18 గిరిజన పథకాలను రద్దు చేస్తారా?

ABN , First Publish Date - 2022-07-17T08:34:00+05:30 IST

గిరిజన హక్కులకు దిక్కేది?.. రాష్ట్రంలో 18 గిరిజన పథకాలను రద్దుచేశారు. గిరిజన హాస్టళ్లు, గురుకులాలు దయనీయ స్థితికి చేరుకున్నాయి.

18 గిరిజన పథకాలను రద్దు చేస్తారా?

ఒక్క గిరిజనుడికైనా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారా?

ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్కరైనా గిరిజనుడున్నారా?

దేవాలయాల్లో గిరిపుత్రులకు ప్రాతినిధ్యమేదీ?

గిరిజనుల్లో సమర్థులే కనిపించలేదా?

అధ్వాన పరిస్థితుల్లో గిరిజన గురుకులాలు

సర్కారుపై భగ్గుమన్న గిరిజన నేతలు

రాష్ట్ర గిరిజన కమిషన్‌ సమావేశంలో గగ్గోలు


అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన హక్కులకు దిక్కేది?.. రాష్ట్రంలో 18 గిరిజన పథకాలను రద్దుచేశారు. గిరిజన హాస్టళ్లు, గురుకులాలు దయనీయ స్థితికి చేరుకున్నాయి. ఒక్క ఎమ్మెల్సీనైనా గిరిజనుడికి ఇచ్చారా?.. దేవాలయాల్లో గిరిపుత్రులకు స్థానమేదీ? ఇలా ప్రభుత్వంపై గిరిజన సంఘాల నేతల విరుచుకుపడ్డారు. సాక్షాత్తు ఎస్టీ కమిషన్‌ ఆధ్వర్వంలో విజయవాడలో నిర్వహించిన గిరిజన నేతల సమావేశంలో.. చైర్మన్‌ కుంభా రవిబాబు ఎదుట.. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల సమస్యలపై చర్చించేందుకు, ఎస్టీ కమిషన్‌ ద్వారా చేపట్టవలసిన కార్యాచరణ కోసం అన్నిజిల్లాల గిరిజన నేతలను ఆహ్వానించగా వారు సమస్యలు ఏకరువు పెట్టారు.


రాష్ట్ర యానాదుల సంఘం ప్రధాన కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గాల డీలిమిటేషన్‌ 2026న ప్రారంభించే నాటికి ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు తెచ్చి గిరిజనులకు ఎక్కువ సీట్లు కేటాయించే విధంగా పోరాటం చేయాలన్నారు. గురుకులాల్లో వసతులు దారుణంగా ఉన్నాయన్నారు. అనేక పాఠశాలల్లో టీచర్లు లేరు, వసతులు లేవు, బడ్జెట్‌ అరకొరగానే ఉందన్నారు. గిరిజన గురుకులాల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల్లో గిరిజనులకు ప్రాధాన్యం లేకుండా చేశారని ఆరోపించారు. పాఠశాల విలీనంలో గిరిజన వికాస కేంద్రాలను కూడా విలీనం చేస్తున్నారని, దీంతో గిరిజన పిల్లలకు విద్య దూరమైందన్నారు. సబ్‌ప్లాన్‌ నిధులు అన్ని శాఖలకూ ఇస్తున్నారని, అయితే ఆయా శాఖలు గిరిజన ప్రాంతాల్లో మాత్రం ఈ నిధులను ఖర్చు చేయడం లేదన్నారు. అట్రాసిటీ చట్టం దుర్వినియోగమైందని, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి నిందితులను వదిలేస్తున్నారని వాపోయారు. ఎస్టీ కమిషన్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసి ఎస్టీ బాధితుల సమస్యలకు పరిష్కారం సత్వరమే అందించాలని సూచించారు. 


గిరిజన ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలివే..

రాష్ట్రంలో 18 ఎస్టీ పథకాలను రద్దు చేశారని, గిరిజన స్కూళ్లలో రెగ్యులర్‌ టీచర్లు లేక విద్యార్థుల చదువులు పూర్తిగా కుంటుపడ్డాయని రాష్ట్ర యానాదుల సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య కమిషన్‌ దృష్టికి తెచ్చారు. యానాదుల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారని, అమలుకు నోచుకోలేదన్నారు. 


