బేల్దారి మేస్ర్తి వేధింపులు.. దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-01-25T04:43:11+05:30 IST

బేల్దారి మేస్ర్తి వేధింపులకు తాళలేక దంపతుల ఆత్మహత్యాయత్నం పొదిలిలో కలకలం రేపింది.

బేల్దారి మేస్ర్తి వేధింపులు.. దంపతుల ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతున్న చిన్నా, చికిత్స పొందుతున్న కుమారి

పొదిలి(రూరల్‌) జనవరి 24 : బేల్దారి మేస్ర్తి వేధింపులకు తాళలేక దంపతుల ఆత్మహత్యాయత్నం పొదిలిలో కలకలం రేపింది. బంధువుల కథనం ప్రకారం... కొత్తపాలేనికి చెందిన నారాయణరెడ్డి అనే బేల్దారి మేస్త్రి వేధింపులతో మాగులూరి చిన్న, భార్య కుమారి ఇద్దరు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం పొదిలిలోని ఏబీఎం కాంపౌండ్‌లో జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతులు మాగులూరి చిన్న, కుమారిలు మేస్ర్తి నారాయణరెడ్డి దగ్గర బేల్దారి పనులకు వస్తామని రూ.10వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. హైదరాబాద్‌ వెళ్లి రెండు నెలలు పని చేశారు. అక్కడి వాతావరణం పడక తరచూ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగి పొదిలికి వచ్చారు. పొదిలికి వచ్చిన అనంతరం ఫైనాన్స్‌లో ఆటో తీసుకొని జీవనం సాగిస్తున్నారు. నారాయణరెడ్డి ఇచ్చిన అడ్వాన్స్‌ డబ్బులకు కూలి డబ్బుల కింద జమ కాగా, అక్కడ ఇంటి అద్దె ఖర్చులకు మరో రూ.10వేలు తీసుకున్నారు. కానీ మేస్ర్తి నారాయణ తనకు రూ.30వేలు ఇవ్వాల్సి ఉందని వేధిస్తున్నాడు. పనికి రానివారు బాకీ చెల్లించాలని అంటున్నాడు.  ఆదివారం మేస్ర్తి వచ్చి రూ.30 వేలు ఇస్తారా లేక పోతే ఆటోను తీసుకెళ్లాలా అని గొడవకు దిగాడు. ఇవ్వాల్సిన రూ.10 వేలు నెల రోజుల్లో ఇస్తామని చెప్పినా వినకుండా ఆటోను తీసుకొని వెళ్లిపోయాడు. అంతకు ముందు వారం క్రితం మేస్ర్తి గ్రామమైన కొత్తపల్లిలో పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినప్పటికీ మేస్ర్తి ఒప్పుకోలేదు. డబ్బులు కట్టాలని వేధిస్తుండడంతో మేస్ర్తిపై బాధితులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మేస్ర్తిని పిలిపించి మాట్లాడతామని చెప్పారు. అయినా మేస్ర్తి వేధిస్తుండడంతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. బంధువులు పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒంగోలు రిమ్స్‌ తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. 

Updated Date - 2022-01-25T04:43:11+05:30 IST