చారిత్రక వనరులపై నిర్లిప్తత ఎందుకు?

ABN , First Publish Date - 2021-07-15T06:15:10+05:30 IST

కొప్పర్తి వెంకటరమణ ఆంధ్రజ్యోతిలో జూలై 2న ‘‘తెలంగాణ లేని ‘ఆంధ్ర’కు అస్తిత్వ స్పృహ ఉందా’’ అనే వ్యాసాన్ని, దానికి స్పందనగా ఆచార్య వకుళాభరణం రామకృష్ణ...

చారిత్రక వనరులపై నిర్లిప్తత ఎందుకు?

కొప్పర్తి వెంకటరమణ ఆంధ్రజ్యోతిలో జూలై 2న ‘‘తెలంగాణ లేని ‘ఆంధ్ర’కు అస్తిత్వ స్పృహ ఉందా’’ అనే వ్యాసాన్ని, దానికి స్పందనగా ఆచార్య వకుళాభరణం రామకృష్ణ జూలై 10న ‘అస్తిత్వ చరిత్ర-–అస్తిత్వ స్పృహ’ పేరిట మరో వ్యాసాన్ని రాసిండ్రు. తిరిగి తిరిగి మళ్లొక్కసారి ‘అస్తిత్వం’, ‘చారిత్రక స్పృహ’ను ఈ వ్యాసాలు చర్చలోకి తీసుకొచ్చాయి. ఈ రెండు వ్యాసాలూ ప్రధానంగా ‘ఆంధ్రా’ చుట్టు తిరిగాయి. అయితే ఈ సందర్భంగా ‘ఆంధ్రా’ వారు కూడా పట్టించుకోవాల్సిన కొన్ని అంశాలను తెలంగాణ కోణంలో జోడించడానికి నా ఈ వ్యాసం ప్రయత్నిస్తుంది.


‘తెలంగాణ నుంచి విడివడిన ఆంధ్రదేశం తనదైన చరిత్ర నిర్మాణానికి ఇంతవరకూ పూనుకోలేదు’ అని కొప్పర్తి అభిప్రాయపడ్డారు. అలాగే ‘కొత్తగా జరగవలసిన పరిశోధనలో ఆంధ్రదేశానికి చెందిన నిర్దిష్టత ఏదో వెలికి రావలసి ఉంది’ అని కూడా ఆయన పేర్కొన్నారు. అవును, నిర్దిష్టంగా విషయాలు వెలుగులోకి రావాలంటే ముందుగా ‘సమాచార వనరులు’ అందరికీ అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, వివక్షత, విస్మరణ లేని తనదైన చరిత్ర నిర్మాణానికి పూనుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌-, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటు తర్వాత ‘చారిత్రక వనరులు, పంపకాల’పై రెండు రాష్ట్రాలు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడంలో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నాయి. తాత్సారం చేస్తున్నాయి. ఈ నిర్లిప్తత, తాత్సారం భవిష్యత్ తరాల వారికి అసలు సమాచారమే అందుబాటులో లేకుండా చేసే ప్రమాదమున్నది. ఆ ప్రమాదఛాయలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. 


ఆచార్య రామకృష్ణ తమ వ్యాసంలో ‘తెలుగువారి చరిత్ర రచన, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినది, 20వ శతాబ్ది ఆరంభంలోనే మొదలైంది. కొమర్రాజు లక్ష్మణరావు నేతృత్వంలో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి, ఈ బృహత్కార్యాన్ని తలకెత్తుకుంది’ అని రాసిండ్రు. ఈ విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి 1906లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమయిందని గుర్తుంచుకోవాలి. అట్లాగే ‘హైదరాబాద్‌ స్టేట్‌’ ఏర్పాటైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఒక చరిత్ర రచనా కమిటీని ఏర్పాటు చేసిండు. గోపాలరావు ఎగ్బోటే నేతృత్వంలోని ఈ కమిటీ నాలుగు సంపుటాల్లో ‘హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమ చరిత్ర’ను రికార్డు చేసింది. దీనికి కొనసాగింపుగా తెలంగాణ ప్రభుత్వం చరిత్రను కొత్తగా అందివచ్చిన ఆకరాలతో, స్థానీయ కోణంలో రికార్డు చేయించడానికి ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసి, మరుగున పడ్డ ఘనచరిత్రను వెలుగులోకి తేవాలి. ఇందుకు చిత్తశుద్ధి అవసరం.


