Abn logo
Sep 20 2021 @ 00:42AM

ధిక్కరించి నిలవాలి గానీ, దాపరికమెందుకు?

ఏది గాయం, ఎప్పుడు మానింది, ఎవరు రేపుతు న్నారు. అసలు దాసరి కేశవులు అభ్యంతరాలేంటి (వివిధ- 13 సెప్టెంబరు 2021). ఆయన ‘మనో ధర్మపరాగం’ నవల సారాంశాన్ని వ్యతిరేకిస్తున్నారా. ఆ నవలను తిరుపతిరావు ప్రశంసించడాన్ని అభ్యంతరపడు తున్నారా. దేవదాసీ ఘనతను తన ప్రతిస్పందన నిండా ఆకాశానికెత్తిన దాసరి వారే ‘‘ఎందుకిప్పుడిదంతా దాన్ని దాపెట్టేద్దాం’’ అని ఎందుకంటున్నారు. ఆకాశానికెత్తిందంతా నిజమే అయితే దాపెట్టేద్దాం అని అనకూడదు. ఒకవేళ దాపెట్టడమే సమంజసం అనుకుంటే ఆకాశానికెత్తడం చేయకూడదు. ఈ తరహా అయోమయం దాసరి వారి రాతలో అక్షరక్షరాన వినపడుతోంది. ‘దేవదాసీలు కళలు చెదిరిపోకుండా భద్రంగా భవిష్యత్తరాలకు అందించారు, ఈ కోణంలో రచనలు నవలలు వస్తే ప్రయోజనం’ అని అంటూనే రూపుమాసిన వ్యవస్థ గురించి రాస్తే సమాజానికి ఏం ఒనగూరుతుంది అంటున్నారీయన. ఎందుకలా!


ఒక కులంవారు తమ కులాన్ని దాచిపెట్టుకుని మరో కులం పేరు చెప్పుకోవల్సి రావడం కంటే భయంకరమైన విషాదం ఏదీ ఉండదు. దాసరివారు చెపుతున్నది మరీ హాస్యం కాకపోతే ఒక చట్టం అనే కాగితమ్ముక్కను దేశం మీదకు వదలగానే సంబంధిత వ్యవస్థలు రద్దవుతాయా. మరీ నేలబారు ఉదాహరణ అనుకోకపోతే వరకట్న నిషేధ చట్టం రాగానే వరకట్నం రద్దయిందా. మధ్య తరగతి పెళ్లి మాట్లాడుకోవడాల్లో కూర్చుని చూడండొకసారి. బాలకార్మిక నిర్మూలనా చట్టం రాగానే పిల్లలెవరూ కూలీ పనులకు వెళ్లడం లేదా. ఇటుక బట్టీలు, పొలం నాట్లు, కుప్ప నూరుళ్ల చెమట సన్నివేశాల్ని కనండొకసారి. బాల్యవివాహ నిషేధ చట్టం తేగానే పుత్తడి బొమ్మ పూర్ణమ్మలు మాయ మయ్యారా. దేశం పొడవునా ఉన్న గిరిజన గూడేలను దర్శించండొకసారి. ఇంతతెలిసీ విచిత్రంగా 74సంవత్సరాల క్రితమే దేవదాసీ వ్యవస్థ రూపుమాసిపోయిందహో అని రాజ్యభాషలో మాట్లాడుతున్నారు దాసరి వారు. నిజానికి రూపుమాసిపోవల్సింది వ్యవస్థలు కాదు, భావజాలాలు. ‘భోగం మేళం’, ‘భోగం వేషాలు’ అనే పదాలను వాడకుండా జీవో తేగలరా. ఒకవేళ తెచ్చినా వాటి వాడకం నిలిచి పోతుందా. గత 74 సంవత్సరాలుగా ఆయనకీ మాటలే వినపడడం లేదా. ఒక్కసారి ముసుగుల బయటకొచ్చి మాట్లాడండి. ‘ఛండాలం’ అనే మాటను వాడకూడదని అందరూ ఏకతాటి మీద నిలబడ్డట్టు ఈ మాటలనూ వాడకుండా తీర్మానం చేయించగలరా.


