విస్తారంగా వర్షాలు.. విస్తృతంగా పంటలు!

ABN , First Publish Date - 2020-08-11T09:03:03+05:30 IST

నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గడిచిన రెండు నెలల్లో.. ఏకంగా 48 రోజులు వర్షాలు పడ్డాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం

విస్తారంగా వర్షాలు.. విస్తృతంగా పంటలు!

రెండు నెలల వ్యవధిలో 48 రోజులూ వర్షాలే

14 జిల్లాల్లో అధికం.. 18 జిల్లాల్లో సాధారణం

ఉత్సాహంగా ‘సాగు’తున్న అన్నదాతలు

హైదరాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గడిచిన రెండు నెలల్లో.. ఏకంగా 48 రోజులు వర్షాలు పడ్డాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 439.8 మి.మీ కాగా.. 512.5 మి.మీ నమోదైంది. సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సీజన్‌లో ఎన్నిరోజులు వర్షం పడిందో వాతావరణ శాఖ లెక్కగడుతుంది. ఈ లెక్కల ప్రకారం ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వర్షం పడ్డ రోజులు నమోదయ్యాయి. జూన్‌లో పదో తేదీ తర్వాత నుంచి 16 రోజులు, జూలైలో 24 రోజులు, ఆగస్టులో 8 రోజులు వర్షాలు పడ్డాయి. తెలంగాణ సగటు వర్షపాతం ఏడాదికి 905.4 మి.మీ కాగా, ఇప్పటికే 512.5 మి.మీ నమోదైంది. 


ములుగులో అత్యధికం

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా సాధారణ వర్షపాతం ఏడాదికి 1292.7 మి.మీ కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 749.7 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాలతో పోల్చితే నల్లగొండ జిల్లాలో ఈ సీజన్‌లో వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ.. ఇక్కడ సాధారణ వర్షపాతం కంటే 9 శాతం ఎక్కువగా నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 262.7 మి.మీ. కురవాల్సి ఉండగా.. 285.7 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా, రాష్ట్రం మొత్తంలోకి నిర్మల్‌ జిల్లాలో మాత్రమే ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. 14 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.


జలాశయాల్లో జలకళ

నిర్మల్‌ జిల్లాలో వర్షపాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వానలతో ప్రాజెక్టుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే స్వర్ణ, గడ్డెన్న వాగుల్లోకి నీరు చేరింది. ఆదిలాబాద్‌లో కురిసే వానలతో కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.  సంగారెడ్డి జిల్లాలోని సింగూరు, నల్లవాగు ప్రాజెక్టుల్లోకి ఇప్పుడిప్పుడే నీళ్లు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని, ఎదు మేలికల, జల్లేరు, ఎద్దరేవు వాగులు పొంగిపొర్లుతున్నాయి. మహారాష్ట్రలో జలాశయాలన్నీ నిండిపోవడంతో శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నిండిపోయింది. మిడ్‌మానేరు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. పాకాల సరస్సు నీటితో కళకళలాడుతోంది. ములుగు జిల్లాలోని లక్నవరం, రామప్ప జలాశయాల్లోకి నీళ్లు భారీగా వచ్చాయి. 


1.19 కోట్ల పైచిలుకు ఎకరాల్లో పంటలు

రాష్ట్రంలో పంటలసాగు అద్భుతంగా సాగుతోంది. సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 15 శాతం అదనంగా పంటలు వేశారు. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1 కోటి 3 లక్షల 47 వేల 715 ఎకరాలు కాగా... ఇప్పటివరకు 1 కోటి 19 లక్షల 26 వేల 973 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. నిరుడు ఇదే సమయానికి 80 లక్షల 2 వేల 348 ఎకరాల్లో మాత్రమే పంటలు ఉన్నాయి.



Updated Date - 2020-08-11T09:03:03+05:30 IST