ఎందుకీ గుట్టు?

ABN , First Publish Date - 2021-08-11T06:47:12+05:30 IST

పెగాసస్‌ నిఘాపై రాజ్యసభలో సోమవారం ప్రభుత్వం ఇచ్చిన సమాధానం విచిత్రమైనది. ఈ మిలటరీ గ్రేడ్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌ తయారీసంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూపుతో తాను ఏ విధమైన...

ఎందుకీ గుట్టు?

పెగాసస్‌ నిఘాపై రాజ్యసభలో సోమవారం ప్రభుత్వం ఇచ్చిన సమాధానం విచిత్రమైనది. ఈ మిలటరీ గ్రేడ్‌ నిఘా సాఫ్ట్‌వేర్‌ తయారీసంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూపుతో తాను ఏ విధమైన లావాదేవీలు జరపలేదని రక్షణశాఖ ఏకవాక్య సమాధానం చెప్పి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సహా పలువురు సీనియర్‌ రాజకీయనాయకులు, సీబీఐ అధికారులు, న్యాయవేత్తలు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు తదితర మూడువందలమంది పెగాసస్‌ నిఘానీడలో ఉన్నారని అనుకుంటున్నప్పుడు రక్షణశాఖ సహాయమంత్రి సమాధానం విపక్షాలకు ఏమాత్రం ఉపశమనాన్నిచ్చేది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ కుంభకోణం వెలుగుచూసినప్పటికీ, పార్లమెంటు సమావేశాల ఆరంభానికి సరిగ్గా ఒకరోజుముందు విపక్షాలు ఈ కుట్రకు పాల్పడ్డాయని వాదిస్తున్న ప్రభుత్వానికి, అనుమానాలను సంపూర్ణంగా నివృత్తిచేసే ఉద్దేశం ఏమాత్రం లేదని మరోమారు తేలిపోయింది.


భారత్‌లో చట్టాలు బలమైనవనీ, ఇక్కడ అనధికారిక నిఘా అసాధ్యమనీ, పెగాసస్‌ విపక్షాల ఆరోపణ మాత్రమేనని పార్లమెంటు సమావేశాల ఆరంభంనాటినుంచీ అధికారపక్షం అంటున్నది. ఇప్పటి సమాధానం కూడా అదే తరహాలో ఉంది. ఎవరికీ సంతృప్తి కలిగించని, అనుమానాలను నివృత్తిచేయని రీతిలో ఇలా సమాధానాలు చెప్పడం వల్ల ప్రయోజనంలేదు. ఉన్నతస్థాయి దర్యాప్తు గురించి విపక్షాలు పట్టుబడుతూ, ఉభయసభలూ వరుసగా వాయిదాలు పడుతున్నా, ప్రభుత్వం ఆదినుంచీ అదేరీతిలో వ్యవహరిస్తున్నది. ఒక కీలకమైన మంత్రిత్వశాఖ ఎట్టకేలకు స్పందించిందనీ, ప్రభుత్వం నోరువిప్పాల్సి వచ్చిందనీ అనుకోవడానికి తప్ప ఈ తెలివైన ఏకవాక్య సమాధానం ద్వారా కొత్తగా తెలిసేదేమీ ఉండదు. పెగాసస్‌ స్పైవేర్‌ను తయారుచేసే ఎన్‌ఎస్‌వో టెక్నాలజీస్‌తో భారత ప్రభుత్వం ఏమైనా లావాదేవీలు నిర్వహించిందా? అన్నది సీపీఎం నాయకుడు సదాశివన్‌ ప్రశ్న. దీనికి సమాధానం చెప్పింది రక్షణశాఖ సహాయమంత్రి. తమశాఖ ఎటువంటి లావాదేవీలూ జరపలేదన్నారు ఆయన. మరిన్ని వివరాలు తెలియచేయమన్నప్పుడు ఆ అవసరం ఉత్పన్నం కాదన్నది సమాధానం. ప్రభుత్వాన్ని ఉద్దేశించి వేసిన ప్రశ్నను పాలకులు తెలివిగా రక్షణశాఖకు పరిమితం చేశారన్నది విపక్షాల ఆరోపణ. నిజానికి నిఘాకు సంబంధించిన అనుమతులు ఇచ్చేది హోంమంత్రిత్వశాఖ కాగా, దానిని ఆచరణలో పెట్టి వెయ్యికళ్ళతో కనిపెట్టే సంస్థలు కనీసం అరడజనుంటాయి. స్పైవేర్‌ ఉద్దేశం ఉగ్రవాదులమీద కన్నెర్రచేయడమే అయినా, అనంతకాలం అధికారంలో కొనసాగాలని కోరుకొనే పాలకులు దానిని అందుకే పరిమితం చేస్తారని అనుకోలేం. తస్మదీయులతో పాటు అస్మదీయులమీద కూడా కన్నేసేంతవరకూ విస్తరించి, రాజకీయంతో ముడిపడిన అన్ని రంగాలకూ పాకింది. 


