‘రాజన్న’ భక్తులపై వివక్ష ఎందుకు..?

ABN , First Publish Date - 2022-01-25T06:37:52+05:30 IST

వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి పేద భక్తులే వస్తారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించ కుండా వివక్ష ఎందుకు చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సోమవారం వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు.

‘రాజన్న’ భక్తులపై వివక్ష ఎందుకు..?
ఎంపీ బండి సంజయ్‌కు స్వాగతం పలుకుతున్న ఈవో

- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌

సిరిసిల్ల రూరల్‌/వేములవాడ టౌన్‌, జనవరి 24: వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి పేద భక్తులే వస్తారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించ కుండా వివక్ష ఎందుకు చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు.  సోమవారం వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేడారం జాతర సందర్భంగా నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు రాజన్న ఆలయానికి తరలివస్తున్నారని,  కనీస సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ రాజన్నకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాజన్న ఆలయానికి వచ్చేది పేద భక్తులేనని, ఆలయాభివృద్ధిపైనా పేద భక్తులపైనా ప్రభుత్వం ఎంత వివక్ష చూపుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మాట్లాడిన సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉం దన్నారు. రాజన్న ఆలయానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రసాద్‌’ పథ కం కింద అభివృద్ధి చేసేందుకు ప్రతి పాదనలు ఇవ్వాలని కోరామని, ఇప్పటికీ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తే బీజేపీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రతిపాదనలు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కట్కం మృత్యుం జయం, మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎర్రం మహేష్‌ ఉన్నారు. 

ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బీజేపీ అండ

సిరిసిల్ల రూరల్‌ : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తున్న జీవో 317ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.  సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశంలో  మాట్లాడారు.  ఉద్యోగులు, ఉపాఽధ్యాయులు 317 జీవోతో ఇబ్బందులు పడుతున్నారని దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని చేసేందుకు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల నుంచి ఇప్పటి వరకు 2లక్షల మంది ఫోన్‌ నంబర్లు సేకరించామని తెలిపారు.  ఈ నెల 28 నుంచి 31 వరకు ఆ ఉద్యోగులతో వర్చువల్‌ సమావేశాన్ని విడు తుల వారీగా నిర్వహించనున్నట్లు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడుతారన్నారు.   రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి జీవోను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్నసమస్యలపై బీజేపీ పోరాటాలు చేస్తుందని తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి కొవిడ్‌ గుర్తుకొస్తుందన్నారు. 317 జీవోపై కరీంనగర్‌లో తాను దీక్ష చేసేందుకు ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా అరెస్ట్‌ చేయించిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవడంతో నియోజకవర్గాల్లో పర్యటించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల సమస్యలను పరిష్కరిం చాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం  కృషి చేయాలని కోరారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం ప్రకటించిన దళిత బంధు పథకాన్ని అక్కడ సక్రమంగా అమలు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రులు ప్రకటించారన్నారు.  ముఖ్యమంత్రి కేసీఅర్‌ జిమ్మిక్కుల పరిపాలనను ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.     పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపీ, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, జిల్లా ఇన్‌చార్జి గంగాడి మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవు నూరి రామకాంత్‌రావు, ఎర్రం మహేష్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం వెంకటలక్ష్మి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి గౌడ వాసు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బర్కం నవీన్‌యాదవ్‌, కౌన్సిలర్లు బోల్గం నాగరాజుగౌడ్‌, గుడూరి భాస్కర్‌, చెన్నమనేని కమలాకర్‌రావు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణువర్ధన్‌, పట్టణ అఽధ్యక్షుడు మల్లఢపేట భాస్కర్‌, జిల్లా కార్యదర్శి వంగ అనిల్‌కుమార్‌గౌడ్‌, మ్యాన రాంప్రసాద్‌, చింతల్‌ఠాణా నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

కార్యకర్తలే లీడర్లు

పదవులు రాలేదని కార్యకర్తలు నిరాశకు గురికావద్దని బీజేపీలో కార్యకర్తలే లీడర్లని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.  భారతదేశానికి ప్రధానిగా నరేంద్రమోదీ దొరకడం గొప్ప వరమన్నారు. దేశం కోసం ప్రతీ రోజు 18 గంటలు పని చేస్తున్న గొప్ప వ్యక్తి అని అన్నారు.  నిజాం కన్న ఘోరంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగుతోందన్నారు.  కరీంనగర్‌ బీజేపీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న సందర్భంలో పోలీసులు అరెస్టు చేసిన విషయంపై ప్రధాని మోదీ తనతో ఫోనులో మాట్లాడారన్నారు. కార్యకర్తలను నిరాశ చెందవద్దన్నారని, జైలుకు వెళ్లిన కార్యకర్తలను మెచ్చుకున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని పేర్కొన్నారన్నారు. కేసీఆర్‌ బీజేపీకి భయపడుతున్నారని, అందుకనే  బీజేపీ కార్యకర్తలను, నాయకులను ముందస్తు అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు.   కేసీఆర్‌ మాటలు ప్రజలు నమ్మడం లేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రూప్‌ రాజకీయాలు చేస్తే ఎంతటి వారినైనా సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. క్రమశిక్షణతో పని చేసిన వారికి తప్పకుండా పదవులు వస్తాయన్నారు.   కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎంపీపీ బండ మల్లేశం నాయకులు ఎర్రం మహేష్‌, కుమ్మరి శంకర్‌, రమాకాంత్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-01-25T06:37:52+05:30 IST