కులగణన పై సంకోచమెందుకు?

ABN , First Publish Date - 2021-10-15T07:59:55+05:30 IST

జనాభా గణనలో ‘కులగణన’ చేపట్టాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు అసెంబ్లీలో తీర్మానం చేసి...

కులగణన పై సంకోచమెందుకు?

జనాభా గణనలో ‘కులగణన’ చేపట్టాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన చేపట్టాలంటూ కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ గణనకు అనుకూలంగా శాసనసభలో ఒక తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలోనే ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. అలాగే బిఎస్పీ అధినేత మాయావతి, ఆర్ జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో సహా అన్ని జాతీయ రాజకీయపార్టీలు, ప్రాంతీయపార్టీలు కులగణన చేపట్టాలని బహిరంగ ప్రకటనలు జారీ చేశాయి. దీనికోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ ఫ్రంట్, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేశాయి. దీనికి కేంద్రప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ కులగణన చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, అది ఆచరణలో సాధ్యం కాదని వితండవాదం చేస్తోంది.


జనాభా గణనలో కులగణన చేయడానికి కేంద్రం విముఖత చూపుతూ, అందుకు అనేక కారణాలు చెప్పింది. 2011లో జరిపిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో 46 లక్షల కులాలు, ఉపకులాల పేర్లు ప్రజలు చెప్పారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. 1931లో బ్రిటీషు వారు జరిపిన జనగణనలో దేశంలో 4,147 కులాలు ఉన్నట్లు తేలింది. కేంద్రప్రభుత్వం చెబుతున్నట్లుగా 46 లక్షల కులాలు, ఉపకులాలు ఉన్నాయనే వాదన సరికాదు. కులగణన చేయడానికి ఇష్టంలేక డొంకతిరుగుడు వాదనలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో 2642 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలో 2892 బీసీ కులాలు ఉన్నాయి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రకులాలు అన్నీ కలుపుకున్నా కూడా 6 వేల కులాలకు మించవు. గతంలో అనేక సర్వేలలో కూడా దేశంలో 6 వేల కులాలు ఉన్నాయనే తేల్చారు. అలాంటప్పుడు పొంతన లేని విధంగా 46 లక్షల కులాలు, ఉపకులాలు ఉన్నాయని వితండవాదన చేయడం విడ్డూరం. భాష, ప్రాంతం, రాష్ట్రాలను బట్టి కులాల పేర్లు మారినా, ఇప్పుడున్న బీసీ జాబితాకు పనికొచ్చే పేర్లే పట్టికలో గణన చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు సందిగ్ధం? ఎందుకు పసలేని డొంకతిరుగుడు వాదన. ఎస్సీ, ఎస్టీ కులాలకు లేని ఇబ్బందులు బీసీలకు ఎందుకొస్తాయి? 


జనాభా గణనలో కులగణన చేపట్టాలని 2010లో కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిజెపి డిమాండ్ చేసింది. అలాగే 2018 ఆగస్టు 31న అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, ఈ దఫా జరిగే జనగణనలో కులాలవారీ వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రాజ్యాంగబద్ధంగా 1953లో నియమించిన కాక కాలేల్కర్ కమిషన్, 1979లో నియమించిన మండల్ కమిషన్ దీనిపై కేంద్రానికి సిఫారసు చేశాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో నియమించిన ప్రతి బీసీ కమిషన్‌ కూడ (దాదాపు 246 బీసీ కమిషన్లు) కుల గణన చేయాలని సిఫారసు చేసింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం స్పందించడం లేదు.


ఇక ఉన్నత న్యాయస్థానాల విషయానికొస్తే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల కేసులు వచ్చిన ప్రతిసారి కులగణన చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేశాయి. కానీ వాటికి చట్టబద్ధత, -న్యాయబద్ధత ఉండదు. బీసీ కమిషన్లు,- సుప్రీంకోర్టు, హైకోర్టులు, -రాష్ట్రప్రభుత్వాలు, అన్ని రాజకీయపార్టీలు కులగణన చేయాలని కోరుకుంటే కేంద్రప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? ఎందుకంటే అదే చేపడితే హిందువుల ఓట్లలో చీలిక వస్తుందనేది ఆ పార్టీకి  ఉన్న భయం. ఇది పూర్తిగా అర్థం లేని, పస లేని వాదన. ప్రతిరోజు, ప్రతి సందర్భంలో కుల ప్రస్తావన లేకుండా ఏ వ్యవహారాలు జరగడం లేదు. పుట్టినప్పటి నుంచి పాఠశాలలో చేరే వరకు కులం గురించి అధికారికంగా సర్టిఫికేట్లలో రాస్తారు. కులం పునాదుల మీదనే భారతీయ సమాజం నిర్మాణం జరిగింది. జన గణన జరిగే ఒక్కరోజున కులం గురించి అడిగితే కులతత్వం పెరుగుతుందనేది ఊహాజనితమైన ఆలోచన.