బీజేపీ గిరిజన మోర్చా నేత అనుమోలు వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క గిరిజనుడికైనా ఎమ్మెల్సీ అవకాశమిచ్చారా? అంటూ ప్రశ్నించారు. 75 మండలాల్లో ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు, ఒక  గిరిజన ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మిగిలిన ఏ గిరిజన ప్రాంతానికీ ఎస్టీ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం లేదని  తెలిపారు. రాష్ట్రంలో 42 మంది ప్రభుత్వ సలహాదారులంటే ఒక్కరినైనా ఎస్టీని నియమించారా? అంటూ నిలదీశారు. దేవస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన ప్రభుత్వం అన్నవరం, శ్రీశైలం, టీటీడీల్లో గిరిజనులకు స్థానం కల్పించిందా? అన్నారు. 


నకిలీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు  

ప్రజాప్రాతినిధ్య చట్టం అమల్లో  గిరిజనులకు పలు రాష్ట్రాల్లో అన్యాయం జరుగుతోందని, అది జాతీయ సమస్య అని ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు  తెలిపారు. గిరిజన నేతల సమస్యలను సావధానంగా విన్న తర్వాత ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వెంటనే కమిషన్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేస్తుందని, బాధితుల సమస్యలకు సత్వరమే పరిష్కార మార్గం చూపుతుందని హామీ ఇచ్చారు. గిరిజన గురుకులాల్లో పరిస్థితులు బాగా లేవని, అధికారులతో సమీక్షించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర నక్కల అసోషియేషన్‌ సంఘం అధ్యక్షులు సుమిత్ర, టీడీపీ ఎస్టీసెల్‌ అధికార ప్రతినిధి ఎ.కళావతి, కత్తి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 


రాష్ట్రంలో ఏడుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని అఖిల భారత ఎరుకుల హక్కుల పోరాటసమితి ఏపీ అధ్యక్షులు ఎన్‌.మోహన్‌కుమార్‌ ధర్మా అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పిల్లలు అనారోగ్యంతో చనిపోతున్నారని, ఎస్టీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. హాస్టళ్ల, గురుకులాలకు ఏ నెలకా నెల  ప్రొవిజన్‌ బిల్లులు అందించాలని కోరారు. 


రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంఘం నాయకుడు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులు చదువుతున్న స్కూళ్లు మూసేస్తున్నారని, గిరిజన పిల్లలు దూరంగా ఉండే స్కూళ్లకు వెళ్లకపోవడంతో వారి చదువులు కుంటుపడుతున్నాయని తెలిపారు. గిరిజన విద్యార్థులకు స్టడీసర్కిల్‌ ఏర్పాటు చేయాలని, ఉపాధి అవకాశాలకు మార్గదర్శకాలిచ్చే సంస్థలను ఏర్పాటు చేయాలని, బడ్జెట్‌ కూడా ఎక్కువ కేటాయించాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో గిరిజన మహిళల కోసం వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏజెన్సీ ఏరియాలో తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు లేవన్నారు. 2014లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేస్తే నిర్మాణానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించలేదన్నారు. ఎక్కువ మంది గిరిజనులు నివసించే 550 గ్రామాలు నాన్‌ షెడ్యూల్‌ ఏరియా కింద ఉన్నాయని, వాటిని షెడ్యూల్‌ ఏరియా కింద పరిగణించాలని ఎన్నిసార్లు ప్రతిపాదనలు చేసినా ఫలితం లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేదని కమిషన్‌ దృష్టికి తెచ్చారు. 


అనంతపురం జిల్లాలో గిరిజన గురుకులాల పరిస్థితి దారుణంగా ఉందని జాతీయ గిరిజన సమాఖ్య ఉపాధ్యక్షులు మల్లికార్జున్‌ నాయక్‌ అన్నారు. నైపుణ్య టీచర్లు నియమించి నాణ్యమైన విద్యను అందించాలన్నారు. 


అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పీవీ రమణ మాట్లాడుతూ గిరిజన ఉద్యోగులకు వేధింపులు ఎక్కువయ్యాయని, రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. కేంద్రం వైఖరి గిరిజనులను పొమ్మనలేక పొగబెట్టినట్లుందన్నారు.

Updated Date - 2022-07-17T08:34:00+05:30 IST