ఉమ్మడి రాష్ట్రంలో ‘ఆంధ్రప్రదేశ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’కి ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ ఉండేది. ఇందులో 1952 నుంచి ఆంధ్రప్రదేశ్‌ (కొన్ని హైదరాబాద్‌ అసెంబ్లీ) శాసనసభ డిబేట్స్‌ అన్నీ డిజిటల్‌ రూపంలో అందుబాటులో ఉండేవి. వీటి ఆధారంగానే 1969 ఉద్యమ సందర్భంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ, ఈశ్వరీబాయి లాంటి వారు అసెంబ్లీలో వినిపించిన ధిక్కారస్వరం చరిత్రలో రికార్డయింది. ఆనాటి పాలకుల వైఖరిని కూడా ఈ చర్చలు రికార్డు చేశాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త వెబ్‌సైట్‌ నిర్మితమయింది. ఈ వెబ్‌సైట్‌లోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌ వెబ్‌సైట్‌లోనూ ఈ డిబేట్స్‌, గత మంత్రివర్గ వివరాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి జీవిత వివరాలు, తీర్మానాలు ఏవీ కూడా అందుబాటులో లేవు. ఉమ్మడి చరిత్రను ఇరు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉండగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఉభయరాష్ట్రాలూ రద్దు చేశాయి. 


రెండోది పొత్తూరి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌గా ఉన్నప్పుడు రామకృష్ణ పేర్కొన్న రాజమండ్రి గౌతమీ లైబ్రరీ, వేటపాలెం ‘సరస్వతీ నిలయం’ (సారస్వత నికేతనం), నెల్లూరు ‘వర్ధమాన సమాజం’ గ్రంథాలయాలతో పాటు ఇతర (కాకినాడ) గ్రంథాలయాల నుంచి పాత పత్రికలు, వార్షిక సంచికలు, కొన్ని అరుదైన పుస్తకాలను డిజిటలైజ్‌ చేయించి ‘ప్రెస్‌ అకాడెమీ ఆర్కయివ్స్‌’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి అందరికీ అందుబాటులో ఉంచారు. రెండు రాష్ట్రాల్లోని స్కాలర్స్‌కే గాకుండా, దేశ, విదేశాల్లోని పరిశోధకులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడెమీ ఇప్పుడు ‘తెలంగాణ మీడియా అకాడెమీ’గా మారింది. బహుశా ‘మెయింటెనెన్స్‌’ సమస్యల వల్ల ఆ వెబ్‌సైట్‌ ప్రస్తుతం పనిచేయడం లేదు. నిజానికి ఇందులో తెలంగాణకు చెందిన ‘తెనుగు’, ‘నీలగిరి’, ‘సుజాత’ ఇంకా విలువైన పాత పత్రికలు, తెలంగాణ ఉద్యమ పత్రికలను జోడించి దీన్ని మెరుగుపరిచి, ఇండెక్స్‌ తయారు చేసి అందుబాటులోకి తేవాల్సిన అవసరమున్నది. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడెమీ ఆర్కయివ్స్‌’ మెయింటెనెన్స్‌ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా తీసుకొని చేయవచ్చు. కానీ ఆ పని వాళ్ళూ చేయడం లేదు.


మరో విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, విశాఖపట్నం, నిజామాబాద్‌లతో పాటు హైదరాబాద్‌ స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీల్లో ఉన్న పుస్తకాల వివరాలు, అవి ఇష్యూలో ఉన్నాయా? అందుబాటులో ఉన్నాయా? ఏ రచయిత పుస్తకం ఏ గ్రంథాలయంలో దొరుకుతుంది అనే సమాచారం ‘ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లైబ్రరీ’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండేది. దీని ద్వారా ఏ రచయిత పుస్తకాలు ఏవి అచ్చయినాయి? అనే సమాచారంతో బాటు అవి ఎక్కడ దొరుకుతాయి అనే వివరాలు కూడా ‘వెబ్‌సైట్‌’ ద్వారా అందరికీ తెలిసేది. తద్వారా పరిశోధకులు తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుపడేది. అయితే దురదృష్టవశాత్తు ఈ ‘సైట్‌’ ఆగిపోయింది. అలాగే అఘోరనాథ్‌ చటోపాధ్యాయ ‘చాందా రైల్వే ఉద్యమం’ మొదలు ‘కొమురం భీమ్’ పోరాటాల వరకు హైదరాబాద్‌కు సంబంధించిన ఎంతో విలువైన హోం మినిస్ట్రీ ఫైల్స్‌, పుస్తకాలు ఉన్న ‘సచివాలయ గ్రంథాలయం’ ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండా చీకటి గదుల్లో స్టోర్‌ చేసిండ్రు. ఇట్లా గాలి, వెలుతురు సోకని ప్రదేశంలో ఈ పుస్తకాలున్నట్లయితే ‘జాతి సంపద’ భవిష్యత్‌లో లుప్తమయ్యే ప్రమాదముంది. 