ఇప్పుడు ఒక మంత్రిత్వశాఖ ఈ నిఘా వ్యవహారంతో తనకు సంబంధం లేదని తేల్చినందుకు సంతోషించాల్సిందే కానీ, ఇంటలిజెన్స్‌ బ్యూరో, సీబీఐ వంటి ఇతరత్రా సంస్థల పాత్ర లేదని ప్రభుత్వమేమీ నిర్థారించడం లేదు. నిఘాలో ఉన్నట్టుగా చెబుతున్నవారేమీ దేశభద్రతతో ముడిపడినవారు కాదు. వేర్వేరు రంగాలకు చెందిన కనీసం మూడువందలమంది పేర్లు వెలుగులోకి వచ్చినందున రాఫెల్‌ ఉదంతం నుంచి ఆయా రాష్ట్రాల్లో విపక్షప్రభుత్వాలు పతనం కావడం వరకూ అనేక పరిణామాలను దీనితో ముడిపెట్టి చూడటం ఆరంభమైంది. ప్రభుత్వంలోని అతికీలకమైన వ్యక్తుల ఆదేశాలమేరకు పైకి కనిపించని వ్యవస్థలద్వారా ఇది అమలు జరుగుతున్నదేమో అన్న అనుమానాలూ అందువల్లనే. భారతప్రభుత్వం కూడా ఫ్రాన్స్‌ మాదిరిగానే పారదర్శకంగా, సానుకూలంగా వ్యవహరించవచ్చును కదా అన్నది ప్రశ్న. గుర్తుతెలియని మొరాకో క్లయింట్‌ ద్వారా ఫ్రాన్స్‌ కీలకవ్యక్తులపై నిఘా అమలు జరిగిందని తేలడంతో ఆ దేశం విస్తృత దర్యాప్తు సాగిస్తున్నది. ఆధారాల్లేవంటూ కొట్టిపారేయకుండా నిజం నిగ్గుతేల్చే ప్రయత్నం చేస్తున్నది. కనీసం నాలుగుఖండాలకు విస్తరించిన పెగాసస్‌ విషయంలో ఆయా దేశాలు తీవ్రంగా స్పందించి, ఇజ్రాయెల్‌ని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. భారతప్రభుత్వం మాత్రం ఆదినుంచీ అదేపాట పాడుతోంది. మీడియా కథనాలు నిజమైతే ఇది తీవ్రమైన వ్యవహారమే అంటూ, పెగాసస్‌పై స్వతంత్రదర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజనవ్యాజ్యాల విచారణకు సుప్రీంకోర్టు సిద్ధపడిన నేపథ్యంలో, విచారణ వచ్చేవారం నుంచి వేగం పుంజుకోవచ్చు. ప్రభుత్వం ఈ పాటికే చొరవ తీసుకొని, భారత ప్రజాస్వామ్యాన్నీ, ప్రజల గోప్యతనూ అపహాస్యం చేస్తున్న ఈ విదేశీ నిఘా మీద చట్టసభలో పరిపూర్ణంగా చర్చిస్తే ఎంతో బాగుండేది.

Updated Date - 2021-08-11T06:47:12+05:30 IST