దంపతుల మధ్య రెండో పెళ్లి విషయమై గొడవ.. భర్త చేతి వేళ్లు విరగొట్టిన భార్య.. కోర్టు ఏం చెప్పిందంటే..

ABN , First Publish Date - 2022-01-18T16:46:12+05:30 IST

దంపతుల మధ్య రెండో పెళ్లి విషయమై జరిగిన గొడవ కాస్తా కోర్టుకెక్కింది.

దంపతుల మధ్య రెండో పెళ్లి విషయమై గొడవ.. భర్త చేతి వేళ్లు విరగొట్టిన భార్య.. కోర్టు ఏం చెప్పిందంటే..

దుబాయ్: దంపతుల మధ్య రెండో పెళ్లి విషయమై జరిగిన గొడవ కాస్తా కోర్టుకెక్కింది. దాంతో దుబాయ్ న్యాయస్థానం దంపతులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్ష కాలం పూర్తైన వెంటనే దేశం నుంచి వెళ్లిపోవాలని తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్‌లో ఉండే ఆసియాకు చెందిన యువ దంపతుల మధ్య రెండో పెళ్లి విషయమై ఘర్షణ జరిగింది. భర్త తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు భార్యతో చెప్పాడు. అంతే.. ఆ మాట విన్న భార్య కోపంతో ఊగిపోయింది. భర్తపై దాడికి దిగింది. చేతికి అందిన వాటితో భర్తపై దాడి చేసింది. ఆమె చర్యతో షాకైన భర్త తేరుకుని భార్యను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె ఆగలేదు సరికదా.. భర్తను ఇష్టానుసారంగా కొట్టింది. దీంతో భర్త కూడా ఆమెపై చేయి చేసుకున్నాడు. 


ఈ క్రమంలో భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య అతడ్ని బలంగా వెనక్కి నెట్టేసింది. దాంతో అతను కిందపడే సమయంలో నెలకు గట్టిగా తాకాడు. ఆ సమయంలో కుడి చేతిపై బలం ఎక్కువ కావడంతో వేళ్ళు విరిగిపోయాయి. ఇక భార్యపై భర్త చేసిన దాడిలో ఆమె చెవికి దెబ్బ తగిలింది. దాంతో ఆమెకు వినికిడి సమస్య ఏర్పడింది. ఈ నేపథ్యంలో దంపతులిద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుని కోర్టుమెట్లు ఎక్కారు. తాజాగా దుబాయ్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా దంపతులిద్దరు తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఇద్దరిది అంతే తప్పు ఉన్నట్లు నిర్ధారించింది. ఇద్దరికి చెరో ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే శిక్ష కాలం పూర్తైన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని తీర్పునిచ్చింది.      

Updated Date - 2022-01-18T16:46:12+05:30 IST