ష్‌.. గప్‌చుప్‌.. కంట్రోల్‌ రూమ్‌లో ఏం జరుగుతోంది?

ABN , First Publish Date - 2021-05-14T19:11:48+05:30 IST

కరోనాకు సంబంధించి ఏ సమస్యలున్నా

ష్‌.. గప్‌చుప్‌.. కంట్రోల్‌ రూమ్‌లో ఏం జరుగుతోంది?

  • వివరాలు వెల్లడించని అధికారులు
  • గతంలో రోజూ ప్రకటన
  • కంట్రోల్‌ రూమ్‌లో ఏం జరుగుతోంది..?

హైదరాబాద్‌ సిటీ : 040 - 2111 1111... ఇది జీహెచ్‌ఎంసీలోని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌. కరోనాకు సంబంధించి ఏ సమస్యలున్నా ఫోన్‌ చేయాలని అధికారులు ప్రకటించారు. కానీ కంట్రోల్‌ రూమ్‌ పనితీరు అధ్వానంగా కనిపిస్తోంది. మెజార్టీ కాల్స్‌కు సరైన స్పందన ఉండడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి వేవ్‌తో పోలిస్తే కరోనా ప్రభావం ఇప్పుడు ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆశ్రయిస్తున్నారు. అంబులెన్స్‌ కావాలని, ఆక్సిజన్‌ ఎక్కడ అందుబాటులో ఉందో చెప్పాలని, తమకున్న లక్షణాలు చెబుతూ ఏ మందులు వాడాలని అడుగుతున్నారు. కొందరు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కోసం కాల్‌ చేస్తున్నట్లు కంట్రోల్‌ రూమ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం అడుగుతోన్న వారూ ఉన్నారు.


ఎందుకింత గోప్యం..?

 కంట్రోల్‌ రూమ్‌ పనితీరు ష్‌.. గప్‌చుప్‌ అన్నట్టుగా మారింది. ఎంత మంది కాల్‌ చేస్తున్నారు..? ఏ సేవల కోసం ఎన్ని కాల్స్‌ వస్తున్నాయి..? అన్న వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. కిందటి యేడాది ఏ రోజుకారోజు ఎన్ని కాల్స్‌ వచ్చాయన్న వివరాలు ప్రకటించే వారు. ఇప్పుడు వివరాలను చెప్పడం లేదు. గతంతో పోలిస్తే కాల్స్‌ సంఖ్య భారీగా పెరగడం, ఆశించిన స్థాయిలో సేవలందించే పరిస్థితి లేకనే వివరాలు వెల్లడించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంట్రోల్‌ రూమ్‌ పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పూర్తిస్థాయిలో లేకపోవడం వల్లే పనితీరు అధ్వానంగా మారిందని సంస్థలోని ఓ ఉద్యోగి చెప్పారు. ఎక్కడ తమ వైఫల్యం బయట పడుతుందనే ఉద్దేశంతోనే కంట్రోల్‌ రూమ్‌ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-05-14T19:11:48+05:30 IST