ప్రియుడితో భర్తను చంపించి.. కాల్చి.. బూడిదను చెరువులో కలిపి..

ABN , First Publish Date - 2020-09-24T08:53:49+05:30 IST

వారం రోజుల క్రితం అదృశ్యమైన హోంగార్డు బాదావత్‌ దర్యావత్‌సింగ్‌ (42)కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య జ్యోతి, ఆమె

ప్రియుడితో భర్తను చంపించి.. కాల్చి.. బూడిదను చెరువులో కలిపి..

ప్రియుడితో కలిసి భర్తను చంపింది

వారం రోజుల క్రితం అదృశ్యమైన వ్యకి కేసును ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడించిన సీఐ


నెక్కొండ, సెప్టెంబరు 23: వారం రోజుల క్రితం అదృశ్యమైన హోంగార్డు బాదావత్‌ దర్యావత్‌సింగ్‌ (42)కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య జ్యోతి, ఆమె ప్రియుడు జిల్లా సాంబరాజు కలిసి చంపినట్లు వారి విచారణలో తేల్చారు. పూర్తి వివరాలను నెక్కొండ సీఐ తిరుమల్‌ బుధవారం మీడియా ముందు వెల్లడించారు. నెక్కొండ మండలం గేటుపల్లి గ్రామానికి చెందిన దర్యావత్‌సింగ్‌ వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతడికి ఐదు సంవత్సరాల క్రితం జ్యోతితో వివాహం కాగా నెక్కొండలో అద్దెకుంటున్నారు. జ్యోతి టైలరింగ్‌ షాపు నడుపుతోంది. ఈ క్రమంలో దర్యావత్‌సింగ్‌ స్నేహితుడైన సాంబరాజుతో జ్యోతికి పరిచయం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన సాంబరాజు గ్యాస్‌ కంపెనిలో పనిచేస్తూ తరచుగా జ్యోతి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయాన్ని పసిగట్టిన దర్యావత్‌సింగ్‌ జ్యోతిని పలుమార్లు మందలించడంతో ఆమె సాంబరాజుకు తెలిపింది. దీంతో ఎలాగైనా దర్యావత్‌సింగ్‌ను అంతమొందించాలని పధకం పన్ని సమయం కోసం వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో ఈ నెల 1 తేది నుంచి దర్యావత్‌సింగ్‌కు నెల రోజులు సెలవు ఇవ్వడంతో  అప్పటినుంచి ఇంటివద్దే ఉంటున్నాడు.


ఇదే అదనుగా భావించిన నిందితులు రెండు కొత్త సెల్‌ఫోన్‌ సిమ్‌లను  తీసుకుని, నెంబర్లు ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఈ నెల 14వ తేదీన రాత్రి దర్యావత్‌సింగ్‌ మద్యం సేవించి పడుకున్న విషయాన్ని జ్యోతి సాంబరాజుకు ఫోన్‌చేసి తెలిపింది. వెంటనే సాంబరాజు అతడు పనిచేస్తున్న గ్యాస్‌ కంపెనీ ఆటోలో పెట్రోల్‌ బాటిల్స్‌, గోనే సంచులు, తాడు తీసుకొని వచ్చాడు. నిద్రిస్తున్న దర్యావత్‌సింగ్‌ గొంతుకు తాడు బిగించి ఇద్దరు చెరోవైపునకు లాగడంతో అతను మృతి చెందాడు. మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి ఆటోలో వేసుకున్న సాంబరాజు అప్పల్‌రావుపేటలో తన సొంత పత్తిచేనులోకి తీసుకుపోయిడు. సాంబరాజు తండ్రి యాకయ్య, తమ్ముడు సురేష్‌ల సహాయంతో మృతదేహంపై పెట్రోల్‌ పోసి పక్కన కట్టెలు పెట్టి నిప్పంటించాడు. ఆరోజు రాత్రి శవం పూర్తిగా కాలకపోవడంతో తిరిగి 15వ తేదీన రాత్రి మరోసారి కాల్చాడు. 16వ తేదిన బూడిదను, బొక్కలను గోనె సంచిలో నింపుకొని బైక్‌పై మహబుబాబాద్‌ జిల్లా కేసముద్రం దర్గ చెరువులో కలిపాడు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడినప్పటికీ నూతన సిమ్‌ నుంచి మృతుడి వదినకు జ్యోతి ఫోన్‌ చేయడంతో ఆ ఫోన్‌ నెంబర్‌ కాల్‌డాటా ఆధారంగా పోలీసులు కూపీలాగారు. ఈ కేసులో జ్యోతితో పాటు సాంబరాజు అరెస్టు చేసి కోర్టుకు పంపారు. హత్యకు సహకరించిన సాంబరాజు తండ్రి, తమ్ముడు పరారీలో ఉన్నారని తెలిపారు.


పోలీసులకు ఫిర్యాదు చేయని భార్య..

బాదావత్‌ జ్యోతి తన భర్త కనిపించడం లేదంటూ ఈనెల 16న వరంగల్‌లోని ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించగా నెల రోజులు సెలవులో ఉన్నాడని తెలిపారు. దర్యావత్‌సింగ్‌ కనిపించని విషయాన్ని నెక్కొండ పోలీసుకు ఫిర్యాదు చేయాలని వారు సలహా ఇచ్చారు. కాని జ్యోతి మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా, దర్యావత్‌సింగ్‌ అన్న బాదావత్‌ వీరన్నకు అనుమానం వచ్చి జ్యోతిని విచారించగా సరైన సమాధానం లభించకపోవడంతో ఆయన ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 48 గంటల్లో నిందితులను అరెస్టుచేశారు. హత్య మిస్టరీని ఛేదించిన నెక్కొండ, చెన్నారావుపేట ఎస్సైలు నాగరాజు, రవి, పోలీసు సిబ్బందిని సీఐ అభినందించారు. 

Updated Date - 2020-09-24T08:53:49+05:30 IST