30లక్షల ఎకరాల సాగు ఎండమావేనా?

ABN , First Publish Date - 2021-07-19T05:47:05+05:30 IST

ఓ వైపు కృష్ణమ్మ, మరోవైపు గోదావరి మధ్య మూసీ నదితో ఉమ్మడి నల్లగొండ జిల్లా జల వనరులతో కళకళలాడుతోంది. గతంలో సాగునీరు అందుబాటులో లేక కడుపునిండా తిండిలేక పొట్ట చేతపట్టుకొని ముంబై, దుబాయి, బెజవాడ వలస వెళ్లిన తుంగతుర్తి, దేవరకొండ ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం స్థానికంగానే పంటలు సాగు చేస్తూ రికార్డు స్థాయిలో ధాన్యం, పత్తి దిగుబడి చేస్తున్నారు.

30లక్షల ఎకరాల సాగు ఎండమావేనా?
మూసీ ప్రాజెక్టు

నదీ జలాలపై కేంద్రం పెత్తనంతో ప్రాజెక్టుల భవిత ప్రశ్నార్థకం

మూసీ, ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ, డిండి, బ్రాహ్మణవెల్లెంలకు గండం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): ఓ వైపు కృష్ణమ్మ, మరోవైపు గోదావరి మధ్య మూసీ నదితో ఉమ్మడి నల్లగొండ జిల్లా జల వనరులతో కళకళలాడుతోంది. గతంలో సాగునీరు అందుబాటులో లేక కడుపునిండా తిండిలేక పొట్ట చేతపట్టుకొని ముంబై, దుబాయి, బెజవాడ వలస వెళ్లిన తుంగతుర్తి, దేవరకొండ ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం స్థానికంగానే పంటలు సాగు చేస్తూ రికార్డు స్థాయిలో ధాన్యం, పత్తి దిగుబడి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ మూలన ఎకరం పొలం కొనుగోలు చేయాలన్నా రూ.10లక్షలకు పైమాటే. ఈ నేపథ్యంలో కృష్ణా ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి వనరులను దృష్టిలో పెట్టుకొని గోదావరితో సాగర్‌ ఎడమ కాల్వను అనుసంధానం చేసి భవిష్యత్తులోనూ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధమవుతుండగా ఢిల్లీ పెద్దల పెత్తనం పెరగడంతో ఉమ్మడి జిల్లా రైతుల్లో గుబులు మొదలైంది. వరద వచ్చిన రోజుల్లో పర్వాలేదు గానీ, ఏమాత్రం నీటి కొరత ఏర్పడినా సాగుకు దూరం కావాల్సిందే. ఇక ఇప్పటివరకు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల, శ్రీశైలం సొరంగం, బ్రాహ్మణవెల్లంల, మూసీ వంటి ప్రాజెక్టులకు వచ్చే ఆరు నెలల్లో అనుమతులు సాధ్యమేనా? ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అనే ఆందోళన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది.                                                           


రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల నిర్వహణ ఇక నుంచి తమ పరిధిలోకి వస్తుందని, వీటిపై అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులకు ఆరు నెలల్లో అనుమతులు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. అనుమతులు లేని ప్రాజెక్టుల వివరాలతో కేంద్రం ఇప్పటికే గెజిట్‌ కూడా విడుదల చేసింది. వరద నీటి ప్రవాహ పరిస్థితులు గమనించడం, ఏ సమయంలో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలి, ఎప్పుడు నిలుపుదల చేయాలి వంటి నిర్ణయాలన్నీ ఇకపై బోర్డు అధికారులే తీసుకుంటారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సుమారు 4లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. దీంతో పాటు ఎడమ కాల్వ పరిధిలో పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు ఇప్పటికే ఉన్నాయి. వీటికి అదనంగా మరో 12ఎత్తిపోతల పథకాలను సీఎం కేసీఆర్‌ తాజాగా మంజూరుచేశారు. కృష్ణాజలాల నియంత్రణ కేంద్రం పరిధిలోకి వెళ్తే ప్రస్తుతం సాగుభూమి విస్తీర్ణం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 30లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. నల్లగొండ జిల్లాలో 14లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 9లక్షలు, యాదాద్రి జిల్లాలో 7 లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి, పత్తి, కంది పంటలు సాగవుతున్నాయి. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 3లక్షల ఎకరాలకు సాగు, తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో డిండి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. దీనికి అనుసంధానంగా ఐదు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. సగం పూర్తయిన ఈ ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారింది. దీనికి అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌లో ప్రకటించింది. రూ.699కోట్ల అంచనా వ్యయంతో బి.వెల్లంల, ఉదయ సముద్రం ఎత్తిపోతల పనులు కొనసాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీలో అంతర్భాగంగా 2007లో ఈ ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్‌ శంకుస్థాపన చేశారు. పనులు 80శాతం పూర్తికాగా, ఈ ప్రాజెక్టుకు అనుమతి లేదని తాజాగా కేంద్రం ప్రకటించింది. రూ.1,325కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన శ్రీశైలం ఎడమ కాల్వ సొరంగం ప్రాజెక్టు (ఎస్‌ఎల్‌బీసీ) పనులు 90శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుతోపాటు, మూసీకి సైతం అనుమతులు లేవని కేంద్రం ప్రకటించింది.


