ఆర్మీ ఆఫీసర్‌గా అమర జవాను భార్య.. పిల్లలకు గిఫ్ట్ అన్న అధికారిణి

ABN , First Publish Date - 2021-11-21T22:51:40+05:30 IST

ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ఆర్మీ జవాను భార్య ఆర్మీ ఆధికారిగా ఎదిగి తన పిల్లలు సహా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు

ఆర్మీ ఆఫీసర్‌గా అమర జవాను భార్య.. పిల్లలకు గిఫ్ట్ అన్న అధికారిణి

డెహ్రాడూన్: ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ఆర్మీ జవాను భార్య ఆర్మీ ఆధికారిగా ఎదిగి తన పిల్లలు సహా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. సాధించాలన్న తపన ఉంటే కష్టాలు అందుకు అడ్డంకి కాబోవని నిరూపించిన ఆమె పేరు జ్యోతి దీపక్ నైన్వాల్.


ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ఆమె భర్త నాయక్ దీపక్ కుమార్ 2018లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో అమరుడయ్యారు. భర్త మరణంతో కాళ్లకింద భూమి ఒక్కసారిగా కుంగిపోయినట్టు అయింది. భర్త మరణం ఆమెను కుంగదీసింది. అయితే, అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలు కళ్లముందు కదలాడుతుంటే తమాయించుకున్నారు. 


పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు తల్లి అన్నీ అయి ఓదార్చింది. నీ జీవితం ఇకపై పిల్లలకు ప్రేరణగా నిలవాలని కుమార్తెలో ఆమె ధైర్యాన్ని నింపారు. ఈ పరిస్థితిని కూడా అవకాశంగా మార్చుకోవాలని చెప్పారు. పిల్లలకు ఎవరినో ఉదాహరణగా చూపించే అవకాశం ఇవ్వకుండా వారికి నువ్వే ప్రేరణ కావాలంటూ ఆమెలో అనుక్షణం ధైర్యాన్ని నూరిపోశారు. కష్టసుఖాల్లో జీవితాన్ని ఈదుకు రావడమెలానో నిన్ను చూసి వారు నేర్చుకునేలా చేయాలని హితబోధ చేశారు.


తల్లి నింపిన ధైర్యానికి తోడు, సోదరుడు, మహార్ రెజిమెంట్ మద్దతు ఆమెకు లభించింది. ఫలితంగా ఆర్మీలో చేరాలని జ్యోతి నిర్ణయించుకున్నారు. బ్రిగేడియర్ సీమ, కల్నల్ ఎంపీ సింగ్ తనకు అండగా నిలిచారని, తనకు మెంటార్లుగా వ్యవహరించారని జ్యోతి గుర్తు చేసుకున్నారు. సర్వీస్ సెలక్షన్ బోర్డుకు ఎంపికయ్యేందుకు వారు తన కోసం చాలా శ్రమించారని పేర్కొన్నారు. ఆర్మీలోని సీనియర్ల మార్గనిర్దేశకత్వంలో జ్యోతి చివరికి అనుకున్నది సాధించారు.


 శిక్షణ పూర్తి చేసుకున్న జ్యోతి నిన్న (నవంబరు 20న) శిక్షణ పూర్తిచేసుకుని ఇండియన్ ఆర్మీలో చేరారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. ఆర్మీ అఫీసర్‌గా చేరడం తన పిల్లలకు గిఫ్ట్ అని అన్నారు. 11 ఏప్రిల్ 2018లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరులో నాయక్ దీపక్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.



Updated Date - 2021-11-21T22:51:40+05:30 IST