కులాలవారీగా జనాభా లెక్కలు తీస్తే అణచివేతకు గురైన కులాల వారందరు అన్ని రంగాలలో, ముఖ్యంగా విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంచాలని రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బడ్జెట్‌లో, అధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారేమోనని పాలకవర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. కులపరమైన సమాచారం సేకరిస్తే దేశంలో ఆయా కులాల మధ్య ఘర్షణ జరిగే ప్రమాదముందని చెబుతున్న ప్రభుత్వం, 1881 నుంచి 1931 వరకు బ్రిటిషు వారి ఆధ్వర్యంలో 5 సార్లు కుల జనగణన చేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదు. 


కులగణన వల్ల ఉపయోగాలు,- లాభాలు ఉన్నాయి.  ఒక్కొక్క కులం జనాభాతో పాటు వారి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ వివరాల వల్ల అన్ని కులాలకు సామాజిక న్యాయం జరుగుతుంది. వారి వారి కులాలు జనాభా ప్రకారం రిజర్వేషన్లు లభిస్తాయి. జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయించి వారి ఆర్ధికాభివృద్ధికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, బి.సి కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి ఒకే రకమైన సారూప్యత కలిగిన వారిని గుర్తించి గ్రూపులుగా వర్గీకరించి ప్రత్యేక అబివృద్ధి చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అబివృద్ధి-సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల కోసం అమలు కూడ ప్రభుత్వాలకు అవసరం. 


మనదేశంలో దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీల కులగణన జరుగుతున్నందున వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్లు పొందుతున్నారు. ఆ వివరాల ప్రాతిపదికగానే కేంద్రంలో రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను రూపొందించారు. బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. కానీ బీసీ కులాలకు సంబంధించిన జనాభా లెక్కలు లేనందున వారు తగినంతగా రిజర్వేషన్లు పొందడం లేదు. వారికోసం సబ్‌ప్లాన్ లేదు. బీసీల జనాభా 56 శాతం ఉంటే 25 శాతం మాత్రమే రిజర్వేషన్లు పొందుతున్నారు. బడ్జెట్ కేటాయింపులు కూడ తగిన మేరకు లేవు. ఒక కులాన్ని బీసీ జాబితాలో కలపాలంటే ఆ కులం జనాభా, విద్యా, ఉద్యోగ రంగాలలో వారి ప్రాతినిధ్యం, సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలవాలి. ఈ వివరాలు లేకుండా కులాలను బీసీ జాబితాలో కలపడం అసాధ్యం.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఆ తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ బీసీలు గత 47 సంవత్సరాలుగా అనంతరామన్ కమిషన్ రిపోర్టు ప్రకారం 25 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు. కేంద్రంలో మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం 29 సంవత్సరాల నుంచి ఉద్యోగ రంగంలో, విద్యా రంగంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఈ కాలంలో ఏ ఏ కులాలు రిజర్వేషన్ల ఫలాలు పొందాయి, పొందని కులాలు ఏవీ అనే విషయాలను తెలుసుకునేందుకు కులాలవారీ లెక్కలు వివరాలు అవసరం. రిజర్వేషన్ వలన లాభం పొందిన కులాలు–పొందని కులాల వివరాలు తెలిస్తే కొత్త మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందిన కులాలను జాబితా నుంచి తొలగించవచ్చు. ఇంకా అబివృద్ధి చెందని కులాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఇప్పటివరకు గుర్తింపు పొందని కులాలను జాబితాలో చేర్చవచ్చు.


కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరించలేదు. బీసీ కులాల మధ్య సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యత్యాసాలు ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని కులాలు అత్యంత వెనుకబడినవిగా ఉన్నాయి. వీటి కోసం వర్గీకరణ జరగాలంటే ప్రతి కులం జనాభా వివరాలు తెలవాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసిన పిదప కేంద్రంలో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరించడానికి నాలుగేళ్ళ క్రితం జస్టిస్ రోహిణి కమిషన్‌ను నియమించారు. కుల గణన వివరాలు లేకపోవడంతో ఆ కమిషన్ నాలుగు సంవత్సరాలుగా ఎటూ తేల్చలేక, గ్రూపులుగా వర్గీకరించలేక ఇబ్బందులు పడుతోంది; తుది నివేదిక ఇవ్వలేకపోతోంది. కులగణన వివరాలు కావాలని కమిషన్ కేంద్రప్రభుత్వానికి 6 లేఖలు రాసింది. ఆ వివరాలు ఉంటే ఇంకా వర్గీకరణ చేయని రాష్ట్రాలలో బీసీలను గ్రూపులుగా వర్గీకరించడానికి వీలవుతుంది. వర్గీకరణ చేసిన రాష్ట్రాలలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకొనే అవకాశం ఉంటుంది. పాలన సౌలభ్యానికి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు, అభివృద్ధిఫలాల సమ పంపిణీకి కులగణన అవసరం. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా కులతత్వం పెరుగుతుందనే సాకుతో, జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా అడుగుతారనే భయంతో, కుట్రతో కేంద్ర ప్రభుత్వం కుల గణనకు అంగీకరించడం లేదనేది బహిరంగ రహస్యం. 

ఆర్.కృష్ణయ్య 

అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం

Updated Date - 2021-10-15T07:59:55+05:30 IST