అడవి పంది దాడి

ABN , First Publish Date - 2020-06-07T07:40:30+05:30 IST

నల్లమల నుంచి దారితప్పి శ్రీశైలం క్షేత్ర రహదారిపైకి వచ్చిన ఓ అడవిపంది భక్తులను భయబ్రాంతులకు గురిచేసింది. ఒక భక్తుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.

అడవి పంది దాడి

మల్లన్న భక్తుడికి గాయాలు


కర్నూలు (కల్చరల్‌), జూన్‌ 6: నల్లమల నుంచి దారితప్పి శ్రీశైలం క్షేత్ర రహదారిపైకి వచ్చిన ఓ అడవిపంది భక్తులను భయబ్రాంతులకు గురిచేసింది. ఒక భక్తుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. రోడ్డుపైనే తిరుగుతూ అరగంట పాటు హల్‌చల్‌ చేసిన ఈ పంది భక్తుల రాళ్లదాడితో మృతిచెందింది. స్థానికులు తెలిపిన మేరకు, శ్రీశైలంలోని రుద్రాక్ష మఠం వద్ద శనివారం ఓ అడవి పంది కనిపించింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ట్రాక్టరు దాన్ని ఢీకొంది. దెబ్బలకు తాళలేక ఆవేశంగా రోడ్డుపైకి పరుగులు తీసింది. అప్పుడే ఆ దారిపై వస్తున్న నల్గొండ జిల్లా చిట్యాలకి చెందిన నరసింహ అనే భక్తునిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. సమీపంలోని భక్తులు గట్టిగా కేకలు వేయడంతో వదిలేసి రోడ్డుపై అటూ ఇటూ తిరగడం మొదలు పెట్టింది.


దాన్ని అదిలించేందుకు భక్తులు రాళ్లు విసరడం, ట్రాక్టర్‌ ఢీకొన్న కారణంగా తగిలిన గాయాలతో కొద్ది సేపటికి ప్రాణం విడిచింది. గాయపడిన భక్తుడు నరసింహను సమీపంలోని మండల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల సుమారు 70 రోజులకు పైగా క్షేత్రంలో భక్తుల సంచారం లేదు. వాహనాల రాకపోకలు కూడా తగ్గడంతో వన్నెప్రాణులు స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే అడవిపంది కూడా రోడ్డుపైకి వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. 

Updated Date - 2020-06-07T07:40:30+05:30 IST