చేతగానప్పుడు చెప్పడమెందుకు?

ABN , First Publish Date - 2021-02-23T05:16:10+05:30 IST

‘‘రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో..

చేతగానప్పుడు చెప్పడమెందుకు?
కనపర్తి ఇంటిస్థలాల వద్ద లబ్ధిదారులకు నచ్చచెబుతున్న హౌసింగ్‌ ఏఈ చెన్నారెడ్డి

సమావేశంలో ఇంటిస్థలాల లబ్ధిదారుల ఆగ్రహం

ఇళ్లను ప్రభుత్వమే కట్టివ్వాలని డిమాండ్‌


చెన్నూరు(కడప): ‘‘రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఇంటిస్థలాలు మంజూరు చేసి అందులో ఇంటి నిర్మాణాలు చేపడతామని ఆర్భాటంగా చెప్పి, ఈ రోజు మీరే కట్టుకోండని అంటే మా దగ్గర డబ్బెక్కడుంది. చేతగానప్పుడు చెప్పడమెందుకు? ఇంటిస్థలాలు ఇవ్వడమెందుకు..’’ అని చెన్నూరు మండలంలోని చెన్నూరు, కొండపేట ప్రజలు హౌసింగ్‌ ఏఈ చెన్నారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక జియోట్యాగ్‌ తీసుకోమని కోరినా తీసుకోకుండా, సమావేశం పెట్టినా ఎవరికి కావాల ఈ సమావేశమంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు. వివరాలు ఇలా..


చెన్నూరుతో పాటు కొండపేట, బలసింగాయపల్లె, రామనపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు జగనన్న ఇంటిస్థలాలను కనపర్తి రెవెన్యూ గ్రామంలో ఇచ్చారు. ప్రభుత్వం మూడు రకాల ఆప్షన్లు ఇచ్చింది. ఒకటి.. ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుంది, లబ్ధిదారుడే ఇల్లు కట్టుకోవలి. రెండు.. ప్రభుత్వం రూ.1.80 లక్షల మెటీరియల్‌ ఇస్తుంది. లబ్ధిదారుడే ఇల్లు కట్టుకోవాలి. మూడోది... ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుంది. కాగా.. ఇంటి నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్‌ ధరలు విపరీతంగా పెరగడంతో చాలా మంది మూడో ఆప్షన్‌ ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే హౌసింగ్‌ ఏఈలను ఇంటిస్థలాలు ఇచ్చిన ప్రాంతాలకు పంపించి అక్కడ జియోట్యాగ్‌ తీసుకోవాలని చెప్పింది. దీంతో సోమవారం హౌసింగ్‌ ఏఈ చెన్నారెడ్డి చెన్నూరు నుంచి 50 మంది లబ్ధిదారులను ఆటోల్లో తీసుకుని ఇంటిస్థలాలు ఇచ్చిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ జియోట్యాగ్‌ తీసుకుంటామని, ఇక్కడ సొంతంగా మీరు ఇల్లు కట్టుకోవాలని, ఈ మేరకు ప్రభుత్వం రూ.1.80 లక్షల చొప్పున ఇస్తుందని చెప్పడంతో ఒక్కసారిగా లబ్ధిదారులు హౌసింగ్‌ ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘ప్రభుత్వం చేతగాకపోతే మాకు ఇంటిస్థలాలు ఎందుకివ్వాలి? మొదట వాళ్లే కట్టిస్తామన్నారు. అలా కాకుండా మమ్మల్నే సొంతంగా కట్టుకోమంటే డబ్బులు ఎలా వస్తాయి? ఆ మొత్తం దేనికి సరిపోతుంది? పని బాట చేసుకోకుండా మమ్మల్ని ఇంత దూరం ఎందుకు పిల్చుకొచ్చారు? ఎన్నికలకు ముందు ఈ విషయం తెల్సి ఉండింటే మేమేంటో చెప్పేవాళ్లం కదా’’ అని మండిపడ్డారు. హౌసింగ్‌ ఏఈ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాట ఎవ్వరూ వినలేదు. ‘‘మీ స్థలాలు వద్దు, మీ ఇల్లూ వద్దు. ఎవరి దగ్గర డబ్బుందని? మేమంతా పేదలమే. ప్రభుత్వమే మొదట కట్టిస్తుందని చెప్పారు కదా.. ఇప్పుడు మాట మార్చడమేంటి’’ అని ఒక్క లబ్ధిదారుడు కూడా జియోట్యాగ్‌ చేయించుకోకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు.


తరువాత కొండపేట గ్రామంలో హౌసింగ్‌ ఏఈ లబ్ధిదారులను పిలిపించి సమావేశం నిర్వహించారు. వారికి కూడా ప్రభుత్వం సెకండ్‌ ఆప్షన్‌ కింద మెటీరియల్‌ ఇస్తాం, ఇల్లు కట్టుకోండని చెప్పడంతో వారంతా ఒక్కసారిగా మండిపడ్డారు. ‘‘ఇలాంటి సలహాలు ఇచ్చేదానికా.. మమ్మల్ని ఇంతదూరం పిలిపించింది.. మా దగ్గర డబ్బులేమైనా కారుతున్నాయా? ఇలా చేస్తే ఎలా? రూ.1.80లక్షలకు ఇంటి నిర్మాణం జరుగుతుందా? ఆ మొత్తం పునాదికి కూడా రాదు. అనవసరంగా ఈ సమావేశాలు ఎందుకు’’ అని మండిపడుతూ సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు. హౌసింగ్‌ ఏఈ ఎంత నచ్చచెప్పినా ఆయన మాట ఎవరూ వినలేదు.


ఈ వ్యవహారంపై హౌసింగ్‌ ఏఈ చెన్నారెడ్డిని వివరణ కోరగా హౌసింగ్‌ అధికారులు చెప్పిందే తాను లబ్ధిదారులకు చెప్పానన్నారు. మూడో అప్షన్‌ ఒంటరి మహిళలకు, వికలాంగులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందన్నారు. మొదటి రెండు ఆప్షన్లు మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారన్నారు. లబ్ధిదారులే ఇల్లు కట్టుకుంటే రూ.1.80లక్షలకు మెటీరియల్‌ లేదా డబ్బు ప్రభుత్వం ఇస్తుందన్నారు.

Updated Date - 2021-02-23T05:16:10+05:30 IST