యోగిపై పోటీ చేస్తా

ABN , First Publish Date - 2022-01-28T08:14:14+05:30 IST

గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక చిన్నారులు మృతి చెందిన ఘటనలో తనపై అక్రమంగా నిందలు మోపి జైలు పాలు చేశారని డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ ఆరోపించారు.

యోగిపై పోటీ చేస్తా

  • తప్పుడు కేసు పెట్టి నన్ను జైలుకు పంపారు
  • ఆస్పత్రి సిబ్బంది 6 లక్షల లంచం కోసం 
  • 80 మంది చిన్నారులను బలిగొన్నారు
  • పుస్తకావిష్కరణలో డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌


హైదరాబాద్‌ సిటీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక చిన్నారులు మృతి చెందిన ఘటనలో తనపై అక్రమంగా నిందలు మోపి జైలు పాలు చేశారని డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ ఆరోపించారు. తన పేరు కఫీల్‌ ఖాన్‌ కాకుండా కఫీల్‌ శర్మ, కఫీల్‌ వర్మ అయినా ఇలాగే జరిగి ఉండేదని అన్నారు. ప్రభుత్వ అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకు తనను బలిపశువు చేశారని పేర్కొన్నారు. ఏ పార్టీ అయినా తనకు గోరఖ్‌పూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే.. యోగిపై పోటీ చేస్తానని చెప్పారు. మెడికల్‌ సర్వీస్‌ సెంటర్‌ హైదరాబాద్‌ శాఖ, సియాసత్‌ పత్రిక ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘ది గోరఖ్‌పూర్‌ హాస్పటల్‌ ట్రాజెడీ’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గోరఖ్‌పూర్‌ ఆస్పత్రి అధికారులు రూ.6 లక్షల లంచం డిమాండ్‌ చేయడంతో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయిందని, దాని కారణంగా 80 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.


చిన్నారులను కాపాడేందుకు తాను సొంతంగా 50 ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేశానని తెలిపారు. ఆక్సిజన్‌ కొనుగోలు చేసి చిన్నారుల ప్రాణాలు కాపాడిన వైద్యుడని తనను పొగిడిన మీడియా.. ఆ తర్వాత  24 గంటల్లోనే  చిన్నారుల ప్రాణాలు తీసిన హంతకుడిగా చిత్రీకరించిదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు మృతి చెందారని, ఆయా కుటుంబాలకు న్యాయం జరిగేదాకా పోరాడుతానని చెప్పారు. ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ యూపీలో 500కుపైగా ఎన్‌కౌంటర్లు జరిగాయని, చట్టం ఎక్కడుందని ప్రశ్నించారు. సియాసత్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ ఖాన్‌ మాట్లాడుతూ యూపీలో బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పోరాడుతున్న కఫీల్‌ ఖాన్‌ నిజమైన హీరో అని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-01-28T08:14:14+05:30 IST