నమాజ్‌కు లేని ఆంక్షలు హనుమాన్ చాలీసాకు ఎందుకు? : అమిత్ మాలవీయ

ABN , First Publish Date - 2022-04-27T00:01:04+05:30 IST

మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా పఠనంపై వివాదం రేగిన నేపథ్యంలో బీజేపీ

నమాజ్‌కు లేని ఆంక్షలు హనుమాన్ చాలీసాకు ఎందుకు? : అమిత్ మాలవీయ

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా పఠనంపై వివాదం రేగిన నేపథ్యంలో బీజేపీ నేత అమిత్ మాలవీయ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. అనేక సంవత్సరాలుగా ముస్లింలు రోడ్లపై నమాజు చదువుతున్నా, ఆజాన్‌ను రోజుకు ఐదుసార్లు వినిపిస్తున్నా, మసీదులు, ఇళ్ళ లోపలి భాగాల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని వారిని ఎవరూ అడగలేదని, హనుమాన్ చాలీసాను మాత్రం బహిరంగంగా పఠించకూడదని అంటున్నారని పేర్కొన్నారు. 


బాధాకరమైన రీతిలో మతం ఆధారంగా దేశ విభజన జరిగిన తర్వాత మైనారిటీలకు రాయితీలను కొనసాగిస్తుండటం స్వతంత్ర భారత దేశ విశిష్ట లక్షణానికి తూట్లు పొడవడమేనని పేర్కొన్నారు. 


హనుమాన్ చాలీసా వివాదానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే, మహారాష్ట్రలో మసీదుల నుంచి పెద్ద శబ్దంతో ఆజాన్‌ను వినిపించడం మానేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఇటీవల హెచ్చరించారు. గుడి పడవ (మరాఠీల ఉగాది) సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మసీదులలోని లౌడ్‌స్పీకర్లను ఆపాలని, లేనిపక్షంలో తాము మసీదుల ఎదురుగా హనుమాన్ చాలీసాను పఠిస్తామని ప్రకటించారు. మే 3 లోగా మసీదులలోని లౌడ్‌స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. 


ఇదిలావుండగా, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించారు. దీంతో శనివారం వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వీరికి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. వీరి బెయిలు దరఖాస్తులపై సమాధానాన్ని శుక్రవారం సమర్పించాలని పోలీసులను ముంబై సెషన్స్ కోర్టు ఆదేశించింది. 


Updated Date - 2022-04-27T00:01:04+05:30 IST