పలమనేరు(చిత్తూరు): భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. ఆయన కథనం మేరకు... పలమనేరు పట్టణం కంసాల వీధికి చెందిన కేశవులు, రేఖ భార్యాభర్తలు. కేశవులు(34) నిత్యం మద్యం తాగుతూ భార్యపై అనుమానం పెంచుకుని వేధించేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది మే 28న సాయంత్రం కేశవులు మద్యం తాగొచ్చి భార్యతో గొడవకు దిగాడు. భరించలేకపోయిన రేఖ ఇంట్లో ఉన్న పెద్ద కర్ర తీసుకుని అతడి వృషణాలపై కొట్టడంతో కుప్పకూలాడు. కొద్దిసేపటికే కేశవులు మృతి చెందాడు. అయితే తన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రేఖ నాటకమాడింది. కేశవులు తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో కేశవులు హత్య చేయబడినట్లు తేలిందని సీఐ భాస్కర్ తెలిపారు. దీంతో రేఖను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.