ప్రభవిస్తావా!

ABN , First Publish Date - 2021-02-22T05:42:04+05:30 IST

నీ చేతి గోరు వెచ్చటి నీళ్లతో పెరిగాను నా కోసం పేడెత్తిన చేతుల్నిరుద్దిరుద్ది కడిగి చనుబాలిచ్చావు...

ప్రభవిస్తావా!

నీ చేతి గోరు వెచ్చటి 

నీళ్లతో పెరిగాను 

నా కోసం పేడెత్తిన చేతుల్ని 

రుద్దిరుద్ది కడిగి చనుబాలిచ్చావు

మడికయ్యలో వరి నాట్లేస్తూ

నా కోసం గట్టున చెట్టుకు ఉయ్యాల కట్టావు

నింగిలో మలయమారుతం చూశాను

నీ చేతి గోరుముద్దలతో

చందమామను చూశాను

కాయకష్టం చేసి 

కాలేజీ మెట్లెక్కించావు 

నీ వయసును కరిగించి 

నా భవిష్యత్తుకు బాటలు వేశావు 

కోడలంటూ కూతుర్ని తెచ్చుకున్నావు 

కనుబొమ్మలపై చేతులెట్టి 

మా జంటను ఎన్నిసార్లు చూసినా 

ముడతల నీ మందహాసం ఆగదు

తరిగిపోతున్న నీ ఆయుష్షును

ఏ విధంగా పెంచగలను చెప్పు

నా పాపవై ప్రభవిస్తావా తల్లీ!

పేరూరు బాలసుబ్రమణ్యం

98492 24162


Updated Date - 2021-02-22T05:42:04+05:30 IST