జీతాలు ఆపేస్తే ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందా?

ABN , First Publish Date - 2022-09-28T05:58:53+05:30 IST

అధికారుల జీతాలు నిలిపేస్తే ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందా అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు.

జీతాలు ఆపేస్తే ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందా?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమర్‌

మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్న 


పలమనేరు, సెప్టెంబరు 27: అధికారుల జీతాలు నిలిపేస్తే ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందా అని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరగడంలేదంటూ ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, హౌసింగ్‌ అధికారుల జీతాలను నిలిపివేయాలంటూ కలెక్టర్‌ హరినారాయణన్‌ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి అమర్‌ స్పందించారు. పలమనేరు టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా గృహ నిర్మాణ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒక్కో ఇంటికి రూ.2.5 లక్షలు మంజూరు చేయగా ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.1.8 లక్షలకు కుదించిందన్నారు. అంతేకాక ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు స్థలంలో ఇళ్లు మంజూరు చేశారన్నారు. దీనికి తోడు పట్టణాలకు సుదూరంగా ఏమాత్రం నివాసం కాని ప్రాంతాల్లో నివేశ స్థలాలు కేటాయించారన్నారు. లబ్ధిదారులు మట్టి, ఇసుక, ఇటుక తదితరాలను వైసీపీ నాయకుల వద్దే కొనాల్సి వస్తోందని ఆరోపించారు. దీంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా దాపురించి ఉంటే అధికారుల జీతాలు నిలిపి వేస్తూ కలెక్టర్‌ ఆదేశాలివ్వడం దారుణమన్నారు. లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందించడంతో పాటు, ఇళ్ల నిర్మాణానికి కావలసిన సామగ్రి అందుబాటులో ఉంటే ఇల్లు నిర్మించుకొంటారని, అలా కాకుండా అధికారుల జీతాలు నిలిపివేస్తే ఎలా పూర్తవుతాయని అమర్‌ ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న రూ.లక్షన్నర, ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న రూ.30 వేలనూ రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదని కేంద్ర మంత్రి నారాయణస్వామి పేర్కొనడం చూస్తే.. ఈ ప్రభుత్వానికి పేదల ఇళ్ల నిర్మాణంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. ఇకనైనా అధికారులు వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు. అమర్‌తోపాటు నాగరాజ రెడ్డి, నాగరాజు, ఖాజా, సుబ్రమణ్యంగౌడ్‌, గిరిబాబు, సోమశేఖర్‌, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:58:53+05:30 IST