కవులు, రచయితలు సంకుచిత ప్రాంతీయ తత్త్వాలకు మద్దతునివ్వడం శోచనీయం. ఉద్యమకాలంలో సాటి తెలుగు ప్రజలే అయిన ఆంధ్రులకు వ్యతిరేకంగా తెలంగాణా సామాన్య జనాన్ని రెచ్చగొట్టడానికి, సంఘటితం చేయడానికి రాజకీయ నాయకులకు ఉపయోగపడ్డ రచయితలు నేడు తెలంగాణా ప్రజాసమస్యలపై మాత్రం అదే స్థాయిలో గళం విప్పట్లేదు. ఇప్పుడు రాయలసీమలో ఖ్యాతి చెందిన రచయితలు మూడు రాజధానుల విధానానికి మద్ధతుగా, కర్నూల్‌లో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని సభల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీమకు నీళ్ళు కావాలి, పరిశ్రమలు కావాలి, సీమ యువతకు సీమలోనే ఉపాధి దొరకాలి అని మాత్రం నినదించట్లేదు. అప్పులతో నడుస్తున్న రాష్ట్రం, రాజధాని ఏదో చెప్పలేని రాష్ట్రం అన్న అపఖ్యాతులు వీరిని కదిలించట్లేదు. సామాజిక దృక్పధం గల కవులు, రచయితలు ప్రగతిశీల శక్తులకు ఊతమవ్వాలి. ఆదర్శ సమాజ నిర్మాణం దిశగా నిత్యమూ ప్రజలను చైతన్యవంతులనుజేయాలి. అంతేగానీ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని విభజించజూసే రాజకీయ నాయకులకు పనిముట్లుగా మారకూడదు.
గౌరాబత్తిన కుమార్ బాబు