మీ అభ్యంతరం ఏమిటి?: థాకరేను ప్రశ్నించిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-08-03T19:22:59+05:30 IST

''రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటే వ్యాక్సిన్ తీసుకుని ఏమిటి ప్రయోజనం?'' అని..

మీ అభ్యంతరం ఏమిటి?: థాకరేను ప్రశ్నించిన హైకోర్టు

న్యూఢిల్లీ: ''రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటే వ్యాక్సిన్ తీసుకుని ఏమిటి ప్రయోజనం?'' అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ముంబై హైకోర్టు నిలదీసింది. సమగ్ర ప్లాన్‌తో ముందుకు రావాలని థాకరే సర్కార్‌ను ఆదేశించింది. లోక‌ల్ రైళ్లలో ప్రయాణించేందుకు లాయర్లను అనుమతించాలంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి దీపంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణితో కూడిన ధర్మాసనం మంగళవారంనాడు విచారణ చేపట్టింది.


''మొదట్లో ఉన్న పరిస్థితికి, ఇప్పుడున్న పరిస్థితికి వ్యత్యాసం ఉంది. వ్యాక్సినేషన్ ఇందుకు కారణం. 18 ఏళ్లు పైబడిన లాయర్లందరినీ ప్రస్తుతం వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తున్నారు. ఇందువల్ల ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం ఏమిటి? వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఇళ్లలో కూర్చోవాలని ఎవరూ అనుకోరు. ఏదో ఒక సమయంలో లాయర్లు కోర్టుకు రావాల్సిన అవసరం ఉంది'' అని ధర్మాసనం పేర్కొంది.


వ్యాక్సినేషన్ వేయించుకున్న వారికి పూర్తిగా సడలింపులు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి ఏదైనా ప్లానింగ్ ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ''ఇంట్లోనే కూర్చోవాలంటే ఆర్థిక పరంగా, పనిపరంగా ఇబ్బందులుంటాయి. ఒకసారి రోడ్లు చూడండి. దహిసర్ వెళ్లాలంటే మూడు గంటల జర్నీ చేయాల్సి వస్తోంది. రైళ్లలో ప్రయాణాలకు అనుమతిస్తే రోడ్లపై జనం రద్దీ తగ్గుతుంది. రైల్వేలు కూడా సహకరిస్తున్నాయి. అందువల్ల మీ ప్రయత్నాలు మీరూ ప్రారంబించండి. నెట్‌వర్క్‌ను విస్తృతం చేయండి. కేవలం లాయర్లకే కాదు, ఇతర రంగాల వారి ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోండి'' అని ధర్మాసనం పేర్కొంటూ..ఈనెల 5వ తేదీన కూడా విచారణ కొనసాగుతుందని పేర్కొంది.

Updated Date - 2021-08-03T19:22:59+05:30 IST