ఎందుకో ఏమో..!

ABN , First Publish Date - 2022-06-01T06:23:07+05:30 IST

జేఎనటీయూ ఉన్నతాధికారులకు ఉద్యోగులంటే గిట్టదా..? కారుణ్య నియామకాలు, ఉద్యోగోన్నతి అంశాల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు..? ఏదైనా ఆశించి ఇలా చేస్తున్నారా..? లేక నిర్లిప్తంగా ఉండిపోయారా..? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

ఎందుకో ఏమో..!

అనంతపురం సెంట్రల్‌ : జేఎన్‌టీయూ ఉన్నతాధికారులకు ఉద్యోగులంటే  గిట్టదా..? కారుణ్య నియామకాలు, ఉద్యోగోన్నతి అంశాల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు..? ఏదైనా ఆశించి ఇలా చేస్తున్నారా..? లేక నిర్లిప్తంగా ఉండిపోయారా..? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అర్హత ఉన్నా.. ఏళ్లతరబడి చాలామంది ప్రమోషన్లు పొందలేదు. అకాల మరణం పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద అవకాశాలు ఇవ్వడం లేదు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో ఎక్కడ లేని నిబంధనలను సాకుగా చూపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కమిటీ చైర్మన్, కన్వీనర్‌ తీరు అనుమానాస్పదంగా ఉందని బాధితుల్లో కొందరు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. నాన్ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్ నాయకులు తమ గురించి పట్టించుకోవడం మానేసి, సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారని, అధికారులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు. తమ గోడు ఎవరికీ పట్టడం లేదని వాపోతున్నారు. 



ఏళ్లతరబడి నిరీక్షణ

జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్వీపర్‌ నుంచి సూపరింటెండెంట్‌ వరకు టెక్నికల్‌, నాన్ టెక్నికల్‌ విభాగాల్లో సేవలు అందిస్తున్న వీరికి అనుభవం, అర్హతను బట్టీ ప్రమోషన్లు కల్పించాలి. కానీ ఏళ్ల తరబడి ఎదురుచూపులే మిగిలాయి. టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-1, మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, బ్లాక్‌స్మిత్, ఎలక్ట్రీషియన్, జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, స్టివార్డ్‌, ఆఫీస్‌ సబార్డినేటర్‌, ల్యాబ్‌ క్లీనర్‌, క్లీనర్‌ మొదలైన పోస్టులకు దాదాపు 30 మందిని ఉద్యోగోన్నతికి అర్హులుగా గుర్తించారు. వాచ్‌మెన్, సర్వర్‌, స్టివార్డ్‌ విధులు నిర్వహిస్తూ అకాల మరణం పొందిన మగ్గురు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలివ్వాల్సి ఉంది. వర్శిటీ నియమ నిబంధనల ప్రకారం, అన్ని అర్హతలున్నా కావాలనే కొత్త నిబంధనలు సృష్టించి ముప్పుతిప్పలు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



అటానమస్‌ ఉండీ ఏం లాభం..?

జేఎన్‌టీయూ క్యాంప్‌స్‌లోని ఇంజనీరింగ్‌ కళాశాల అటానమస్‌ (స్వయంప్రతిపత్తి) పొందిన సంస్థ. ఉద్యోగుల సంక్షేమ అంశాలపై సొంత నిర్ణయం తీసుకుని, అమలు చేసే అధికారం ఉంటుంది. కానీ ప్రతి చిన్న విషయాన్నీ వర్శిటీ యాజమాన్యానికి సిఫార్సు చేస్తోంది. ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. నాన్ టీచింగ్‌ సిబ్బంది అంటే గిట్టని ఒక మాజీ ప్రిన్సిపాల్‌, ప్రమోషన్లు, కారుణ్య నియామకాల వంటి అంశాలను కావాలనే వర్శిటీ యాజమాన్యం చేతుల్లో పెట్టారని బాధితులు మండిపడుతున్నారు. నిర్ణయాలు తీసుకోలేని సంస్థకు అటానమస్‌ ఎందుకని నిలదీస్తున్నారు. 


వేచి చూడాల్సిందే..

ప్రమోషన్లకు అర్హతలను నిర్ణయిస్తున్నారు. దీనికోసం వర్శిటీ ప్రత్యేక కమిటీని వేసింది. వర్సిటీ నుంచి ఆదేశాలు వస్తే ఉద్యోగోన్నతులు కల్పిస్తాము. ప్రమోషన్ల విషయాన్ని మునుపటి ప్రిన్సిపాల్‌ వర్శిటీకి నివేదించారు. ఆయన రిటైర్డ్‌ అయ్యారు. ఒకసారి వర్శిటీకి రాశాక, అక్కడి నుంచి సమాధానం వచ్చేవరకూ వేచి చూడాల్సిందే.  

- ప్రొఫెసర్‌ సుజాత, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

Updated Date - 2022-06-01T06:23:07+05:30 IST