ఎందుకు తీసుకున్నట్టు? ఏం చేస్తున్నట్టు?

ABN , First Publish Date - 2021-08-04T05:22:30+05:30 IST

జిందాల్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం.. భూములు ఇస్తే పరిహారంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తాం.. అంటూ పన్నెండేళ్ల కిందట రైతుల్లో ఆశలు కల్పించి హడావిడిగా భూములు తీసుకున్నారు. శృంగవరపుకోట మండలంలోని ఐదు గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించారు. ఇన్నాళ్ల తర్వాత మాట మార్చారు.

ఎందుకు తీసుకున్నట్టు? ఏం చేస్తున్నట్టు?
ఎస్‌.కోట మండలంలో జిందాల్‌కు కేటాయించిన భూములు

దశాబ్దం దాటినా ఏర్పాటు కాని జిందాల్‌ పరిశ్రమ

అప్పట్లో పేద గిరిజనుల నుంచి భూముల సేకరణ

ఇప్పుడు మాట మార్చిన యాజమాన్యం

స్కిల్‌ డవలప్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటన

భూములు కాపాడుకునే ఎత్తుగడగా అనుమానాలు

జిందాల్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం.. భూములు ఇస్తే పరిహారంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తాం.. అంటూ  పన్నెండేళ్ల కిందట రైతుల్లో ఆశలు కల్పించి హడావిడిగా భూములు తీసుకున్నారు. శృంగవరపుకోట మండలంలోని ఐదు గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించారు. ఇన్నాళ్ల తర్వాత మాట మార్చారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తాజాగా ప్రకటించారు. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో వాటిని కాపాడుకునే ఎత్తుగడలో భాగంగానే మాట మార్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల నుంచి ఉద్యమం రాకుండా వ్యూహం పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


శృంగవరపుకోట, ఆగస్టు 3:

జిందాల్‌ యాజమాన్యం స్వరం మార్చింది. పరిశ్రమ స్థాపనకు తీసుకున్న దాదాపు వెయ్యి ఎకరాల భూమిలో దశబ్దం దాటిన తరువాత 30 ఎకరాల్లో స్కిల్‌ డవలప్‌మెంట్‌ శిక్షణ కోసం భవనం నిర్మిస్తామని ప్రకటించింది. కిల్తంపాలెం గ్రామ పరిధిలో ఉన్న జిందాల్‌ కార్యాలయంలో పరిశ్రమ ప్రతినిధులు మంగళవారం ఈ మేరకు ప్రకటించారు. ఈ పరిణామంతో  కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన భూములను కూడా వివిధ పరిశ్రమలకు ఏపీఐఐసీ తరహాలో అమ్మకానికి పెడతారని సమాచారం. భూములు తీసుకున్న ఇన్నాళ్లకు ఏదో ఒక పరిశ్రమ నిర్మించాలన్న విషయం గుర్తుకురా వడాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. భూములిచ్చిన రైతులు తిరిగి వాటిని అడగకుండా ఉండేందుకు జిందాల్‌ యాజమాన్యం ఈ కదలిక తెచ్చినట్లు చెప్పుకుంటున్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం పన్నేండేళ్ల కిందట శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, చీడిపాలెం, ముషిడిపల్లి, బొడ్డవర, పేదఖండేపల్లి గ్రామాల పరిధిలోని భూములను జిందాల్‌ పరిశ్రమ యాజమాన్యానికి ఇచ్చేందుకు సేకరించింది. ఈ భూముల్లో గిరిజన, ఇతర పేద కుటుంబాలకు ప్రభుత్వం వ్యవసాయ చేసుకొనేందుకు డి.పట్టాలు ఇచ్చింది. వరి, మామిడి, జీడి, అరటి, కొబ్బరి వంటి తోటల పెంపకం ద్వారా రైతులు ఆదాయం పొందేవారు. ఇలాంటి భూములను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ఇష్టం లేకుండానే బలవంతంగా ఎకరాకు రూ. 2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇచ్చి చేతులు దులుపుకుంది. కొంతమంది రైతులు నిరాకరించడంతో వారికి ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. భూములను మాత్రం స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని మరికొంత మంది భూ రికార్డులను మార్చేసి వేరొకరికి సొమ్ములు అందించారు. ఇప్పటికీ కొందరు రైతులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయం చూట్టు తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా అప్పట్లో కారుచౌకగా పొందిన భూముల ధరలు నింగినంటాయి. ఎకరా రూ.4 కోట్లకు పైబడి పలుకుతోంది. ఈ భూములను ఆనుకుని ఉన్న రోడ్డు హైవేగా రూపాంతరం చెందింది. తాటిపూడి రోడ్డును హైవేగా విస్తరిస్తున్నారు. దీంతో ఈ రోడ్డుకు అనుకుని ఉన్న భూములన్నీ బంగారంగా మారాయి. జిందాల్‌ పరిశ్రమకు తీసుకున్న భూములన్నీ దాదాపు ఈ రోడ్డుకు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. భూములకు ఒక్కసారిగా విలువ పెరగడంతో ఎక్కడ రైతుల నుంచి తిరిగి భూములు ఇవ్వాలన్న డిమాండ్‌ వస్తుందోనన్న అనుమానంతో జిందాల్‌ యాజమాన్యం పరిశ్రమల స్థాపన ప్రస్తావన తెస్తోంది. బాక్సైట్‌ తవ్వకాలను ప్రభుత్వం నిషేధించడంతో పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోతున్నామని, వివిధ పరిశ్రమలకు భూములివ్వడం ద్వారా స్థానికులకు ఉపాధి కల్పిస్తామని తిరిగి ఆశలు కల్పిస్తున్నారు. 



Updated Date - 2021-08-04T05:22:30+05:30 IST