అట్లాగే తెలుగు యూనిర్సిటీలో ఉన్న అరుదైన కైఫియత్తులు, స్టేట్‌ ఆర్కైయివ్స్‌లో ఉన్న చారిత్రక పత్రాలు, ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌ లైబ్రరీల్లో ఉన్న తాళపత్రాలు, అరుదైన పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని ‘వెబ్‌సైట్ల’ ద్వారా అందుబాటులోకి తీసుకు రావొచ్చు. ఆంధ్ర, రాయలసీమకు సంబంధించిన కైఫియత్తులు అచ్చయ్యాయి. కానీ తెలంగాణ కైఫియత్తులు ముద్రణకు నోచుకోలేదు. మెకంజీ సేకరించిన కైఫియత్తుల్లో తెలంగాణవి కూడా ఉన్నాయనే సోయే లేదు. దీనికి తోడు తిరుపతి ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌ లైబ్రరీలో ఉన్న పాత తాళపత్ర గ్రంథాలు, అరుదైన పుస్తకాలను కూడా ‘సైట్ల’లో చేర్చవచ్చు. టిటిడి నుంచి రెగ్యులర్‌గా ఈ లైబ్రరీకి అందే ఫండ్‌ ఎందుకు ఆగిపోయిందో కూడా విచారణ జరిపించాలి. ఇట్లా చేసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి- ప్రాంత అస్తిత్వ సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా ప్రపంచమంతటా పరిశోధకులకు ఈ కరోనా విపత్సమయంలో తోడ్పాటును అందించిన వారమవుతాము. అలాగే తెలంగాణ, ఆంధ్రా అధికారులు లండన్‌, మద్రాసుల్లో ఉండిపోయిన తెలుగు వారి పురావస్తు, తాళపత్ర ఆస్తిని డిజిటలైజేషన్‌ ద్వారా అందరికీ అందుబాటులోకి తేవాల్సిన అవసరమున్నది. అలా కానప్పుడు కనీసం నెల్లూరులో ఉన్న కేంద్రప్రభుత్వ ‘క్లాసికల్‌ తెలుగు అధ్యయన కేంద్రం’ ద్వారా నైనా ఈ పని చేయించవచ్చు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు దాటుతున్నా ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో జరగాల్సిన కృషి సంతృప్తికరంగా జరగడం లేదు. సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని గర్వంగా చాటాల్సిన ప్రస్తుత తరుణంలో ఆ దిశలో అడుగులు పడడం లేదు. 1969 ఉద్యమానికి 2019లో 50 ఏండ్లు నిండాయి. ఆ సందర్భంగా ప్రభుత్వం తరపున కనీసం ఉద్యమకారులను ఎక్కడా తలచుకోలేదు. 1969 ఉద్యమానికి సంబంధించి కొన్ని వేల పేజీల సమాచారం పుస్తకాలుగా వెలువడాల్సిన అవసరమున్నది. ఆ దిశలో ‘తెలంగాణ హిస్టరీ సొసైటీ’ తరపున కొంతమంది మిత్రులం కలిసి రెండు బృహత్‌ పుస్తకాలను వెలువరించాము. ఆ పని కొనసాగాల్సిన అవసరమున్నది. అంతేగాకుండా ‘తెలంగాణ’ పేరును విశ్వవ్యాప్తంగా పరిచయం చేసిన ‘సాయుధ రైతాంగ పోరాటా’నికి ఇది వజ్రోత్సవ సంవత్సరం. ఈ ప్రజాపోరుకు సంబంధించిన వివిధ అంశాలను ప్రభుత్వపరంగా రికార్డు చేయాల్సిన అవసరమున్నది. 


తెలంగాణ అమరుల చిహ్నంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్మిస్తున్న ‘అమరవీరుల స్మృతి కేంద్రం’లో ప్రదర్శనకు పెట్టడానికి తొలిదశ, మలిదశ ఉద్యమంలో బలిదానాలు చేసిన ఉద్యమవీరుల ఫోటోలను, పోరాట చిత్రాలను సేకరించి పదిల పరచాల్సిన అవసరమూ ఉన్నది. అంతేగాదు ప్రపంచం అబ్బురపడేలా మన ఉద్యమ ఘనతను చాటాలి. ఇవన్నీ చారిత్రక ఆధారాల సేకరణ, అస్తిత్వ స్పృహ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఆ దిశలో ప్రభుత్వం, అధికారులు, నాయకులు, బుద్ధిజీవులు, చరిత్రకారులు చర్యలు తీసుకోవాల్సిన సందర్భమిది.

సంగిశెట్టి శ్రీనివాస్‌

Updated Date - 2021-07-15T06:15:10+05:30 IST