ఒక కులం పేరు చెప్పగానే పడుపు వ్యాపారం గుర్తుకు వచ్చే తప్పుడు పరిస్థితి ఎందుకు వచ్చిందో సమీక్షించుకుని అసలు దేవదాసీ అన్నా కళావంతు  లన్నా పడుపుతనం కాదు కదా, ఒక ఘనమైన సాంస్కృతిక వైభవం కదా, ఒక సంగీత సాహిత్య సామ్రాజ్య ప్రతీక కదా అని కాలరెగరేసి చెప్పుకుని ఆ కులానికి గౌరవం తేవాల్సింది పోయి- అదొక గాయమనీ దాన్నెవరో రేపుతున్నారనీ అంతా గప్చుప్‌గా మూసెయ్యాలనీ బాధ పడడం కేవలం సామాజిక అబాధ్యత తప్ప మరేమీ కాదు. పేరు చివర ‘మాదిగ’ అనీ ‘షెపర్డ్‌’ అనీ తగిలించుకుని తెచ్చుకున్న గౌరవపతాక మనమెందుకు ఎగరవేయకూడదు అని ఆలోచించే ధిక్కారం కావాలి తప్ప దాపుడు కథలు నేర్పేవాళ్లు కాదు. దేవదాసీల నాడూ కళావంతుల నాడూ సూర్యబలిజల నాడూ ఏనాడూ కూడా పడుపు వృత్తిలోలేని వాళ్లమీద పడే పడుపువృత్తి ముద్రను చెరిపేసే ప్రయత్నం చేసుకోవడం ఇప్పుడు అత్యవసరం తప్ప ఆ ముద్రను గుసగుసగా కమ్మేసి దూరంగా పారిపోయి దాక్కునే పిరికి పాట ఎందుకు పాడాలో దాసరి వారు చెప్పగలరా. సెల్ఫ్‌ అసర్షన్‌ విలువేమిటో, దానివల్ల వచ్చే గౌరవం ఎంతో దాసరి వారికి ఎందుకు అర్థం కావడం లేదో మరి.


మనమేమిటో చెప్పుకోవడం, మేం మేమే అని బల్లగుద్దడం, మేమిదే, నీకు తెలియదు... తెలుసుకో, మేం నువ్వనుకుంటున్న మేం కాదు, మా పట్ల నీ భావజాలాన్ని మార్చుకో, నీ భాష మార్చుకో అని రొమ్ము విరుచుకుని నిలబడాలి. ఉన్న ఉనికికి గౌరవాన్ని అద్ది గర్వాన్ని అలంకరించుకుని ప్రదర్శనకు పెట్టాలి తప్ప పారిపోకూడదు. అందుకు అవసరమైన ముడి సరుకు, చారిత్రక వివరాల సంకలనమే ‘మనోధర్మ పరాగం’ నవల.


దాసరివారి ప్రతిస్పందన చదివినపుడు నాకు ఆయన ఆ నవల చదవలేదని స్పష్టంగా అర్థమైంది. ఆయనకు నవలతో పనిలేకుండా తిరుపతిరావు ప్రశంస మాత్రమే నచ్చలేదు. నవల నిజంగా చదివి ఉంటే ఆ పాత్రల్లో ఒక ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి, ఒక బెంగుళూరు నాగరత్నమ్మతోపాటు మరెందరో దేవదాసి మహిళలు కనపడి ఉండేవారు. ఈ సంఘర్షణను వాళ్లిద్దరూ పూర్తి విరుద్ధకోణాల్లో ఎలా చూసారో, ఎమ్మెస్‌ సమాజ ఒత్తిడికి ఎలా లొంగారో, నాగరత్నమ్మ ఎలా ధిక్కరించి నిలబడ్డారో కూడా అర్థం అయి ఉండేది. దేవదాసీ వ్యవస్థ వైభవస్పర్శకు నిక్కబొడుచుకున్న రోమాల సంబరం తెలిసుండేది. నేను ఫలానా అని ఎలుగెత్తి చాటడానికి అవసరమైన ఉత్ర్పేరకం బోలెడుందని తెలిసొచ్చేది.


నిజానికి నవలలోనూ, తిరుపతిరావు ప్రశంసలోనూ అభ్యంతరపడాల్సిందేమీ లేదు. అభ్యంతరపడాల్సిందల్లా దాసరి వారి దాపరికం గురించే. ఇప్పుడు కావ ల్సింది సుబ్బలక్ష్ములు కాదనీ బెంగుళూరు నాగరత్నమ్మలనీ అర్థం చేసుకోలేని ఆయన భావజాలం గురించే. సుబ్బలక్ష్ముల లాంటి విద్వాంసురాళ్లను కాపాడుకోవడానికి అవసరమైన నాగరత్నమ్మలను గుర్తించ లేని కురచతనం గురించే. ఇది మరిన్ని మనోధర్మ పరాగాలు రావాల్సిన సమయం. ఇది మరిన్ని తిరుపతి రావ్‌ ప్రశంసలు రావాల్సిన సమయం. అన్నింటికంటే ముఖ్యంగా ఈ రెంటీనీ దాసరి కేశవులు లాంటివారు సవ్యంగా అర్థం చేసుకోవల్సిన సమయం.

ప్రసేన్‌

98489 97241