అమరావతి : రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరఫున (YSR Congress) బరిలో నిలిచే అభ్యర్థులపై ఏపీలో ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. రాజ్యసభ (Rajya Sabha) ద్వైవార్షిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి (Chief Minister) ఖరారు చేశారని.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే వైసీపీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy), ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి లేదా ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ టికెట్ ఇవ్వాలని ఇదివరకే నిశ్చయించినట్లు సమాచారం. అయితే మహిళ కోటాలో కృపారాణిని పంపుతున్నందున గౌతమ్ అదానీకే అవకాశం లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. బీద మస్తాన్‌రావుకు బీసీ కోటా రాజ్యసభ సీటివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.
అనూహ్యంగా తెరపైకి..!
ఇప్పటి వరకూ ఈ పేర్లు మాత్రమే వినిపిస్తుండగా.. అనూహ్యంగా జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆయన అమరావతికి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కృష్ణయ్య భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం ఏ పార్టీలో లేరు.. అయితే.. బీసీ సంఘాల అధ్యక్షుడిగా కీలక పాత్రే పోషిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వైఎస్ జగన్‌పై.. కృష్ణయ్య పలు బహిరంగ సభల్లో పొగడ్తల వర్షం కురిపించారు కూడా. ఇప్పటి వరకూ జాబితాలో కృష్ణయ్య పేరుందని వార్తలు వచ్చాయి. అయితే ఆయనే స్వయంగా తాడేపల్లికి కూడా రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
ఆ నలుగురు ఎవరో..!?
కాగా.. సీఎం ప్రస్తుతం కర్నూలు జిల్లా పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు. దీంతో.. సీఎం వచ్చేంత వరకూ అమరావతిలో కృష్ణయ్య ఉండి.. అనంతరం జగన్‌తో భేటీ కానున్నారు. ఇవాళ లేదా రేపు రాజ్యసభ అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే.. విజయ సాయి రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలతో పాటు కిల్లి కృపారాణి లేదా చలమల శెట్టి సునీల్ ఇద్దరిలో ఒక్కరికి అవకాశం అని ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. శాసన సభలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే నాలుగు స్థానాలూ వైసీపీ ఖాతాలోకి చేరడం ఖాయమని తెలుస్తోంది. కాగా.. ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీకాలం జూన్- 21తో ముగియనుంది.
షెడ్యూల్ ఇదీ..
దేశవ్యాప్తంగా ఖాళీ అవబోతున్న 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ఆయా స్థానాలకు ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 31వ తేదీ. జూన్ 1న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదే నెల 3వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇక జూన్ 10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.