Jul 22 2021 @ 00:16AM

సమయం వచ్చినప్పుడు సమాధానం చెపుతా

‘‘స్థలం లేకుండా బిల్డింగ్‌ ఎక్కడ కడతారు’ అని నాగబాబుగారు అడిగారు. సమయం వచ్చినప్పుడు ఆయనకు సమాధానం చెబుతాను’’ అని  మంచు విష్ణు అన్నారు. ‘మా’ ఎన్నికలు, అధ్యక్ష పదవికి తన పోటీ గురించి పలు విషయాలను బుధవారం   ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.  


కేటీఆర్‌గారితో నాకు సాన్నిహిత్యం ఉంది. జగన్‌ అన్నను అడిగే చనువుంది. అందరినీ కలిసి ‘మా’కు కావాల్సింది సాధిం చుకోవడానికి కృషి చేస్తాను. 

మా సాయం వల్ల జైలు కెళ్లాల్సిన వ్యక్తి బయట ఉన్నారు. అది ఎవరనేది నేను ఇప్పుడు చెప్పను. మన సాయంపొందిన వ్యక్తి మనకు రుణపడి ఉండాలని కోరుకోను. కానీ  వాళ్లు శృతిమీరితే మాత్రం చెపుతాను. ‘మా’ అంతా ఒకే కుటుంబం. వివాదాలు ఉంటాయి. నాలుగు గోడల మధ్యన మాట్లాడుకోవాలి. కానీ బయటకి వచ్చి మాట్లాడకూడదు. అదే నాకు కోపం తెప్పించింది

2016లోనే మురళీ మోహన్‌, దాసరి నారాయణరావుగారు తదితర పెద్దలు నన్ను ప్రెసిడెంట్‌గా ఉండమన్నారు. అయితే ‘విష్ణుది చిన్నవయసు వద్దు’ అని నాన్నగారు వారందరికీ నచ్చచెప్పారు. అప్పుడు రాజేంద్రప్రసాద్‌ను ఎన్నుకున్నారు. మా అక్క మంచులక్ష్మిని ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌గా  ఎన్నుకున్నారు. మళ్లీ ఈ ఏడాది జనవరిలో ‘మా’ అధ్యక్షుడిగా ఉండాలని కొంతమంది సినీ పరిశ్రమకు చె ందిన పెద్దలు నన్ను  అడిగారు. ఇప్పుడు వారి పేర్లు చెప్పలేను.  ఎన్నికల ప్రకటన వచ్చాకే నేను పోటీ చేసే విషయం  చెపుదామనుకున్నాను. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ముందుగానే ప్రకటించాల్సి వస్తుంది. నేను పోటీ చేస్తే నూరుశాతం గెలుస్తాను. ఎలా అనేది ఇప్పుడు  చెప్పను.  

రాష్ట్ర రాజకీయాల కన్నాకూడా ‘మా’ ఎన్నికలు ఎక్కువ చర్చనీయాంశం అవుతున్నాయి. కొంతమంది మాట్లాడిన మాటలే దానికి కారణం. వారు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. చిరంజీవి, మురళీమోహన్‌,  నాన్న వంటి పెద్దలందరూ కలసి ఎవర్నైనా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను బరి నుంచి తప్పుకుంటాను.. లేకపోతే పోటీకి సిద్ధం.

ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేని లోటు ఉంది. ‘ఆసక్తి లేదు, ఆ బాధ్యతలు నాకు వద్దు’ అని నాన్నగారు అన్నారు. ఇండస్ట్రీలో ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకోవాలి. 

జయసుధ ఆంటీతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఆమె మా ప్రత్యర్థి ప్యానెల్‌లో ఎందుకున్నారు అనేది ఆమెను అడగాలి. అయినా దానివల్ల మా మాధ్య ఎలాంటి పొరపొచ్చాలు రావు. 

ఇప్పటికీ ఎప్పటికీ ‘మా’దంతా ఒకటే ఫ్యామిలీ. ఎన్నికల వల్ల మా మధ్య అనుబంధాలు పాడవుతాయని అనుకోవడం లేదు. ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందనేది ఏదో ఒకరోజు చెపుతాను. 

నటులకు ఉన్న ఒకే ఒక ఆదాయ అవకాశం నటన. ఇక్కడ అవకాశాలు తగ్గితే వారి జీవనోపాధి పోతుంది. ‘మా’ ఫ్యామిలీ కష్టంలో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతుంది అనే నమ్మకం సభ్యుల్లో కలిగించాలనేది నా ఆశయం. వారి జీవితాలను ఉద్ధరించలేకపోయినా పనిలేనప్పుడు కూడా మూడు పూటలా తిండికి లోటులేకుండా చూడాలి అనేది నా ఆశయం. నటీనటులందరికీ ‘మా’లో సభ్యత్వం ఉండాలి.  వారందరికీ ఉపాధి కల్పించాలి. నా అజెండాతో త్వరలో మీ ముందుకొస్తా.

‘మా’ ఎన్నికల్లో తెలంగాణ ప్రాతినిథ్యం గురించి నేనేం మాట్లాడను. 

‘మా’ ఎన్నికల్లో పోటీ గురించి కల్యాణ్‌రామ్‌కి చెపితే ‘ఇప్పుడు నీకు ఇదంతా అవసరమా?’ అన్నాడు.