Agnipathకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: Punjab CM

ABN , First Publish Date - 2022-06-28T23:13:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'అగ్నిపథ్' స్కీమ్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేయనున్నట్టు..

Agnipathకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: Punjab CM

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 'అగ్నిపథ్' స్కీమ్‌ (Agnipath Scheme)కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక తీర్మానం చేయనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. మంగళవారంనాడు అసెంబ్లీ జీరో అవర్‌లో విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా లేవనెత్తిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, త్వరలోనే అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని చెప్పారు. అగ్నిపథ్ పథకం భారత సైన్యం మౌలిక నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుందని, ఎన్డీయే ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా, హేతుబద్ధం కాని నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఇందువల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు.


పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ, సాగు చట్టాలు వంటి పథకాల ప్రయోజనం ఏమిటో ఒక్క బీజేపీ నేతలకు మినహా ఎవ్వరికీ, ఎన్నటికీ అర్థంకావని భగవంత్ మాన్ విమర్శించారు. అలాంటి అనాలోచిత చర్యల్లో ఇప్పుడు అగ్నిపథ్ కూడా వచ్చి చేరిందని అన్నారు. ఎవ్వరికీ ఈ స్కీమ్ ప్రయోజనాలేమిటో అర్ధంకానే కావని చెప్పారు. 17 ఏళ్ల వయస్సులో ఒక యువకుడు ఆర్మీలో చేరితే నాలుగేళ్ల తర్వాత...అంటే 21వ సంవత్సరంలో రిటైర్ అవుతాడని, నాలుగేళ్ల సర్వీసుకు ఎలాంటి ప్రయోజనాలు కానీ, పెన్షన్ కానీ రావని అన్నారు. మాతృభూమికి సేవ చేయాలనుకునే యువతకు ఇది చాలా పెద్ద నష్టమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు అగ్నిపథ్ ఒక ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు. ఇందువల్ల దేశప్రజలకు చాలా పెద్ద అన్యాయం జరుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని పంజాబ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, త్వరలోనే అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తుందని చెప్పారు. యువత భవిష్యత్తు భద్రంగా ఉండేందుకు తెస్తున్న ఈ తీర్మానానికి విపక్షాలు సైతం సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-28T23:13:46+05:30 IST