ఎందుకో.. ఈ పదవులు.. YSRCP ప్రజాప్రతినిధుల్లో ఆవేదన..!

ABN , First Publish Date - 2022-01-31T04:14:14+05:30 IST

‘అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారుస్తాం. అపరిష్కృత సమస్యలు పరిష్కరిస్తాం.’..

ఎందుకో.. ఈ పదవులు.. YSRCP ప్రజాప్రతినిధుల్లో ఆవేదన..!

  • ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం
  • అభివృద్ధి పనులకు అందని నిధులు
  • చేసిన పనులకు బిల్లులు లేవు..
  • కొత్త పనుల ఊసేలేదు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి) : ‘అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారుస్తాం. అపరిష్కృత సమస్యలు పరిష్కరిస్తాం.’..విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల ప్రకటనలివి. వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ ప్రజలకు విచ్చలవిడిగా హామీలిచ్చారు. వారు ఊహించినట్టు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  కానీ ఎటువంటి నిధులు లేకపోవడంతో ఆ పార్టీ నేతల బాధ ఇప్పుడు వర్ణనాతీతం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు అందరిలోనూ ఒకటే నిర్వేదం. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులను కూడా పూర్తి చేయలేక పోతున్నామని మధన పడుతున్నారు. సాధారణంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తారు. కానీ అసలు నిధులే లేకపోతే ఇంకేం ప్రణాళికలు అంటూ కొందరు అధికార పార్టీ పెద్దలే వ్యాఖ్యానిస్తున్నారు.


తమ గ్రామానికి రోడ్లు, మౌలిక వసతులు లేవని.. నిధులు మంజూరు చేయాలని అడుగుతున్న ద్వితీయ శ్రేణి నాయకులకు ఏం చెప్పాలో తెలియక ప్రజాప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నారు. సాగు, తాగునీటి వసతుల కల్పన, విద్యాప్రగతి కోసం పాఠశాలల భవనాలు, మురుగు కాలువల నిర్మాణాలు, నిర్వహణ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రజాప్రతినిధులకు ఎప్పుడూ పూర్తి స్థాయిలో అభివృద్ధి నిధులు కేటాయించలేదు. వచ్చిన అరకొర నిధులు ద్వితీయ శ్రేణి నాయకుల వరకూ వెళ్లే పరిస్థితి లేదు.


- ప్రతిపాదనలతో సరి

ప్రస్తుతం జిల్లాలో విద్య, వైద్య, రహదారుల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలతో ప్రతిపాదనలు చేశారు కానీ.. వాటికి మోక్షం కలగడం లేదు. కొన్నింటికి టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, టిడబ్ల్యూ, ఏపీఎండీసీ, ఆర్‌అండ్‌బీ, ఇంజినీరింగ్‌ విభాగాల్లో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు రూ.140కోట్ల వరకూ బిల్లులు నిలిచిపోయాయి. దీంతో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బతిమలాడినా కొత్తగా నిర్మాణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు నిధులు లేకపోవడంతో గ్రామాల్లో పర్యటనలు మానుకుంటున్నారు. ఇంటికే పరిమితమవుతున్నారు. ద్వితీయ శ్రేణి, మండల నాయకులు ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి సమస్యల చిట్టా విప్పితే, డబ్బుల్లేవు చూద్దాంలే అంటూ దాట వేస్తున్నారు.


- స్థానిక సంస్థల పరిస్థితి దయనీయం

కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. సర్పంచ్‌లుగా ఎన్నికైన కొందరు అధికార పగ్గాలు చేపట్టగానే అందుబాటులో ఉన్న నిధులతో చిన్న చిన్న నిర్మాణ పనులు చేపట్టారు. ఇంతలో ఆర్థిక సంఘం మిగులు నిధులను ప్రభుత్వం వివిధ పద్దుల కింద జమ చేసుకుంది. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. పంచాయతీల ఖాతాల్లో ఆర్థిక సంఘం నిధులు నేరుగా జమవుతున్నాయని చెబుతున్నా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు.  పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టే విధంగా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సర్పంచ్‌లకు కొంతవరకూ ఏదో చేశామన్న సంతృప్తి అయినా ఉండేది. ప్రస్తుతం ఉపాధి పనులు కూడా చేసే పరిస్థితి లేకపోవడంతో సర్పంచ్‌లు ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్నారు. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులదీ అదే దారి. ఇటీవల జడ్పీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు జరిగాయి. అనంతరం బడ్జెట్‌ సమావేశాలు అయ్యాయి. ఇంతవరకు ఎవరికీ ఒక్క రూపాయి నిధులు విడుదల కాలేదు. కనీసం జడ్పీ చైౖర్‌పర్సన్‌ ఛాంబర్‌, అతిథిగృహాల మరమ్మతులకు కూడా నిధులు లేవు. దీంతో నిధుల కోసం ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. 

Updated Date - 2022-01-31T04:14:14+05:30 IST