర్శలు వస్తున్నాయి. పోయిన ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి వ్యూహకర్తగా పీకే పని చేశారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ ముప్పావు స్థానాలతో అద్భుతమైన మెజారిటీ సాధించింది. ఆ సమయం నుంచే పీకేకు టీఎంసీకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని, ఆ సాన్నిహిత్యంతోనే టీఎంసీని కాంగ్రెస్ స్థానంలోకి తీసుకురావాలని పీకే చూస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ఈ వ్యాఖ్యలపై పీకే స్పందిస్తూ ‘‘నేను చాలా చిన్న వ్యక్తిని. నేను అంత పెద్ద పార్టీపై రివేంజ్ తీర్చుకోవడం ఏంటి? నేను కేవలం బీజేపీని ఓడించడం గురించి మాట్లాడుతున్నాను. దాని సాధ్యాసాధ్యాలపై నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నాను. కానీ కాంగ్రెస్ ఎజెండా ఏదైనా దానిని మరింత బలహీన పర్చే విధంగా ఉండకూడదు. ఇది ఎవరి కోసమే చేస్తున్నది కాదు. పూర్తిగా ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం’’ అని పీకే అన్నారు.

Updated Date - 2022-01-25T01:28:10+05:30 IST