యాక్సిడెంట్‌ కేసే కదా అని పోలీసులు వదిలేశారు.. కానీ అన్నకు అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తే విస్తుపోయే నిజాలు..!

ABN , First Publish Date - 2021-10-12T11:09:24+05:30 IST

హరియాణాలోని పల్వల్ నగరంలో నేషనల్ హైవే-19 సమీపంలో బైక్‌పై వెళుతున్న ఒక ఉపాధ్యాయుడిని ఒక ఎస్‌యువి వాహనం ఢీ కొట్టింది. అతను స్పాట్‌లోనే చనిపోయాడు. ముందు పోలీసులు ఇది ఒక యాక్సిడెంట్ కేసుగా అనుకున్నారు...

యాక్సిడెంట్‌ కేసే కదా అని పోలీసులు వదిలేశారు.. కానీ అన్నకు అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తే విస్తుపోయే నిజాలు..!

హరియాణాలోని పల్వల్ నగరంలో నేషనల్ హైవే-19 సమీపంలో బైక్‌పై వెళుతున్న ఒక ఉపాధ్యాయుడిని ఒక ఎస్‌యువి వాహనం ఢీ కొట్టింది. అతను స్పాట్‌లోనే చనిపోయాడు. ముందు పోలీసులు ఇది ఒక యాక్సిడెంట్ కేసుగా అనుకున్నారు. కానీ ఆ తరువాత మృతుడి సోదరుడికి అనుమానం వచ్చి యాక్సిడెంట్ ప్రాంతంలో ఉన్న సీసీ టీవి వీడియోలను చూడగా అది యాక్సిడెంట్ కాదని తేలింది. ఆ వీడియోలను పోలీసులు చూసి విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు బయట పడ్డాయి.


పల్వల్ నగరంలోని మిత్రోల్ గ్రామానికి చెందిన గజేంద్ర అనే ఉపాధ్యాయుడు సెప్టెంబరు 28న తెల్లవారుజామున డ్యూటీ నిమిత్తం తన బైక్‌పై నేషనల్ హైవే-19 సమీపంలో వెళుతుండగా టోల్ ప్లాజా వద్ద ఒక ఎస్‌యువి ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మ‌ృతి చెందాడు. పోలీసులు ఈ కేసుని ఒక యాక్సిడెంట్ కేసుగా భావించారు. కానీ గజేంద్ర సోదరుడు ఆ టోల్ ప్లాజా సమీపంలో ఉన్న అన్ని సీసీటీవి వీడియోలను సేకరించి పోలీసులకు ఇచ్చాడు. ఆ వీడియోలలో గజేంద్రను ముందుగానే అక్కడ నిలబడి ఉన్న ఎస్‌యూవి వాహనం కావాలనే వచ్చి ఢీ కొట్టినట్లు స్పష్టమైంది.


ఈ కేసులో గజేంద్ర భార్య, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో అనుమానితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం గజేంద్ర, అతని భార్య పుష్ప మధ్య గొడవలు జరిగేవి, పుష్ప తన పుట్టింటి వెళ్లడానికని తన స్వగ్రామం వెళ్లినప్పుడు రోహతాశ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చేవాడు. అదే గ్రామంలో రోహతాశ్ అత్తారిల్లు ఉంది. అతను అక్కడికి వచ్చినప్పుడల్లా పుష్ప అతనితో కలిసేది. అలా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంత సమయం తరువాత ఈ విషయం పుష్ప భర్త గజేంద్రకు తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.


ఒకరోజు గజేంద్ర ఈ విషయంలోనే పుష్పను గొడవ పడుతూ కొట్టాడు. ఇక ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని భావించిన పుష్ప.. రోహతాశ్‌, అతడి స్నేహితులతో కలిసి గజేంద్రను చంపాలనుకుంది. రోహతాశ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక ఎస్‌యూవి తీసుకొని గజేంద్ర డ్యూటీకు వెళ్లే దారిలో కొమ్ముకాచి అతడిని ఎస్‌యువి వాహనంతో ఢీ కొట్టాడు. గజేంద్ర అక్కడికక్కడే చనిపోవడంతో పుష్ప, రోహతాశ్ ఇక తమ ప్రేమకు ఉన్న అడ్డుతొలిగిపోయిందనుకున్నారు. కానీ గజేంద్ర సోదరుడికి అనుమానం రావడం కథ అడ్డం తిరిగింది. అతను గజేంద్ర చనిపోయిన ప్రాంతంలో ఉన్న సీసిటీవి వీడియోలను సేకరించి వాటిలో గజేంద్రని ఎవరో కావాలని హత్య చేసినట్లు తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు ఆ వీడియోలను చూపించడంతో.. పోలీసులు విచారణలో భాగంగా పుష్పను అనుమానించారు.


దర్యాప్తులో పుష్ప, రోహతాశ్‌ల వివాహేతర సంబంధం బయటపడింది. వారిద్దరినీ పోలీసులు ప్రశ్నించగా.. వారు నేరం చేసినట్లు అంగీకరించారు. ప్రస్తుతం పోలీసులు పుష్ప, అమె ప్రేమికుడు రోహతాశ్‌లపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. రోహతాశ్ స్నేహితులలో ఒకడు పరారీ ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-12T11:09:24+05:30 IST