NRI: ఎన్నారై డాక్టర్‌కు ఊరట.. మీ ఆవిడ సున్నిత మనస్కురాలు అంటూ కోర్టు తీర్పు.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-20T03:35:06+05:30 IST

తనను హింసించారంటూ భర్త, అత్తలపై వివాహిత పెట్టిన కేసు నుంచి ఆమె భర్తకు తాజాగా ఊరట లభించింది

NRI: ఎన్నారై డాక్టర్‌కు ఊరట.. మీ ఆవిడ సున్నిత మనస్కురాలు అంటూ కోర్టు తీర్పు.. అసలేం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: తనను హింసించారంటూ భర్త, అత్తలపై వివాహిత పెట్టిన కేసు నుంచి ఆమె భర్తకు తాజాగా ఊరట లభించింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ తాజాగా కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) తీర్పు వెలువరించింది. వివాహిత సున్నిత మనస్కురాలిగా కనిపిస్తోందని..చిన్న విషయాలనూ పెద్ద సమస్యలుగా భావించిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె భర్త అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే.. అమెరికాలో జాబ్ వచ్చేలా బాగా చదువుకోవాలంటూ భర్త, అత్త తనను విపరీతంగా ఒత్తిడి చేసినట్టు ఆమె అప్పట్లో  పిర్యాదు చేసింది. మరోవైపు.. పిల్లాడిని కనాలంటూ అత్తింటి వారు తనను వేధించారని కూడా పేర్కొంది. బాగా తిండి తినాలని, తమిళం నేర్చుకోవాలని వేధించినట్టు ఆరోపించింది. దీంతో.. సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదైంది. అయితే.. 2013లో బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఆమె భర్తకు ఏడాది పాటు జైలు, లక్ష రూపాయల జరిమానా విధించిన కోర్టు..  అతడి తల్లికి ఆరునెలల జైలు శిక్ష, పది వేల రూపాయాల జరిమానా ఖరారు చేసింది. అయితే.. వారు పైకోర్టులో అప్పీలు చేసుకోగా.. కోర్టులో చుక్కెదురైంది. కింది కోర్టు సమర్థిస్తూ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 


ఈ క్రమంలో వారు హైకోర్టును ఆశ్రయించారు. అన్ని అంశాలు పరిశీలించిన న్యాయస్థానం చివరకు అమెరికా డాక్టర్‌కు అతడి తల్లికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.  స్వప్రయోజనాల కోసం వివాహిత చెప్పిన సాక్ష్యం ఆధారంగానే కింది కోర్టులు తీర్పు వెలువరించినట్టు హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. వివాహితకు అనుకూలంగా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనాలు అస్పష్టంగా ఉన్న విషయాన్ని కింది కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. 

Updated Date - 2022-08-20T03:35:06+05:30 IST