నదుల అనుసంధానం కలేనా?

ఆలేరు రిజర్వాయర్‌కు గోదావరి నీటిని మళ్లించి అక్కడి నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా మిర్యాలగూడెం వరకు మొదటి జోన్‌ పరిధిలోని సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టుకు సాగు నీరందించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు గోదావరిలో నీటి లభ్యత ఉండటం లేదు. గోదావరి నిండితే కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. ఇప్పటికే 70 నుంచి 90శాతం పూర్తయిన ప్రాజెక్టుల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారగా, ఇంకా కాగితాల్లోనే ఉన్న గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ఇప్పట్లో సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.


ప్రాజెక్టుల పనులన్నీ నిలిచిపోతాయి: శ్యాంప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణకు ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరగనుం ది. ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా అర్డీఎస్‌ విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల ను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఆ ప్రాజెక్టులను కేంద్రం గెజిట్‌లో ప్రకటించకుండా కేవలం తెలంగాణ ప్రాజెక్టులనే ఆపాలని, అనుమతులు తీసుకోవాలని ప్రకటించడం అన్యాయం. కేంద్రం తాజా గెజిట్‌ ప్రకారం డిండి ఎత్తిపోతల ఎస్‌ఎల్‌బీసీ సొ రంగం, ఉదయ సముద్రం లిఫ్ట్‌ పనులను ఈనెల 15వ తేదీ నుంచే నిలిపివేయాలి. వీటికి అనుమతులు వచ్చాకే పనులు ప్రారంభించాలి. ఇప్పటికే కొనసాగుతున్న ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలి. ఇంకా పనులు ప్రారంభంకాని నెల్లికల్లుతో పాటు 15ఎత్తిపోతల పథకాల పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆరునెలలు అంటే జనవరి 15నాటికి బోర్డుకు అవసరమైన పోలీస్‌ సిబ్బంది, నీటి పారుదల సిబ్బంది అందుబాటులోకి వస్తారు. అప్పుడు జలవనరుల బోర్డు సిబ్బంది నేరుగా పనులు జరుగుతున్న ప్ర దేశానికి వచ్చి పనులను అడ్డుకుంటారు. కృష్ణాజలాల్లో 810టీఎంసీలు ఏపీ, తెలంగాణకు ట్రైబ్యున ల్‌ పంచాలి. లేదా రెండు రాష్ట్రాలు కూర్చోని నీటి పంపకానికి ఒప్పందం చేసుకోవాలి. చెరిసగం వాడుకోవాలని 2015లో ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. అది ఒక ఏడాదికి మాత్రమే పరిమితమైంది. నీటి వాటాలు పంచకుండా అక్రమ ప్రాజెక్టులంటూ కేంద్రం ప్రకటించడం అన్యాయం.



ఇద్దరు సీఎంల రాజకీయ ప్రయోజనంతో జరిగిన నష్టం ఇది : జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన రాజకీయాన్ని వారి పదవులు, ప్రతిష్టల కోసం వివాదాన్ని పెద్దది చేశారు. ఇదే అవకాశంగా ఢిల్లీ పెద్దలు మిగులు జలాలపై కర్రపెత్తనం ప్రారంభించారు. జల వివాదాలను పరిష్కరించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ ఉంది. అక్కడ కూర్చుని సమస్య పరిష్కరించుకోవచ్చు. కానీ, కేంద్రం తీరుతో ఇద్దరు సీఎంలు ఢిల్లీ పెద్దల వద్ద మోకరిల్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


Updated Date - 2021-07-19T05:47:05+05:30 IST